జగన్ కు ‘బుచ్చి’ లేఖ... రైతుల త్యాగాలపై కక్ష ఎందుకండీ?

May 26, 2020

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు రాజధాని రైతులు సాగిస్తున్న అమరావతి పరిరక్షణ ఉద్యమానికి మద్దతు వెల్లువెత్తుతోంది. ప్రపంచ దేశాల్లోని ప్రవాసాంధ్రులు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలోనే అమరావతి పరిరక్షణే పరమావధిగా ఏర్పడ్డ ‘ఎన్నారై అమరావతి జేఏసీ’ కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. బుధవారం నాటికి రాజధాని రైతుల దీక్షలు 50వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాజధాని రైతుల త్యాగాలను వైసీపీ ప్రభుత్వానికి గుర్తు చేసేలా ఎన్నారై అమరావతి జేఏసీ చైర్మన్ బుచ్చిరాంప్రసాద్ ఓ బహిరంగ లేఖ రాశారు. అమరావతి పరిధిలో సాగుతున్న ఉద్యమం, రైతుల పట్ల జగన్ సర్కారు వ్యవహరిస్తున్న కక్షసాధింపు చర్యలను నిరశిస్తూ బుచ్చి రాంప్రసాద్ తన లేఖలో ప్రస్తావించారు. అంతేకాకుండా ప్రపంచ స్థాయి రాజధానిగా ఎదిగే అవకాశాలున్న అమరావతిని చంపొద్దంటూ ఆయన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోరారు.

అమరావతి నుంచి రాజధాని తరలకుండా... అమరావతిని పరిరక్షించుకునేందుకు ప్రవాసాంధ్రులు ఆది నుంచి కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమరావతి పరిరక్షణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచేందుకు ‘ఎన్నారై అమరావతి జేఏసీ’ పేరిట ఓ సంస్థను కూడా ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేశారు. ప్రవాసాంధ్రులకు సంబంధించి ప్రతి చిన్న విషయంలో చాలా వేగంగా స్పందించే ప్రవాసాంధ్ర ప్రముఖుడు బుచ్చి రాంప్రసాద్... తాను ఉంటున్న అమెరికాలోని న్యూయార్క్ వేదికగా ఈ సంస్థను ఏర్పాటు చేశారు. రాజధాని రైతులు సాగిస్తున్న ఉద్యమానికి నిత్యం వెన్నుదన్నులా నిలుస్తున్న ఈ సంస్థ తరఫున... బుచ్చి రాంప్రసాద్ వైసీపీ సర్కారుకు ఓ బహిరంగ లేఖ రాశారు. 

రాజధాని కూడా లేకుండా ఏర్పడ్డ ఏపీకి ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించేందుకు టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు కార్యాచరణ రూపొందించగా... ఆ కొత్తగా ఏర్పాటయ్యే రాజధాని తమదేనన్న భావనతో ఏకంగా 28 వేల మంది రైతులు 33 వేల ఎకరాలకు పైగా భూములిచ్చిన విషయాన్ని బుచ్చి రాంప్రసాద్ తన లేఖలో ప్రస్తావించారు. రైతుల త్యాగాలతో సమకూరిన అమరావతిలో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించడానికి బదులుగా రైతులపై కక్షపూరితంగా వ్యవహిరంచడం ఎంతవరకు సబబని ఆయన జగన్ ను నిలదీశారు. కేవలం 58 రోజుల్లో 28 వేల మంది రైతులు రాత్రిపగలు తేడా లేకుండా క్యూ కట్టి మరీ తమ భూములను రాజధానికి ఇచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించిన బుచ్చి రాంప్రసాద్... ఈ తరహా భూసేకరణ ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్న విషయాన్ని గుర్తించాలని కూడా కోరారు. 

రైతుల త్యాగాలు, చంద్రబాబు ముందుచూపుతో అమరావతికి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందని, పెట్టుబడిదారులకు స్వర్గధామం కానున్న అమరావతిని జగన్ తన చర్యలతో అస్తవ్యస్తమవుతోందని బుచ్చి రాంప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ తీసుకుంటున్న చర్యలు విదేశాల్లోని ప్రవాసాంధ్రులను అప్రతిష్ఠ పాలు చేస్తున్నాయని కూడా ఆయన విచారం వ్యక్తం చేశారు. 5 కోట్ల ఆంధ్రుల పక్షాన 28 వేల మంది రైతులు చేస్తున్న దీక్షలకు తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. ఒక రాష్ట్రం- ఒకే రాజధానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం జగన్ సర్కారు ఉందని ఆయన చెప్పారు. 13 జిల్లాల సమగ్రాభివృద్ధికి దోహదం చేసే అమరావతిని కొనసాగిస్తేనే.... దేశదేశాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రజలు, రైతులు, మహిళలు కొనసాగిస్తున్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని బుచ్చి రాంప్రసాద్ తన లేఖలో జగన్ ను కోరారు.