`బోరుబావి చిన్నారి` విషాద గాథలో ఈ నిజం గుండెలు పిండిస్తోంది

August 07, 2020

చిన్న అజాగ్ర‌త, నిర్లక్ష్యంతో దారుణం జ‌రిగిపోయింది. ఓ చిన్నారి క‌న్నుమూశాడు. మెదక్‌ జిల్లా పొడ్చన్‌పల్లిలో తాత వెంట పొలానికి వెళ్లిన బాలుడు సాయివ‌ర్ధ‌న్‌ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన ఉదంతం తెలిసిందే. అతడిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, రెస్క్యూటీం బృందాలు రంగంలోకి దిగిన‌ప్ప‌టికీ ఫ‌లితం ద‌క్క‌లేదు. 12 గంటల పాటు పడిన శ్రమ ఫలించక బాలుడు విగత జీవిగా కనిపించాడు. బోరుబావి నుండి బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆక్సిజన్‌ అందక బాలుడు మృతిచెందినట్లుగా గుర్తించారు. మీద మట్టిపెల్లలు పడటంతో ఆక్సిజన్ అందలేదు.

పోడ్చన్‌పల్లి గ్రామానికి చెందిన మంగళి భిక్షపతి తన వ్యవసాయ పొలం వద్ద మంగళవారంరాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు మూడుబోర్లు తవ్వించాడు. అయితే, నీళ్లు పడకపోవడంతో బుధవారమే కుటుంబసభ్యులతో కలిసి వాటిని పూడ్చేందుకు ఉపక్రమించాడు. గ్రామానికి సుమారు కిలోమీటరు దూరంలోని పొలం వద్దకు భిక్షపతి వెంట కుటుంబసభ్యులతోపాటు, అతని కూతురు నవనీత కుమారుడు మూడేళ్ల‌ సాయివర్ధన్‌ కూడా వచ్చాడు.

మూడు బోరుబావులలో ఒకదానిని పూడ్చుతుండగా.. సాయివర్ధన్‌ ఆడుకుంటూ సమీపంలోని మరో బోరుబావి గుంతలో పడిపోయాడు. గమనించిన భిక్షపతి వెంటనే పాపన్నపేట పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలిసిన వెంటనే కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎస్పీ చందనాదీప్తి, ఆర్డీవో సాయిరాం సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఎన్డీఆర్‌ఎఫ్‌, రెస్క్యూటీంలను రప్పించారు. 108 వాహనంతోపాటు, అగ్నిమాపక యంత్రం చేరుకుంది. ముందుగా బోరుబావిలోకి ఆక్సిజన్‌ను పంపించి, బాలుడిని రక్షించేందుకు ప్ర‌యత్నించారు. జేసీబీతో బోరుచుట్టూ తవ్వారు. రాత్రి కావడంతో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటుచేసి..బాలుడిని రక్షించేందుకు అన్నిచర్యలు తీసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆ బాలుడి ప్రాణాలు ద‌క్క‌లేదు. పొలం వద్ద నీళ్ల కోసం తాత వేయించిన బోరుబావి మనుమడి పాలిట శాపమైంది.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్‌ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

కాగా, మెదక్ ‌జిల్లాలో మూడేళ్ల‌ బాలుడు బోరుబావిలో పడిన నేపథ్యంలో ఈ అంశాన్ని ప్ర‌భుత్వం సీరియస్‌గా తీసుకుంది.  నిరుపయోగంగా ఉన్న బోరు బావులన్నింటినీ మూసివేయాలని ఎంఏయూడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ మున్సిపల్‌ కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. జూన్‌ 1 నుంచి నిర్వహించనున్న ఇన్సెంటివ్‌ శానిటేషన్‌ డ్రైవ్‌లో ఈ అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని ఆదేశించారు. 

మొత్తం ఎపిసోడులో కొన్ని విషయాలు అందరినీ కంట తడిపెట్టిస్తున్నాయి. చాలా మంది బోరుబావులను నీళ్లు పడకపోతే పూడ్చరు. కానీ పాపం వీళ్లు బాధ్యతగా కొన్ని గంటల్లోనే పూడ్చడానికి సిద్ధమయ్యారు. విచిత్రం ఏంటంటే... తాము బోరు వేసింది నీళ్ల కోసమా? మా పిల్లాడిని చంపడం కోసమా? అని ఏడుస్తున్న తీరు అందరికీ కంటతడ పెట్టించింది. తెలిసి తెలిసి పిల్లాడిని చంపుకున్నామే అని కన్నీరు పెట్టారు వాళ్లు. సొంత బోరు బావిలో పడి చిన్నారి చనిపోవయడాన్ని ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.