బుగ్గన బుర్ర చెడిందా?

May 31, 2020

ఏపీ ఆర్ధిక మంత్రిగా జగన్ ఏరికోరి తెచ్చిపెట్టుకున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన అయోమయ విధానాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలు ప్రధానంగా పాలన సాగిస్తున్న వేళ వాటికి కావాల్సిన డబ్బుకు ఏమాత్రం లోటు లేకుండా ఆర్థిక శాఖ అండగా నిలుస్తుందని సీఎం జగన్ భావించినా బుగ్గన నేతృత్వంలోని ఆ శాఖ మాత్రం రాష్ట్ర ఆదాయాన్ని ఏమాత్రం పెంచలేకపోవడమే కాకుండా అనాలోచిత విధానాలతో పరువు పోగొట్టుకుంటోంది. చివరకు అంతర్జాతీయ పెట్రోలు ధరలు తగ్గుతున్న వేళ ఏపీలో ధరలు పెంచి జగన్ ప్రభుత్వానికి మచ్చ తెస్తోంది.
సాధారణంగా పెట్రోలు ధరలు పెంచినా తగ్గించినా ఆ వ్యతిరేక, అనుకూల ప్రభావాలన్నీ కేంద్ర ప్రభుత్వంపైనే పడతాయి. రాష్ట్రాలు తమ పరిధిలో ఉన్న వ్యాట్‌ ఎంత విధించాలో అంత విధించి ఊరుకుంటాయి. మళ్లీ పెట్రోలు ధరల జోలికి పోవు. పదేపదే దాన్ని సవరిస్తూ జనం దృష్టిలో పడి వ్యతిరేకత మూటగట్టుకోవు. ఇంకా చెప్పాలంటే కేంద్రం ఒక వేళ ధరలు పెంచినా తాము వ్యాట్ కాస్త తగ్గించి ప్రజల వద్ద మార్కులు కొట్టేసి ఓట్లు రాబట్టేసిన ప్రభుత్వాలూ ఉన్నాయి. కానీ, జగన్ ప్రభుత్వం మాత్రం ఏపీలో పెట్రోలు ధరలు నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు మార్పులు చేసి ఆర్థికంగా ఎంత దీనావస్థలో ఉన్నామన్నది ప్రజలకు అర్థమయ్యేలా చేశారు.
నెల రోజుల కిందట జనవరి 29న పెట్రోలుపై వ్యాట్‌ను ఏపీ ప్రభుత్వం పెంచింది. అప్పటివరకు పెట్రోలుపై 31 శాతం ఉన్న పన్నును 35.2 శాతానికి.. డీజిల్ పై ఉన్న పన్నును 22.25 శాతం నుంచి 27 శాతానికి పెంచింది. అయితే, పన్నుకు అదనంగా అప్పటివరకు ఉన్న స్థిర ధర రూ.2 ను తొలగించింది. ఆ సమయంలోనే పెట్రోలు ధరలను జగన్ ప్రభుత్వం అమాంతం పెంచేసిందన్న విమర్శలు వచ్చాయి.
అయితే... పెట్రోలు ధరల సరళి తెలియకో.. అంచనా వేయలేకో... అసలు వ్యాట్ ఉన్నా స్థిర ధర ఎందుకు విధిస్తారన్నది సరిగ్గా అంచనా వేసుకోలేక దాన్ని తొలగించి పన్ను పెంచారు. కానీ, అప్పటికే కరోనా, అంతర్జాతీయంగా మందగమనం వంటి కారణాలతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి. పెట్రోలు, డీజిలుపై వేసే పన్నులు బేస్ ప్రైస్‌పై ఉంటాయి. దీంతో పన్ను పెంచినా ఆదాయం పెరగలేదు. పైగా స్థిర ధర తొలగించడం వల్ల మరింత నష్టం వచ్చింది.
దీంతో ఇలా అయిందేమిటనుకుంటూ మళ్లీ ఏపీ ప్రభుత్వం స్థిర ధరను మళ్లీ విధించడమే కాకుండా ధర పెంచింది. పెట్రోలుపై రూ. 2.76, డీజిల్ మీద రూ. 3.07 స్థిర ధర విధిస్తోంది. అంటే పెట్రోలుపై లీటరుకు 76 పైసలు.. డీజిలుపై రూ. 1.07 పెంచింది.
అంతర్జాతీయంగా ధరలు మారుతుంటాయన్న ఉద్దేశంతో రాష్ట్రాలు ఇలా స్థిర ధర విధిస్తాయి. దాని వల్ల ధరల మార్పు వల్ల పన్ను శాతం ప్రకారం వచ్చే ఆదాయం తగ్గినా స్థిర ధర ఉంటే ఫిక్స్‌డ్ ఆదాయం ఉంటుంది. కానీ, బుగ్గన నాయకత్వంలోని ఏపీ ఆర్థిక శాఖ మాత్రం ఆ సంగతి మరచి గందరగోళానికి తావిచ్చింది.