పురంధేశ్వరీ... దిగజారుడు రాజకీయం మీది - బుచ్చి రాంప్రసాద్

July 05, 2020

’’చంద్రబాబు తన రాజకీయ వారసుడిగా తనయుడు లోకేష్‌ను ప్రకటించటం శోచనీయమని’’ చెబుతున్న బీజేపీ నేత పురంధేశ్వరిపై ఎన్నారై టీడీపీ నాయకులు బుచ్చి రాంప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. ఇతరులను విమర్శించే ముందు ఆమె తన గురించి ఆలోచించుకోవాలని హెచ్చరించారు. తండ్రి జీవితాన్ని నాశనం చేసిన ఓ స్త్రీ చేతుల్లోకి తెలుగుదేశం పార్టీ చేజారుతుంటే నందమూరి కుటుంబానికి చంద్రబాబు అండగా నిలిచి పార్టీని కాపాడారు. నిందలు తన మీద వేసుకున్నారన్నారు. టీడీపీ ఈరోజుకు కూడా నిలబడి ఉందంటే... దానికి చంద్రబాబు సమర్థతే కారణమని బుచ్చిరాంప్రసాద్ అన్నారు.
అంచెలంచెలుగా ఎదిగిన ఆ పార్టీకి భారీ సైన్యం తయారుచేసిన వ్యక్తి లోకేష్ అని, ఎమ్మెల్సీ అవకముందే అతను పార్టీలో విస్తృతంగా సేవలు అందించారని రాంప్రసాద్ వివరించారు. కార్యకర్తలకు బీమా, దేశంలో ప్రస్తుతం పాపులర్ అయిన నగదుబదిలీ లోకేష్ ఆలోచనలే అని రాంప్రసాద్ అన్నారు. లోకేష్ కు భవిష్యత్తు నాయకుడిగా ఎదగడానికి అవసరమైన సమర్థత పుష్కలంగా ఉందన్నారు. లోకేష్ ఒక్కో మెట్టూ ఎదుగుతూ ఉంటే పురంధేశ్వరి ఒక్కో మెట్టు దిగజారిందన్నారు. పంచాయతీ రాజ్ మంత్రిగా లోకేష్ చేసిన సేవలు మీ బీజేపీ ప్రభుత్వమే అధికారికంగా గుర్తించిన విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు.
కేంద్ర మంత్రిగా రెండు టెర్ములు పనిచేసినా విశాఖపట్నంలో మాట్లాడుతుంటే కనీసం పది మంది కూడా నీ ప్రసంగాలు వినలేదు, మీరు ప్రజా నాయకులా.? ఎక్కడికెళ్లినా వేలాది మంది నాయకుడితో చేతులు కలపడానికి వస్తున్న లోకేష్ ప్రజానాయకుడో మీకు తెలియదా అని బుచ్చి రాంప్రసాద్ ప్రశ్నించారు. ఇప్పటికీ మీకు మర్యాద దక్కుతోంది అంటే దానికి ఏకైక కారణం మీరు ఎన్టీఆర్ కూతురు కావడమే అన్నారు. కేంద్ర మంత్రి స్థాయి నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఒక అవినీతి నేతను అడుక్కునే స్థితికి దిగజారిన మీతో లోకేష్ కు అసలు పోలికే లేదు అని బుచ్చిరాంప్రసాద్ ఫైర్ అయ్యారు. ఇప్పటికి మూడు పార్టీలు మారారు. అవకాశం ఉంటే మీరు ఇంకా పార్టీలు మారేవాళ్లే అని బుచ్చి వ్యంగాస్త్రం వేశారు.