విజయసాయిరెడ్డి... ఇలా దొరికిపోయారేంటి?

July 12, 2020

బాధ్యత గల పదవిలో ఉండి నిర్మొహమాటంగా అబద్దాలు చెబుతుంటారు విజయసాయిరెడ్డి. అయితే, అవి అబద్ధాలు అని జనాలకు తెలుసు కాబట్టి జనం పట్టించుకోరు అని గత ప్రభుత్వం విజయసాయిరెడ్డి ట్వీట్లను పట్టించుకోలేదు. కానీ దాని ఫలితం ఎంత ఘోరంగా ఉందో ఎన్నికల్లో అర్థమైంది. ఇప్పటికీ విజయసాయిరెడ్డి టీడీపీని డ్యామేజ్ చేయడం మానలేదు. అయితే, గతంలోలా టీడీపీ ఊరుకోవడం లేదు. విజయసాయిరెడ్డి అబద్ధం చెబితే వెంటనే దానికి స్పందించి కౌంటర్ వేస్తోంది. లోకేష్, బుద్ధావెంకన్న, దివ్యవాణి, కేశినేని నాని తదితరులు ఈ పని మీద బిజీగా ఉన్నారు. తాజాగా సాగునీటి ప్రాజెక్టులపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బుద్ధా వెంకన్న గట్టి కౌంటర్ ఇచ్చారు.

సాయిరెడ్డి ఏమన్నారంటే... టీడీపీ ప్రభుత్వం ఒక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తిచేయలేదని తన ట్విట్టరు లో వ్యాఖ్యానించారు. దీనికి బుద్ధావెంకన్న ఘాటు రిప్లయి ఇచ్చారు.
‘‘విజయసాయిరెడ్డి గారు! తెదేపా ప్రభుత్వం కట్టిన ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా మీకు కనపడలేదంటే వయసు పెరిగి చత్వారం వచ్చిందేమో! నిన్న ప్రకాశం బ్యారేజీ దగ్గర మీ జలవనరులశాఖ మంత్రి డెల్టాకు నీటిని విడుదల చేశారంటే... అది పట్టిసీమ వల్ల కాదా?‘
‘పట్టిసీమ మీకు సాగునీటి ప్రాజెక్టులా అనిపించట్లేదా? ఆ పట్టిసీమను కట్టిందెవరు? నిన్న జరిగింది ఈరోజు గుర్తులేకుండా పోయిందంటే మీకు చత్వారంతో పాటు అల్జీమర్స్ వ్యాధి కూడా వచ్చిందేమో చెక్ చేసుకోవాలి. గజినీ సినిమా హీరోలాగా టీడీపీ కట్టిన ప్రాజెక్టుల పేర్లు ఎక్కడన్నా రాసిపెట్టుకోండి’
బుద్ధా వెంకన్న వ్యంగం వైరల్ అవుతోంది. టీడీపీపై బురద చల్లిన వెంటనే అవతలి వారివి ఎంత అబద్ధమో నిరూపించకపోతే మొదటి కే మోసం వస్తుందన్న సత్యాన్ని చాలా ఆలస్యంగా గ్రహించింది టీడీపీ. అందుకే ఎన్నడూ లేనంతా యాక్టివ్ గా ఉంటున్నారు టీడీపీ సభ్యులు.