పార్టీ టికెట్లు అమ్ముకుంటారా? అంటూ గాడిదల మీద ఊరేగించారు

June 01, 2020

రాష్ట్రంలో ఒక జాతీయ పార్టీ కార్యకర్తల ఆవేశం కట్టలు తెగింది. కష్టపడి పని చేసినోళ్లకు పార్టీ టికెట్లు కేటాయించకుండా తమకు నచ్చినోళ్లకు టికెట్లు వచ్చేలా చేసిన పార్టీ కీలక నేతలకు ఊహించని రీతిలో అవమానించిన ఆసక్తికర ఉదంతం తాజాగా రాజస్థాన్ లో చోటు చేసుకుంది. సంచలనంగా మారిన ఈ ఉదంతంలో సొంత పార్టీ కార్యకర్తల చేతిలో నేతలకు ఎదురైన అవమానం అవాక్కు కావటమే కాదు.. హాట్ టాపిక్ గా మారేలా చేసింది. చివరకు అధినేత్రి కంట్లో పడేలా ఈ ఉదంతం మారింది.
రాజస్థాన్ లోని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ నేతల్ని ఆ పార్టీ కార్యకర్తలు కొందరు ముఖానికి రంగు పులిమి.. గాడిదల మీద ఊరేగించిన వైనం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని జయ్ పూర్ కి చెందిన బీఎస్పీ పార్టీ కార్యకర్తలు.. చోటా నేతలు పార్టీ టికెట్లు ఆశించారు. అయితే.. వారికి టికెట్లు రాకుండా..పార్టీకి సంబంధం లేని వారికి టికెట్లు వచ్చాయి. దీనికి కారణం బీఎస్పీ జాతీయ కార్యదర్శి రామ్ జీ గౌతమ్. రాష్ట్రమాజీ ఇన్ చార్జ్ సీతారాం ముఖాలు చేసిన దుర్మార్గమేనన్నది అభియోగం.
అంతేకాదు.. పార్టీ కోసం కష్టపడిన తమను.. పార్టీ అధినేత్రి మాయావతిని కలవకుండా చేశారన్న కోపంతో ఉన్న వారు.. తాజాగా జయ్ ఫురాకు వచ్చిన పార్టీ నేతల విషయంలో అనూహ్యంగా వ్యవహరించారు. టికెట్లు అమ్ముకొని పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశం ఇవ్వని నేతల విషయంలో నిరసన వ్యక్తం చేయాలని భావించిన వారు.. వారి ముఖాలకు రంగు పూసేసి.. గాడిదల మీద ఊరేగించారు. దీంతో.. ఈ వ్యవహారం సంచలనంగా మారటమే కాదు.. పార్టీ అధినేత్రి మాయావతి వరకూ వెళ్లిందని చెబుతున్నారు. పార్టీ టికెట్లు అమ్ముకునే వారి విషయంలో ఏం చేయాలన్న దానిపై తాజా ఉదంతం కొత్త స్ఫూర్తినిస్తుందని చెప్పకతప్పదు.