పార్టీ మారేది లేదనేశాడు

July 03, 2020

 తాజా ఎన్నికల్లో ఓటమితో అప్పటిదాకా టీడీపీలోనే కొనసాగిన నేతల్లో కొందరు పార్టీని వీడారు. పదవులు, అధికారమే పరమావధిగా పరిగణిస్తున్న నేతలు కొందరు ఇప్పటికే పార్టీ మారగా... మరికొందరు అదే బాటలో నడుస్తున్నారన్న వార్తలు నిజంగానే టీడీపీ శ్రేణులను కలవరానికి గురి చేసేవే. ఇలాంటి వార్తల్లో బెజవాడ సెంట్రల్ మాజీ ఎమ్మోల్యే బొండా ఉమామహేశ్వరరావు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడితో భేటీ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బాబుతో భేటీ తర్వాత పార్టీ మారేది లేదంటూ బొండానే స్వయంగా వెల్లడించారు.

ఈ ఎపిసోడ్ లో కాస్త వెనక్కెళితే... ట్విట్టర్ వేదికగా బొండా పోస్ట్ చేసిన ఓ ట్వీట్... బొండా పార్టీ మారుతున్నట్లుగా వార్తలకు కారణమైంది. ఆ తర్వాత దానిపై బొండా క్లారిటీ ఇవ్వకుండానే గుంభనంగా ఉండిపోవడం, ఆ వార్తలను ఖండించకపోవడంతో బొండా నిజంగానే పార్టీ మారుతున్నారేమోనన్న వాదన వినిపించింది. ఈ క్రమంలో మొన్నవిదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన బొండాతో విజయవాడ అర్బన్ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న భేటీ అయ్యారు. అప్పుడు కూడా పార్టీ మారే ఉద్దేశ్యం తనకు లేదని బుద్ధాకు చెప్పిన బొండా... చంద్రబాబుతో భేటీ తర్వాత మరింత క్లారిటీ ఇస్తానని చెప్పారు.

తాజాగా సోమవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన బొండా పార్టీ అధినేతతో చర్చించారు. ఈ చర్చల్లో భాగంగా పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలూ ప్రస్తావనకు వచ్చాయట. దీంతో ఫుల్ క్లారిటీ ఇచ్చిన బొండా... తాను టీడీపీని వీడేది లేదంటే చంద్రబాబుకు చెప్పేశారట. సో... బాబుతో భేటీ ీతర్వాత బొండా పార్టీ మారుతున్నట్లుగా వచ్చిన వార్తలన్నీ గాలి వార్తలేనని తేలిపోయిందన్న మాట.