ఐసీయూలో ఆ దేశ ప్రధానికి కరోనా చికిత్స !

August 10, 2020

కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోని దేశాలు భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నాయి. తమ వరకూ కరోనా ముప్పు రాదేమో? అనుకున్న వారందరికి జెల్లకాయ కొడుతూ తనను తక్కువ అంచనా వేస్తే.. భారీగా మూల్యాన్ని చెల్లించాలన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది మాయదారి వైరస్. చైనా ఎపిసోడ్ చూసిన తర్వాత అయినా.. ప్రపంచ దేశాలు అలెర్ట్ అయి.. కఠిన చర్యలు తీసుకొని ఉంటే.. ఈ రోజున సంపన్న దేశాల్లో చోటు చేసుకుంటున్న విలయం ఇంత తీవ్రంగా ఉండేది కాదేమో?
బ్రిటన్ లాంటి సంపన్న దేశ ప్రధాని సైతం కరోనా పాజిటివ్ తో ఇబ్బంది పడుతున్నారు. మొన్నటివరకూ ఇంట్లోనే ఉంచి చికిత్స చేయగా.. తాజాగా ఆయన్ను ఆసుపత్రికి తరలించటం ఒక ఎత్తు అయితే.. వ్యాధి తీవ్రత పెరగటంతో ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు తేలటంతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తనకు తానుగా క్వారంటైన్ లోకి వెళ్లారు.
ఆయన వ్యక్తిగత వైద్యుడి సూచనతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికి ఆయనకు జ్వరం వస్తున్నట్లుగా చెబుతున్నారు. ఏడు రోజుల తర్వాత బయటకు రావొచ్చని వైద్యులు చెప్పినప్పటికీ.. తాజాగా ఆయన్ను ఐసీయూలో చేర్చి చికిత్స చేయటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఐసీయూకు తరలించటానికి ముందు ఆయనో వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
అందులో.. తన ఆరోగ్యం మెరుగ్గా ఉందని.. ఏడు రోజుల నిర్భందం కూడా పూర్తి అయినట్లు తెలిపారు. అయితే.. వైరస్ లక్షణాలు తన శరీరంలో ఉండటంతో జ్వరం వస్తున్నట్లుగా వైద్యులు గుర్తించినట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరోనా లక్షణాలు పూర్తిగా తొలిగేవరకూ తాను స్వీయ నిర్భందంలో ఉంటానని పేర్కొన్నారు.  ఈ వీడియో సందేశం బయటకు వచ్చిన తర్వాత ఆయన్ను ఐసీయూకు తరలించి చికిత్స చేయాలని నిర్ణయించటం గమనార్హం.