హైకోర్టు తీర్పు - ఆస్పత్రికి అచ్చెన్నాయుడు

August 07, 2020

ఏసీబీ కేసులో అరెస్టు అయిన అచ్చెన్నాయుడు కేసులో ఉత్కంఠకు హైకోర్టు తెరదించింది. ఆయనను ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. అరెస్టు చేయడానికి రెండ్రోజుల ముందు అరెస్టయిన అచ్చెన్నాయుడి విషయంలో ఏసీబీ కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆయనకు మళ్లీ ఆపరేషన్ చేయాల్సిరావడం తెలిసిందే. గుంటూరులోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రి లో అచ్చెన్నాయుడుకు రెండో సారి చికిత్స చేశారు. ఏసీబీ పోలీసుల తీరుపై ప్రతిపక్ష్ తెలుగుదేశం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇది ప్రభుత్వ కక్ష సాధింపు అని టీడీపీ ఆరోపించింది.

అనంతరం కూడా ప్రభుత్వం తీరు మారలేదు. ఎలాంటి ఆపరేషన్ చేసినా వ్యక్తి డిశ్చార్జి అయిన తర్వాత పేషెంట్ కోలుకోవడానికి కనీస సమయం పడుతుందని... అచ్చెన్నాయుడు తరఫున కోర్టులో పిటిషను వేశారు. అతన్ని ఈ పరిస్థితుల్లో జైలులో ఉంచడం మానవ హక్కుల హరణమే అని వాదించారు. పిటిషనర్ల అభిప్రాయంతో ఏకీభవించిన హైకోర్టు ఆయనను గుంటూరులోని రమేష్ ఆస్పత్రికి తరలించడానికి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. పూర్తిగా నయమయ్యేదాకా ఆయనను ఆస్పత్రిలోనే ఉంచాలని కోర్టు తీర్పు చెప్పింది. 

ఇటీవల ఏసీబీ కోర్టులో జరిగిన విచారణలో అచ్చెన్నాయుడుకు బెయిలు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో పిటిషను వేయగా.. నేడు హైకోర్టు అచ్చెన్నాయుడికి ఊరటనిస్తూ ఆస్పత్రికి తరలించాలని ఆదేశాలిచ్చింది. బీసీ నేతలను టార్గెట్ చేస్తూ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని, హైకోర్టు తీర్పు తర్వాత అయిన ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు.