బోండా ఉమపై వైసీపీ క్రూరమైన దాడి

June 03, 2020

సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువయ్యాయని ఆరోపణలు వెల్లువెత్తుతో్న్న సంగతి తెలిసిందే. ఏపీలో పులివెందుల పంచాయితీలు మొదలుపెట్టారని జగన్ పై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఆరోపణలకు తగ్గట్లుగానే వైసీపీ కార్యకర్తలు...టీడీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. ఇక స్థానిక సంస్థల నేపథ్యంలో అధికార పార్టీ కార్యకర్తలు బరితెగించారు. ఏకంగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలపై పట్టపగలే దాడికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై వైసీపీ వర్గీయులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారును కర్రలతో ధ్వంసం చేసి వారిని గాయపరిచారు. డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. దాడి ఘటన తర్వాత దాడికి పాల్పడ్డ వైసీపీ బ్యాచ్ అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో మాచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే, ఈ దాడికి పాల్పడిన వ్యక్తి. వైసీపీ కార్యకర్తేనని టీడీపీ నేతలు సాక్ష్యాధారాలతో సహా బట్టబయలు చేశారు. గతంలో పాదయాత్ర సమయంలో జగన్ తో పాటు ఈ రోజు దాడికి పాల్పడిన వ్యక్తి చేతిలో చేయి వేసి నడిచిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ రోజు దాడికి పాల్పడిన వ్యక్తిని జగన్ చిరునవ్వుతో పలకరించి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు. ఇటువంటి వ్యక్తులను జగన్ కార్యకర్తలుగా పెట్టుకున్నారని....అందుకే వారంతా ఇలా టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలు మొదలు కాకముందే ఈరకంగా దాడులకు పాల్పడుతున్నారని, ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఎటువంటి దారుణాలు జరుగుతాయోనని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మునుపెన్నడూ ఎన్నికలకు ముందు ఈ రకమైన వాతావరణం లేదని, ఈ తరహాలో ఎన్నికలు జరగడం ఇదేనని పలువురు టీడీపీ నేతలు అంటున్నారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. రాష్ట్రంలో పలుచోట్ల టీడీపీ అభ్యర్థులను వైసీపీ నేతలు, కార్యకర్తలు బెదిరిస్తున్నారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. నిన్న మాచర్లలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను వైసీపీ అడ్డుకుంది. అక్కడ పరిస్థితిని సమీక్షించేందుకు చంద్రబాబు ఆదేశంతో మాచర్లకు బోండా ఉమ, బుద్దా వెంకన్న వెళ్లారు. ఈ నేపథ్యంలోనే వారు వస్తున్నారన్న ముందస్తు సమాచారంతో వీరిద్దరిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. పెద్ద కర్రతో ఓ వ్యక్తి ఉమ, వెంకన్న ప్రయాణిస్తోన్న కారు అద్దాలను పగలగొట్టాడు. వారిద్దరిపై దాడికి యత్నించాడు. అయితే డ్రైవర్ కారును ఆపకుండా అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత కూడా వారి వాహనాన్ని వెంటాడేందుకు దాడి చేసిన వ్యక్తులు ప్రయత్నం చేశారు. ఈ దాడిలో ఇద్దరు నేతలకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ఎవరూ లేరని బోండా ఉమ వెల్లడించారు. ఈ దాడి ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ , అచ్చెన్నాయుడు, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు ఖండించారు.