జగన్ కేబినెట్ లో ఫండమెంటల్స్ తెలియని మంత్రి

June 01, 2020

ఏపీలో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన కేబినెట్ లో చాలా మంది మంత్రులు ఫస్ట్ టైం ఆ పదవులను చేపట్టిన వారే. జగన్ కూడా ఇప్పటిదాకా కనీసం మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం లేని వ్యక్తే. అంటే... పాలనలో ఏమాత్రం అనుభవం లేకుండానే నేరుగా సీఎం కుర్చీ ఎక్కేసిన జగన్.. తన కేబినెట్ లో కూడా మెజారిటీ మంత్రులను కొత్తొళ్లనే తీసుకోవడంలో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు గానీ... రాష్ట్రం నానాటికీ చితికిపోతూ ఉంటే మాత్రం చూస్తూ ఊరుకోలేం కదా. అందుకే ఎప్పటికప్పుడు జగన్ సర్కారు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనదైన శైలిలో మండిపడుతున్నారు. జగన్ అనుభవరాహిత్యంతో రాష్ట్రం ఎలాంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కోనుందన్న విషయాన్ని కూడా చంద్రబాబు కళ్లకు కట్టేలా చెబుతున్నారు. 

ఇలాంటి క్రమంలో జగన్ కేబినెట్ లో మంత్రులుగా కొనసాగుతున్న వారిపై చంద్రబాబు తనదైన శైలి చురకలు అంటించారు. ప్రత్యేకించి ఆర్థిక శాస్త్రంలో తానేదో మాస్టర్ డిగ్రీ చేశానన్న రీతిలో స్పీచులు దంచుతున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీరుపై చంద్రబాబు ఓ రేంజిలో సెటైర్లు వేశారు. అసలు బుగ్గనకు ఫండమెంటల్స్ తెలుసా? అంటూ బుగ్గనపై ఒంటికాలిపై లేచారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ఆయా ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కనీస అవగాహన కూడా లేకుండా మాట్లాడుతున్న బుగ్గనను చూస్తుంటే జాలేయక తప్పదన్న వాదన ఉంది కదా. అదే వాదనను మరోమారు వినిపించిన చంద్రబాబు... ఏం తెలుసని బుగ్గనను ఆర్థిక మంత్రిని చేశారంటూ మండిపడ్డారు. బుగ్గనకు కనీసం ఆర్థికశాఖ ఫండమెంటల్స్ కూడా తెలియవని కూడా చంద్రబాబు సంచలన వ్యాఖ్య చేశారు.

ఆ తర్వాత బుగ్గన రాజకీయాలను ప్రస్తావించిన చంద్రబాబు కోడిగుడ్ల కోసం బుగ్గన అనుచరులు కర్నూలు కలెక్టరేట్ లో కొట్టుకున్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. తమ పాలనలో దోమలపై దండయాత్ర పేరిట దోమల నివారణ చేపడితే... దానిని బుగ్గన అవహేళన చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమల నివారణ లేకుంటే విష జ్వరాలను ఎలా నియంత్రిస్తారని ప్రశ్నించిన చంద్రబాబు... ఈ ప్రాథమిక సూత్రం తెలియని బుగ్గన ఆర్థిక మంత్రిగా కొనసాగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాని వారు కూడా తనను విమర్శిస్తున్నారని ఆరోపించారు. మొత్తంగా బుగ్గన అజ్ఝానాన్ని తనదైన శైలిలో ప్రస్తావించిన చంద్రబాబు... జగన్ కేబినెట్ ను ఓ ఆటాడేసుకున్నారని చెప్పక తప్పదు.