ఇప్పటికీ వరల్డ్ ఫేమస్ కంపెనీ... కానీ షాపులన్నీ మూసేసింది?

August 08, 2020

ఆ కంపెనీ పేరు చెబితే క్వాలిటీయే గుర్తువస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కాస్త మంచిగా చదువుకున్న అందరికీ బాగా తెలిసిన పేరది. కానీ అలాంటి కంపెనీ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను పీకేసింది. కారణం నష్టాలు కాదు. తమ స్టోర్లను మూసేసింది దీనికి కూడా కారణం నష్టాలు కాదు. మరేంటి? అదే తెలుసుకందాం. 

బోస్ ... పర్ ఫెక్ట్ క్వాలిటీ సౌండ్ కి చిరునామా. సంగీత ప్రియులకు ప్రాణం. 1964లో అమెరికాలో స్థాపించిన ఈ సంస్థ ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. దీనిని నెలకొల్పిన వ్యక్తి అమర్ బోస్. 2019 నాటికి దీని రెవెన్యూ 4 బిలియన్ డాలర్లు.  ఈ కంపెనీ ఉత్పత్తులను వెళ్లి చూసి కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్వాలిటీలో రాజీ ఉండదు. అందుకే ఆర్డర్స్ అన్నీ ఆన్ లైన్లో వస్తున్నాయి. దీంతో ఫిజికల్ స్టోర్లు ఖర్చు దండగ అని కంపెనీ భావించింది. అందుకే అమెరికాతో పాటు పలు దేశాల్లోని 119 స్టోర్లను మూసివేస్తోంది. 

అయితే.. ప్రస్తుతానికి ఈ మూతబడుతున్న స్టోర్లలో ఇండియా లేదు. త్వరలో వాటిని కూడా మూసేయచ్చని తెలుస్తోంది. పబ్లిక్ కంపెనీ కాకపోవడంతో కంపెనీ ఈ విషయంపై స్వతంత్రంగా నిర్ణయం తీసేసుకుంది. మొత్తం ఈ సంస్థలో 9 వేల మంది ఉద్యోగులు ఉండగా... మరి ఎంత మంది తొలగించిన విషయమూ ఆ కంపెనీ వెల్లడించలేదు.