బోస్టన్ కమిటీపై జగన్ ఆగ్రహం 

May 31, 2020

జగన్... తాను చెప్పింది, తనకు నచ్చింది జరగాలనుకునే మనస్తత్వం ఉన్న నాయకుడు. ఇలాంటి లక్షణం ఒక ప్రైవేటు కంపెనీ నడపడంలో పనికొస్తుందేమో గాని... ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాన్ని నడపడానికి పనికొస్తుందా?  అది ప్రజలు మెల్లగా తెలుసుకుంటారు. మాట మీద నిలబడటంలో తమదే ట్రేడ్ మార్క్ అని చెప్పే జగన్ రెడ్డి... కొన్ని వందల విషయాల్లో మాట తప్పారు. మడమ తిప్పారు. అందులో అతిపెద్దది ఎన్నికల ముందు అమరావతి మార్చను అని ప్రజలకు తాను చెప్పి, తన నేతల చేత చెప్పించి... ఇపుడు యు టర్న్ తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్. ముందే రాజధాని మార్పు గురించి చెప్పి ఉంటే... దానికి అనుగుణంగా ప్రజలు తమ తీర్పు చెప్పేవాళ్లు. 

ఇక రాజధాని విషయంలో ప్రపంచంలో విఫలమైన ఒక విధానాన్ని మొండిగా నెత్తికి ఎత్తుకున్నారు జగన్. మూడు రాజధానులు పెట్టుకున్న వారే తీసేయాలని ఆలోచన చేస్తున్న క్రమంలో జగన్ ఒక అవుట్ డేటెట్ విధానాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే... తన ఆలోచన అని చెబితే దాని శాస్త్రీయత ఏంటని విమర్శలు వస్తాయని... తన ఆలోచనను నివేదికగా తయారుచేయమని ఒక ప్రభుత్వ కమిటీని, ఒక ప్రైవేటు కమిటీని నియమించారు. ప్రభుత్వ కమిటీలో తనకు నచ్చిన అధికారులను ఎంచుకున్నారు... వారు జగన్ చెప్పింది రాసుకువచ్చారు. అదే విధంగా ప్రైవేటు నివేదిక కోసం కూడా తనకు నచ్చిన కంపెనీని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే... ఎంత తనకు తెలిసిన కంపెనీ అయినా అది తన రెప్యుటేషన్, రేటింగ్స్ చూసుకుంటుందిగా... అక్కడే జగన్ కి ఊహించని షాక్ తగిలింది.  

బోస్టన్ కమిటీ రాజధాని గురించి అభివృద్ధి వికేంద్రీ కరణ గురించి నివేదిక తయారుచేసింది. అందులో జగన్ చెప్పింది రాసింది. అలాగే తన రెప్యుటేషను పాడవకుండా భవిష్యత్తులో తమ కంపెనీ క్రెడిబులిటీ దెబ్బతినకుండా చూసుకోవడానికి మూడు రాజధానుల ప్రతికూలతలు కూడా పేర్కొంది. వైజాగ్ కు భవిష్యత్తులో ముప్పు అనేక రకాలుగా పొంచి ఉందని అందులో పేర్కొంది. ఈ నివేదిక చూసిన జగన్ షాక్ తిన్నట్లు సమాచారం. బోస్టన్ కమిటీపై తన అసహనం వ్యక్తంచేసినట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకే ఆ నివేదిక సారాంశాన్ని తప్ప మొత్తం నివేదిక బయటపెట్టలేదు. అయితే... తాజాగా ఆ నివేదిక బయటకు వచ్చింది. మీడియాలో వైరల్ అయ్యింది. దాని ప్రకారం వైజాగ్ రాజధానికి ప్రమాదకరమైన ఎంపిక అని తెలుస్తోంది.

తుఫాను ముప్పు, యుద్ధం ముప్పు, కలుషిత భూగర్భ జలాలు, పారిశ్రామిక కాలుష్యం, సముద్రపు నీటి మట్టం పెరుగుదల ఇవన్నీ పొంచి ఉన్నాయని పేర్కొంది. ఇన్ని ప్రమాదాల మధ్య విశాఖ బెటర్ ఆప్షన్ కాదేమో అన్నట్టు కారణాలన్నీ రాసింది. అదిపుడు బయటకు రావడంతో ప్రభుత్వం నాలిక్కరుచుకుంది. మీడియా, ప్రతిపక్షాలు, ప్రజలు బోస్టన్ నివేదికలో విషయాలు చూసి షాక్ తిన్నాయి. దీనిపై వివరణ ఇచ్చుకోలేక పట్టణ మంత్రి బొత్స సత్యనారాయణ తడబడ్డారు. తుఫాన్లు అన్ని నగరాల్లో వస్తాయని దాటవేసే ప్రయత్నం చేశారు. అయినా... చంద్రబాబు అప్పట్లో దాన్ని చెత్తలో వేసి కాల్చేశారుగా దాని గురించి ఎందుకు అడుగుతున్నారు అంటూ విచిత్రమైన సమాధానం చెప్పారు. ఈ నివేదికను చదివిన జనం... అమ్మ జగన్... మరీ ఇంత దారుణమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కానీ తొక్కలో ప్రజలు ప్రశ్నిస్తే పట్టించుకోవాలా? మరో నాలుగున్నరేళ్లు వాళ్లకు నాకు సంబంధం లేదన్నట్టు ఎవరి విమర్శలను లెక్క చేయడం లేదు ముఖ్యమంత్రి జగన్.