‘బ్రాండ్‌’ బాజా!

May 27, 2020

మద్యం విక్రయాల్లో జగన్మాయ
పాపులర్‌ కంపెనీలకు మంగళం
తమకు కమీషన్‌ ఇవ్వలేదనే!
మార్కెట్లోకి పనికిమాలిన బ్రాండ్లు
అయినా భారీగా ధరలు పెంపు
కేసుకు 10శాతం కమీషన్లు
‘సంపూర్ణ మద్యపాన నిషేధమే మా ఆశయం.. అయితే అది దశలవారీగా చేస్తాం.. ఏటా 20 శాతం షాపులు మూసేసి.. ఐదేళ్లలో నామరూపాలే లేకుండా చేస్తాం’ అని సీఎంగా పగ్గాలు చేపట్టిననాడు జగన్మోహన్‌రెడ్డి ఆర్భాటంగా ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఆయనిచ్చిన హామీని చాలామంది మహిళలు నమ్మి ఓటేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మద్యం పాలసీ  తేవడానికి ఆయనకు ఐదునెలలు పట్టింది. తెచ్చినా దానిని అమల్లోకి తేవడానికి మరో రెండు నెలలు తీసుకున్నారు. దరిదాపుగా 24 శాతం షాపులు మూసివేశామన్నారు. చంద్రబాబు హయాంలో వెలుగొందిన బెల్టుషాపులు తీసేశామన్నారు.. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే తద్విరుద్ధంగా జరుగుతోంది. టీడీపీ మద్దతుదారుల లైసెన్సులు రద్దుచేసేశారు. ఆ ఊళ్లలో షాపులు మూసేశామన్నారు. కానీ వైసీపీ నేతల ఆధ్వర్యంలో ఊరూరా.. సందుసందులో అనధికార విక్రయ కేంద్రాలు వచ్చేశాయి. ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలోనే మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. ఎంఆర్‌పీపై 30 శాతం అధిక పన్ను విధించారు. మద్యం ధరలు బాగా పెంచితే కొనకుండా ఉంటారట! తద్వారా డబ్బు ఆదా అవుతుందట! సిగరెట్లపై 70 ఏళ్లుగా పన్నులు విధిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఓ మాదిరి బ్రాండు సిగరెట్‌ రూ.50కి చేరినా కాల్చడం ఎవరైనా మానారా? మద్యం కూడా అంతే. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకూ తెలుసు. వారికి కావలసింది మద్యం కంపెనీల నుంచి కమీషన్‌. ఎవరెక్కువ కమీషన్‌ ఇస్తే ఆ బ్రాండ్లు మద్యం దుకాణాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. కమీషన్‌ ఇవ్వడానికి పాపులర్‌ బ్రాండ్లు ససేమిరా అనడంతో వాటికి ఆర్డర్లు ఇవ్వడం ఆపేశారు. దరిమిలా.. కొత్త కంపెనీలు రంగ ప్రవేశం చేశాయి. వీటి ఊరూపేరూ ఎవరూ వినలేదు. అయినా అవే కొనాల్సి వస్తోంది. ఉన్నది  ఈ బ్రాండ్లే.. కొంటే కొనండి.. లేకపోతే లేదు అని షాపుల ముందు బోర్డులు పెట్టేస్తున్నారు.
అజ్ఞాత వ్యక్తులతో డీల్‌ కుదుర్చుకోవాలి..
కంపెనీల వద్దకు అధికారులెవరూ వెళ్లడం లేదు. అజ్ఞాత వ్యక్తులే డీల్స్‌ కుదుర్చుకుంటున్నారు. ‘ఎవరో వస్తారు. మీ బ్రాండ్‌కు ఆర్డర్‌ రావాలంటే కేసుకు 10 శాతం కమీషన్‌ ఇవ్వాలని అడుగుతున్నారు. అందుకు సరేనంటే ఓకే. లేదంటే అప్పటి నుంచి మాకు ఎక్సైజ్‌ నుంచి ఆర్డర్లు ఆగిపోతున్నాయి. ఆ వచ్చిన వ్యక్తులెవరో మాకు తెలియదు. అధికారులు కూడా వారెవరో తెలియదనే అంటున్నారు. కానీ చిత్రంగా వారు వచ్చి వెళ్లాక మాకు ఆర్డర్లు మాత్రం రావట్లేదు’ అని మద్యం ఉత్పత్తిదారులు చెబుతున్నారు. అజ్ఞాత వ్యక్తులతో డీల్స్‌ కుదుర్చుకుంటేనే తమ కంపెనీలు ముందుకు సాగే దుస్థితి వచ్చిందని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రస్తుతం ఎక్సైజ్‌తో ఉన్న ఒప్పందాలు ముగియగానే మొత్తం రద్దు చేసుకుని వెళ్లిపోవడం తప్ప వేరే మార్గం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఎక్సైజ్‌ అధికారులు మాత్రం బుకాయిస్తున్నారు. చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయన్న కారణంతో డిస్టిలరీలే తమ మద్యం సరఫరా చేయట్లేదని, మేమేం చేస్తామని వాదిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సాధారణంగా వినియోగదారులు తాగే పాపులర్‌ బ్రాండ్లు షాపుల్లో కనుమరుగయ్యాయి. వాటి స్థానంలో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కొత్త కంపెనీలకు చెందిన ఎప్పుడూ వినని బ్రాండ్లు షాపుల్లో వెలిశాయి. డిస్టిలరీలు తమ బ్రాండ్లను ప్రమోట్‌ చేసుకోవడానికి కమీషన్లు ఇవ్వడం కొత్త విధానమేమీ కాదు. గతంలో ఆర్డర్లు పెట్టే ప్రైవేటు లైసెన్సీలకు ఆర్డర్లు పెట్టినందుకు కమీషన్లు ఇచ్చేవారు. అయితే గుర్తింపులేని, ఊరుపేరు లేని బ్రాండ్లు మాత్రమే ఇలా కమీషన్లు ఇచ్చేవి. ఇప్పటికే పాపులర్‌గా మారిన కంపెనీలు ఏవీ ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇచ్చేవి కావు. కానీ జగన్‌ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తెచ్చాక కొత్త ట్రెండ్‌ వచ్చింది. పాపులర్‌, నాన్‌పాపులర్‌ అనే తేడాలు లేకుండా ఎవరైనా కచ్చితంగా 10 శాతం కమీషన్‌ ఇవ్వాల్సిందేనని కంపెనీల వద్ద బేరసారాలకు దిగుతున్నారు. ఇప్పటికే పాపులర్‌గా ఎక్కువ మద్యం అమ్ముతున్న ఎంఎన్‌సీ కంపెనీలు వారి ప్రతిపాదనలను తిరస్కరించాయి. దీంతో వారికి అప్పటివరకు వచ్చిన ఆర్డర్లు పాతిక శాతానికి పడిపోయాయి. ఈ క్రమంలో శ్రీకాకుళంలో జిల్లాలోని ఓ బ్రూవరీ మొత్తం ఉత్పత్తిని ఆపేసి మూసేసుకుంది. ఇంపీరియల్‌ బ్లూ, రాయల్‌ స్టాగ్‌, మెక్‌డొనాల్డ్‌ నంబర్‌ వన్‌, రాయల్‌ చాలెంజ్‌ లాంటి బ్రాండ్లకు ఆర్డర్లు దాదాపుగా పడిపోయాయి. గతంలో ఈ రాష్ట్రంలోని మొత్తం అమ్మకాల్లో 50 శాతం వరకు ఈ బ్రాండ్లే ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ దాదాపుగా కనిపించకుండా పోయే పరిస్థితి వచ్చేసింది.
నవంబరు నుంచి డీల్స్‌
గత నవంబరు నెల నుంచి ఈ కమీషన్‌ డీల్స్‌ వ్యవహారం ప్రారంభమైనట్లు డిస్టిలరీలు చెబుతున్నారు. ప్రస్తుతం డిస్టిలరీలకు ప్రభుత్వం రూ.2వేల కోట్ల వరకు బకాయిలు ఉంది. కొందరికి సెప్టెంబరు వరకు ఇటీవల చెల్లించారు. తర్వాత అతీగతీ లేదు.
కష్టాలు ఏపీకి... కాసులు తెలంగాణకు
తెలంగాణతో పోల్చితే ఏపీలో రెండుసార్లు మద్యం ధరలు పెంచడంతో రాష్ట్రంలో ఎక్సైజ్‌ ఆదాయం కూడా భారీగా క్షీణించింది. ఏపీలో ఎక్సైజ్‌ ఆదాయం ఈ ఏడాది రూ.8,518 కోట్లు వరకు రావచ్చని బడ్జెట్‌లో అంచనా వేశారు. నవంబరు నాటికి కేవలం రూ.3341.15 కోట్లే వచ్చాయి. అంటే కేవలం 39.22 శాతం లక్ష్యాన్ని మాత్రమే చేరుకున్నారు. డిసెంబరులో దాదాపు రూ.450 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని సమాచారం. తెలంగాణలో ఎక్సైజ్‌ ఆదాయం రూ.10,901 కోట్లుగా బడ్జెట్‌లో అంచనా వేశారు. డిసెంబరు నాటికే రూ.9,032.46 కోట్ల ఆదాయం వచ్చింది. తెలంగాణ కేవలం 9 నెలల్లోనే 82.86 శాతం ఆదాయాన్ని నమోదు చేసుకుంది.
పెరుగుతున్న నాటుసారా
ఓ వైపు మద్యం ధరల పెంపు, మరోవైపు పాపులర్‌ బ్రాండ్ల దూరంతో రాష్ట్రంలో నాటుసారా విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నాటుసారా ఉత్పత్తి రెట్టింపైంది. గతంలో స్థానికంగా మాత్రమే అమ్ముకున్న వ్యాపారులు ఇప్పుడు దూర ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తున్నారు. తక్కువ ధరకు నాటుసారా లభిస్తుండడంతో భారీ ధర పెట్టి ఏవేవో బ్రాండ్లు తాగాల్సిన అవసరం ఏంటని వినియోగదారులు ఆ బాట పడుతున్నారు. మరోవైపు తెలంగాణలో ధరలు తక్కువగా ఉండడంతో సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువ మంది తెలంగాణలోనే మందు కొనుగోలు చేస్తున్నారు. 

RELATED ARTICLES

  • No related artciles found