‘‘​ఎన్నారైలను క్షేమం పట్టించుకున్నదెవరో అందరికీ తెలుసు’’

August 10, 2020

అవినీతి, ఆశ్రిత పక్షపాతం తప్ప... రాష్ట్ర సంపద పెంచే ఏ ప్రయత్నమూ​ ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేయడం లేదన్నారు. నాయకుడు అంటే సంపద పంచడమే కాదు, పెంచడం కూడా తెలిసుండాలని... కష్టాల్లో అందరిని సమంగా చూసే మనసుండాలని.. అవేవీ జగన్ కి లేవని టీడీపీ ఎన్నారై కో ఆర్డినేటర్ బుచ్చి రాంప్రసాద్ ధ్వజమెత్తారు. దేశంలో 400 పార్టీలున్నా ప్రపంచం కరోనా వలలో చిక్కుకున్న నేపథ్యంలో ఒక్క చంద్రబాబు మాత్రమే వారితో మాట్లాడారు అని రాంప్రసాద్ అన్నారు. 

దేశానికి ఎసెట్ గా మారిన ఎన్నారైల పట్ల, రాష్ట్రంలో ఎంతో సంపదసృష్టికి కారణమైన ఎన్నారైల పట్ల జగన్ నిర్లక్ష్య వైఖరి చూపడమే కాకుండా వారి గురించి పట్టించుకున్న చంద్రబాబుపై విమర్శలు చేయడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనం అని బుచ్చి తప్పుపట్టారు.  ఈ సందర్భంగా జగన్ ఎన్నారైలకు చేసిన అన్యాయం గురించి ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు.

  • ఎన్నారైలను కోర్టుకీడ్చింది వైసీపీ ప్రభుత్వం కాదా?
  • ఏపీ ఎన్నార్టీని నిర్వీర్యం చేస్తున్నది నిజం కాదా?
  • ఏపీ ఎన్నార్టీ ద్వారా ఎన్నారైలు పెట్టిన 40 కోట్ల పెట్టుబడిని వెనక్కు ఇవ్వకుండా వేధిస్తున్నది నిజం కాదా?
  • పెట్టుబడులు పెట్టిన పాపానికి నోటీసులతో వేధించడం నిజం కాదా?
  • అసలు అమరావతిని మార్చే ఉద్దేశం ఉన్నపుడు వారి పెట్టుబడి ఎందుకు వెనక్కు ఇవ్వరు?
  • విదేశాలకు వెళ్లే యువతకు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ పెడితే దానిని మీరు రద్దు చేసింది నిజమా ? కాదా?
  • విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఆన్ లైన్ పాఠాలు గత ప్రభుత్వం పెడితే మీరు రద్దు చేయలేదా?
  • ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపులు కాక మరేమిటి అని బుచ్చి రాంప్రసాద్ ప్రశ్నించారు. అమరావతి కీర్తిని పెంచే హ్యాపీనెస్ట్ భవనాలను, ఏపీఎన్నార్టీ ఐకానిక్ భవంతిని నిలిపేసి ప్రభుత్వాలపై ఎన్నారైలు నమ్మకం కోల్పోయేలా చేసింది మీరే అని దుయ్యబట్టారు.  ఎన్నారైల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని కొందరు విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇదెలా ఉందంటే... బాహుబలి గురించి మాట్లాడే హక్కు రాజమౌళికి లేదు అన్నట్టుందన్నారు. 

ఈరోజు రైతులు రైతు బిడ్డలు, రైతు కూలీల బిడ్డలు విదేశాల్లో ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉందంటే... అదంతా చంద్రబాబు తాపత్రయం కృషివల్లే సాధ్యమైందని బుచ్చిరాంప్రసాద్ స్పష్టం చేశారు. ఆరోజు చంద్రబాబు కృషివల్ల, ఆయన సృష్టించిన ఐటీ విప్లవం వల్ల లక్షలాది మంది తెలుగు వారు ఇపుడు విదేశాల్లో స్థిరపడ్డారు. ఎప్పటికపుడు వినూత్నంగా ఆలోచిస్తూ భావితరాలను కాపాడే నాయకుడు చంద్రబాబు అని బుచ్చి రాంప్రసాద్ వ్యాఖ్యానించారు. 

ఎన్నారైలకు ప్రత్యేక కార్యక్రమాలు...

చంద్రబాబు ఎన్నారైలు తమ సంపదను మన దేశానికి మన రాష్ట్రానికి మళ్లించేలా కృషిచేశారు. అమరావతి పరిసరాల్లో సిలికాన్ వ్యాలీ తరహాలో ఐటీ పరిశ్రమను తీర్చిదిద్దేందుకు వారందరినీ ఒక గొడుగు కిందకు తీసుకొచ్చాం. ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం ఆర్థిక అభివృద్ధికి సంబంధించి కొత్త పాలసీని రూపొందించాం. ప్రమాదవశాత్తూ మరణించినా....వైకల్యం వచ్చి బీమా కింద 10 లక్ష బీమా కల్పించాం. ఏపీ ఎన్నార్టీ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా తెలుగు వాడు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక మార్గం కల్పించాం. ప్రభుత్వ నేతృత్వంలో ఏపీఎన్నార్టీ ద్వారా 75 కంపెనీలను అమరావతికి తేవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.  

బాబుది అభివృద్ధి, వైసీపీది లూటీ

చంద్రబాబు ఐటీని డెవలప్ చేసి ప్రజల సంపద పెంచితే... జగన్ ఆయన బృందం ఏపీని లూటీ చేసి అవకాశాలను, కంపెనీలను తరిమేశారని బుచ్చి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నారైలకు చంద్రబాబు చేసిందేమీ లేదని నార్త్ అమెరికా ఏపీ ప్రత్యేక ప్రతినిధి వ్యాఖ్యానించడం చూసి ఎన్నారైలు నవ్వుకునే పరిస్థితి ఉందన్నారు. ఎన్నారైలు అందరి దాకా ఎందుకు... ఈరోజు నువ్వు అనుభవిస్తున్న పదవి చంద్రబాబు హయాంలో సృష్టించిందే, ఆయన భిక్ష నీ పదవి అన్నారు బుచ్చి. తెలుగుదేశం హయాంలో మీకన్నా ముందు ఈ పదవిలో ఉంటూ వారు పదవికి వన్నెతెచ్చారని.. వేల సంఖ్యలో ఎన్నారైలను భాగస్వాములను చేసి 4270 డిజిటల్ క్లాస్ రూములను నిర్మించారు. అంగన్ వాడీ కేంద్రాలు, శ్మశాన వాటికలు పునర్నిర్మాణం చేసి రాష్ట్రంలో సుపరిపాలన అందించారు. చంద్రబాబు పాలన విడిపోయిన రాష్ట్రంలో అభివృద్ధి వెలుగులు పూయించింది.  మీకు చేతనయితే అభివృద్ధి చేయండి. ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం చేస్తే అది మీమీదే పడుతుంది అని హెచ్చరించారు బుచ్చి రాంప్రసాద్.