రాంమాధవ్... టీడీపీకి - తానాకి సంబంధమేంటి?: బుచ్చి రాంప్రసాద్

August 08, 2020

ఇటీవల జరిగిన తానా మహాసభల్లో పలువురు తెలుగు ప్రముఖులు హాజరయ్యారు. అందులో అన్ని పార్టీల వారు ఉన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ నేత రాంమాధవ్ కూడా ఉన్నారు. అయితే, రాంమాధవ్ పది నిమిషాల ప్రసంగంలో సభికులు సావధానంగా విన్నారు. కానీ పదినిమిషాల తర్వాత మోడీ గురించి పొగడటంతో అక్కడి తెలుగు వారికి కోపం వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలకు మోడీ ఏమీ కేటాయింపులు చేయని విషయం విదితమే. అందుకే అన్ని పార్టీలకు చెందిన తెలుగు ఎన్నారైలు నిరసన వ్యక్తంచేస్తూ రాంమాధవ్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అయినా, నిర్వహకులు జోక్యం చేసుకని అందరినీ శాంతింపజేశారు. రాంమాధవ్ ని తానా తరఫున సత్కరించారు. 

అయితే, తాజాగా గుంటూరులో బీజేపీ మీటింగ్ కు హాజరైన రాంమాధవ్... ఏపీలో టీడీపీ ఉండదు, ఇక తానా సభలు చేసుకోవాల్సిందే అని వ్యాఖ్యానించారు. దీనిపై ఎన్నారై టీడీపీ నేత బుచ్చిరాంప్రసాద్ తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సకల జనులు ఉన్న సంఘం తానా. దానికి పార్టీకి సంబంధం లేదు. అనవసరంగా అన్నీ తెలిసి కూడా రాంమాధవ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అని రాంప్రసాద్ ఆందోళన వ్యక్తంచేశారు. విదేశీ గడ్డ మీద కలసిమెలసి ఎదుగుతున్న తెలుగు వారిలో రాజకీయ స్వార్థం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అది మన తెలుగు జాతికే ప్రమాదం అని బుచ్చి రాంప్రసాద్ అన్నారు. తానా ఒక వర్గానిది అయితే... లోకేష్ నో, చంద్రబాబునో పిలిచే వారు. కానీ టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీ, జనసేన వారిని ఎందుకు పిలిచేవారు.. ఒకసారి రాంమాధవ్ ఆలోచించాలని బుచ్చి రాంప్రసాద్ సూచించారు. 

ఏపీలో బీజేపీ ఎదగాలనుకోవడంలో తప్పు లేదని, కానీ ఇలాంటి అనైతిక మార్గాన్ని ఎంచుకోవడం కరెక్టు కాదన్నారు. విభజన హామీల్లో ఏపీకి జరుగుతున్న అన్యాయానికి ఇప్పటికీ బీజేపీ అంటే తెలుగు వారికి కోపంగా ఉందని, ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజలు మనసు దోచుకోని రాష్ట్రంలో పార్టీ గురించి ఆలోచించాలని ఆయన సూచించారు. దయచేసి రాజకీయ స్వార్థంతో తెలుగు ఎన్నారైల మధ్య మధ్య విభేదాలు సృష్టించవద్దని ఆయన రాంమాధవ్ ని కోరారు.