ఘోరం.. పొలంలో మూత్రం పోశాడ‌ని చంపేశారు

April 05, 2020

కాలం చాలా మారిపోయింది.. ఇంకా కులాలేంటి.. ప‌ట్టింపులేంటి అంటుంటారు కానీ.. ఇప్ప‌టికీ కొన్ని ప్రాంతాల్లో కుల వివ‌క్ష రాజ్య‌మేలుతూనే ఉంది. ద‌ళితుల్ని అగ్ర వ‌ర్ణాల వాళ్లు ఎలా చూస్తున్నారో.. వారి ప‌ట్ల ఎంత క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారో చెప్ప‌డానికి తాజా ఉదంతం రుజువు. త‌మిళ‌నాట ఘోరం చోటు చేసుకుంది. ఓ పెద్ద కులానికి చెందిన వ్య‌క్తుల పొలంలో మూత్ర విస‌ర్జ‌న చేసినందుకు ఓ ద‌ళితుణ్ని తీవ్రంగా కొట్టి హింసించారు. అత‌ను గాయాల‌కు తాళ‌లేక ప్రాణాలు వ‌దిలాడు. ఈ ఘ‌ట‌న గురించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. వాస్త‌వంగా ఏం జ‌రిగింద‌న్న‌ది పూర్తిగా నిర్ధార‌ణ కావాల్సి ఉంది.
ఐతే ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం.. శ‌క్తివేల్ అనే 26 ఏళ్ల కుర్రాడిని అగ్ర కులానికి చెందిన వ్య‌క్తులు కొట్టి చంపేశారు. అత‌ను దారి వెంట న‌డుస్తూ ఒక పొలంలో మూత్ర విస‌ర్జ‌న చేశాడ‌ట‌. మా పొలంలో మూత్ర విస‌ర్జ‌న చేస్తావా అంటూ ఆ పొలం య‌జ‌మానులు, వారి కులానికి చెందిన వ్య‌క్తులు అత‌ణ్ని దండించార‌ట‌. శ‌క్తివేల్ వారితో వాద‌న‌కు దిగ‌డంతో కాళ్లు, చేతుల‌ను తాళ్ల‌తో క‌ట్టేసి తీవ్రంగా కొట్టార‌ట‌. శ‌క్తివేల్‌ను తాళ్ల‌తో బంధించ‌గా అత‌ను దీనంగా చూస్తున్న ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. శ‌క్తివేల్‌ను కొడుతుండ‌గానే  కుటుంబ స‌భ్యులు వ‌చ్చి స‌ర్దిచెప్పి అత‌ణ్ని ఇంటికి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. ఐతే బైక్ ఎక్కిన శ‌క్తివేల్ మ‌ధ్య‌లో ఒక చోట కింద ప‌డిన‌ట్లు తెలుస్తోంది. అత‌ణ్ని లేపి ఇంటికి తీసుకెళ్ల‌గా.. స‌రిగ్గా త‌న ఇంటి ముందుకు రాగానే కుప్ప‌కూలిపోయాడ‌ట‌. ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా.. శ‌క్తివేల్ అప్ప‌టికే మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు ధ్రువీక‌రించిన‌ట్లు స‌మాచారం. దీనిపై త‌మిళ‌నాడు అట్టుడుకుతోంది. ఈ ఉదంతం జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.