మళ్లీ రాజధానిని కెలికిన బొత్స... మర్మమేమిటి?

July 04, 2020

మంత్రిగా అనుభ‌వం ఉన్న నేత‌. పీసీసీ అధ్య‌క్షుడిగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌నిచేసిన అనుభ‌వం ఉన్న నాయ‌కుడు. దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి న‌మ్మిన‌బంటుగా ముద్ర ప‌డిన నేత‌. ఆనాడు తండ్రి వ‌ద్ద ప‌నిచేసిన ఈ నేత‌, ఇప్పుడు ఆ మహానేత త‌న‌యుడు వద్ద కూడా అదే న‌మ్మ‌కంతో ప‌నిచేస్తున్న ఈనేత ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడుతారు.. అంత‌టి అనుభ‌వం ఉన్న ఈ నేత ఇప్పుడు అమ‌రావ‌తిపై చేసిన కామెంట్లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఇప్ప‌టికే న‌వ్యాంధ్రప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంపై గ‌తంలోనూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసి ఏపీలో రాజ‌కీయ ర‌చ్చ లేపిన ఈ మంత్రి ఇప్పుడు మ‌రోమారు అదే అమ‌రావ‌తిపై సంచ‌ల‌న కామెంట్లు చేసి మ‌రోమారు రాజ‌కీయ చ‌ర్చ‌కు తెర‌లేపారు.
ఇంత‌కు ఆ మంత్రి ఎవ్వ‌రో చెప్ప‌లేదు క‌దూ.. ఏపీ పుర‌పాల‌క శాఖ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌. ఇప్పుడు బొత్స చేసిన కామెంట్లు రాజ‌కీయ వేడిని ర‌గిలించాయి.. ఏపీకి రాజ‌ధాని అత్య‌వ‌స‌రం అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. ఆయ‌న మాట‌ల్లోనే రాజ‌ధానిపై ఎమ‌న్నారో ఓసారి చూద్దాం.. గ‌త ప్ర‌భుత్వం అమ‌రావ‌తిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జ‌రిగిందనే ఆరోప‌ణ‌లు చేశారు. శివ‌రామ కృష్ణ‌న్ క‌మిటీ నివేదిక‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండానే రాజ‌ధాని ఏర్పాటుకు సిద్ద‌మైంద‌ని విమ‌ర్శించారు.
రాజధాని ఎక్కడ ఉండాలి? ఎలా ఉండాలి? ఏ ప్రాంతాభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై అధ్యయనానికి నిపుణుల కమిటీని నియమించామని, ఈ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి నివేదికను రూపొందిస్తుందని, మూడు నాలుగు రోజుల్లో నిపుణుల కమిటీ తన పర్యటనలు ప్రారంభిస్తుందని బొత్స వివ‌రించారు. కమిటీ నివేదికలోని సిఫార్సులపై కేబినెట్‌లో చర్చించి, ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వపరంగా ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం తాత్కాలిక సెక్రటేరియట్‌ ప్రాంతంలో వర్షం పడితే ముంపునకు గురయ్యే ప్రమాదముందని ఆయన అన్నారు.
ఇక్కడ ఒక భవనం నిర్మించాలంటే పునాదులు 100 అడుగుల లోతులో తవ్వాల్సి వస్తుందని, దీనికి ఖర్చు కూడా చాలా అవుతుందని ఆయన అన్నారు. ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగమై, అవినీతి చోటుచేసుకుందని వ్యాఖ్యానించారు. ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు ఇబ్బందులు ఎదురువుతాయని, వీటన్నింటనీ నిపుణుల కమిటీ పరిశీలిస్తుందని బొత్స తెలిపారు. అమరావతిలో నిలిచిపోయిన పనుల్లో అవసరమైన వాటి పూర్తిచేస్తామని, అవసరం లేనివి నిలిపేస్తామని మంత్రి పేర్కొన్నారు. అలాగే హైకోర్టు విషయంలో రాయలసీమ, అమరావతి, ఉత్తరాంధ్రలో వస్తున్న డిమాండ్లను, ఆందోళ‌న‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఈ కమిటీ పరిశీలిస్తుందని ఆయ‌న‌ అన్నారు.
ఏపీలోని  13 జిల్లాలు అభివృద్ధి కావాలన్నది సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష అని బొత్స ప్ర‌క‌టించారు. ఏదేమైనా ఏపీకి రాజ‌ధాని ఎక్క‌డ నిర్మించాల‌నేది క‌మిటీ సిఫార‌సు చేస్తుంది అని బొత్స అన్నారంటే ఇక అమ‌రావ‌తిలో రాజ‌ధాని నిర్మాణం లేన‌ట్టే లెక్క‌. ఎందుకంటే ఇప్ప‌టికే విజ‌య‌వాడ ప్రాంతంలో అతి భారీ భూకంపాలు వ‌స్తాయ‌నే రిపోర్టు వ‌చ్చింది. దీంతో బేస్ చేసుకుంటే రాజ‌ధాని నిర్మాణం అమ‌రావ‌తి నుంచి మ‌రో ప్రాంతానికి త‌ర‌లిపోవ‌డం ఖాయ‌మ‌నే వినిపిస్తుంది. సో ఇదే బొత్స స‌త్య‌నారాయ‌ణ మాటల్లోని మ‌ర్మం కాబోలు..