జగన్‌ను బొత్స ఇరకాటంలో పడేశారా?

July 15, 2020

గతంలో మూడు రాజధానుల అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ రావు చేసిన వ్యాఖ్యలే తొలుత కలకలం రేపాయి. ఆ తర్వాత అవి నిజమయ్యాయి. ఇప్పుడు మరోసారి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రివర్గంలో చేరికపై ఆయన చేసిన వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు నుండే బీజేపీ-వైసీపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు బొత్స వ్యాఖ్యలతో కేంద్రమంత్రి వర్గంలో వైసీపీ చేరే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు. గతంలో అమరావతిపై ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయని లాజిక్ లాగుతున్నారు.

శుక్రవారం బొత్స మాట్లాడుతూ కేంద్ర మంత్రివర్గంలో వైసీపీ చేరాలనే ప్రతిపాదన వస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, దీని కోసం ఎవరి గెడ్డమైనా పట్టుకోవడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. కేంద్రంతో ఘర్షణ ఎందుకు పడాలన్నారు. బీజేపీకి దగ్గరగా లేదా దూరంగా లేమని తెలిపారు. ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలిగితే మాత్రం ఉపేక్షించమని స్పష్టం చేశారు.

ఐతే బొత్స చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. కేంద్రం మెడలు వంచైనా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకు వస్తామని వైసీపీ చెప్పింది. అలాగే, ఇటీవల బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు, బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పరిశీలిస్తామని చెప్పడమేమిటనేది విపక్షాల నుండి వస్తున్న ప్రశ్న. కనీసం హోదాపై ఏమైనా ఆశలుంటే మద్దతిస్తే అర్థం ఉంటుందని, కానీ ఇవ్వలేమని తేల్చేసిన బీజేపీతో జట్టు ఎలా కడతారని ప్రశ్నిస్తున్నారు.

పైగా ఏపీకి విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదని బొత్స ఆ వెంటనే చెప్పారని, కానీ హోదా ఇవ్వకపోవడం.. బడ్జెట్‌లో సరైన కేటాయింపు లేకపోవడం... పెండింగ్ నిధులు విడుదల చేయకపోవడం ద్వారా ఏపీకి అన్యాయం జరుగుతోందని, ఇది ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలిగినట్లుగా వైసీపీకి కనిపించడం లేదా అని నిలదీస్తున్నారు. చేతులెత్తేసిన పార్టీతో కలిసే ప్రతిపాదనను పరిశీలిస్తామని చెప్పడం వెనుక ఏదో ఉందని టీడీపీ అంటోంది. అవసరమైతే బీజేపీతో కలుస్తామని చెప్పడం వెనుక కేసుల మాఫీ, ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఉందని టీడీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. ఓ వైపు ఏపీకి ఏమీ చేయడం లేదంటూనే కలిసే అవకాశాలు పరిశీలిస్తామని చెప్పడం వెనుక ఏదో మతలబు ఉందనేది ప్రతిపక్షాల ఆరోపణ.