జగన్ కి చెమటలు పట్టించిన డైలాగ్

December 12, 2019

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల కొండపైకి హిందువులు తప్ప మిగిలిన మతాల వారికి ప్రవేశం లేదు. అన్యమతస్తులు కొండపైకి ప్రవేశించడం, అక్కడ తమ మతాలకు చెందిన గ్రంథాలను పట్టుకుని మత ప్రచారం చేయడం నేరమే కదా. ఇదే విషయాన్ని ఏపీకి కొత్త సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే టీటీడీలో అన్య మతస్తులకు ఎంట్రీ లేదని జగన్ సర్కారే ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. టీటీడీ బోర్డులో హిందూయేతరులకు చోటే కల్పించలేదు .  అంతేనా... 50 శాతం బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ల నిబంధనను కూడా తిరుమల విషయంలో పక్కనపెట్టేశారు. మరి క్రిస్టియన్ అయిన జగన్ తిరుమల కొండపైకి వెళ్లడమే కాకుండా బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు ఎలా సమర్పిస్తారు? సమర్పించకూడదు కదా. మరి జగన్ చేసిందేమిటి? తాను పెట్టిన నిబంధనలను తానే ఉల్లంఘించేసినట్టే కదా. 

ఇదంతా చెప్పుకుంటూ పోతే... తిరుమల విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు సరికాదని చెప్పక తప్పదు. అయినా తాను క్రిస్టియన్ ను అని జగన్ చెప్పుకోలేదంటారా? ఆయన చెప్పుకోకపోతేనేమీ... ఆయన పార్టీ నేత, అది కూడా సొంత జిల్లాకే చెందిన సీనియర్ రాజకీయవేత్త సి.రామచంద్రయ్య ఈ విషయాన్ని తేల్చేశారు. జగన్ క్రైస్తవుడేనని సీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు . మరి క్రిస్టియన్ అని తేలిపోయిన జగన్... స్వామి వారికి పట్టువస్త్రాలు ఎలా సమర్పిస్తారు? సమర్పించకూడదు కదా. ఇవేమీ పట్టని జగన్ తాను సర్టిఫై చేసిన నిబంధనలను పక్కనపెట్టి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అందుకోసమే కదా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జగన్ తీరును తప్పుబడుతున్నారు. 

జగన్ పై చంద్రబాబు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు రంగంలోకి దిగిన రామచంద్రయ్య... నిజంగానే జగన్ ను అడ్డంగా బుక్ చేసేశారు. క్రిస్టియన్ అయినంత మాత్రాన స్వామి వారి సన్నిధికి వెళ్లకూడదని ఏమీ లేదు గానీ... అలా అన్యమతస్తులు ఆలయానికి వస్తే... అక్కడ అన్య మతస్తుల కోసం పెట్టిన రిజిస్టర్ లో సంతకం చేయాల్సిందే కదా. మరి జగన్ ఎందుకు దానిలో సంతకం పెట్టలేదు? జగన్ కు క్రిస్టియన్ గానే సర్టిఫికెట్ ఇచ్చిన రామచంద్రయ్య... మరి అన్యమతస్తుల రిజిష్టర్ లో జగన్ సంతకం పెట్టకున్నా ఎలా చెల్లుబాటు అవుతుంది? జగన్ క్రిస్టియన్ అయినప్పటికీ... అన్ని మతాలను ఆయన గౌరవిస్తారని రామచంద్రయ్య చేసిన వ్యాఖ్యలను చూసినా... ఏం జగన్ ఒక్కరేనా? అన్ని మతాలను గౌరవించేది? ఓ మతానికి చెందిన వారిలో మెజారిటీ శాతం ఇతర మతాలను కూడా గౌరవిస్తున్నారు కదా. లౌకిక రాజ్యమైన భారత్ లో ఏ మతాన్ని తక్కువ చేసి చూడలేం కదా. అలాంటప్పుడు ఏ మతానికి చెందిన వ్యక్తి  అయినా ఇతర మతాలను గౌరవించాల్సిందే. క్రిస్టయన్ అయిన జగన్ ఇతర మతాలను గౌరవిస్తారని చెప్పడంలో రామచంద్రయ్య వాదన దారి తప్పినట్టుగానే కనిపిస్తోంది .

మొత్తంగా జగన్ పై చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుబట్టి, టీడీపీకి కౌంటర్ వేసేందుకు ఎంట్రీ ఇచ్చిన రామచంద్రయ్య... జగన్ ను అడ్డంగా బుక్ చేశారు. జగన్ తాను క్రిస్టియన్ అని ఎన్నడూ బహిరంగంగా చెప్పుకోలేదు. జగన్ బయటకు చెప్పకున్నా కూడా... ఎవరు ఔనన్నా, కాదన్నా కూడా జగన్  క్రిస్టియనే. అదే విషయాన్ని ఇప్పుడు బహిరంగంగా ప్రకటించి.. జగన్ ను క్రిస్టియన్ గా తేల్చేసిన రామచంద్రయ్య... జగన్ తిరుమల వెళ్లడం, అక్కడి రిజిష్టర్ లో సంతకం పెట్టకపోవడాన్ని సమర్థిస్తున్నారంటే వైసీపీ నేతల తీరు ఎలా ఉందో అర్థమవుతుంది.  మొత్తంగా చంద్రబాబు విమర్శల నుంచి జగన్ ను కాపాడబోయిన రామచంద్రయ్య... జగనే ఇరుకున పెట్టేశారు.