తాజా : పౌరసత్వ చట్టంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

June 01, 2020

భారత్ పొరుగున ఉన్న మూడు దేశాల (పాక్.. బంగ్లాదేశ్.. అప్ఘనిస్తాన్)కు చెందిన ముస్లిమేతర ప్రజలకు భారత్ లో పౌరసత్వం ఇచ్చేందుకు వీలుగా చట్టాన్ని రూపొందించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు.. ఆందోళనలు.. నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో ఈ చట్టానికి సానుకూలంగా ప్రకటనలు చేస్తున్న వారు.. మద్దతు ఇస్తున్న వారు పెద్ద ఎత్తున ఉన్నారు.
ఇలా వాదోపవాదాలు.. సానుకూల.. ప్రతికూల వాదనలతో వాతావరణం వేడెక్కింది. ఇలాంటివేళ దాదాపు అరవైకి పైగా పిటిషన్లు సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయి. ఇలాంటివేళ.. దీనిపై ఈ రోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయకుండా స్టే ఇవ్వాలంటూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ చట్టాన్ని ఇంకా అమలు చేయని కారణంగా దీనికి స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నో చెప్పేసింది. అదే సమయంలో పిటిషన్ దారుల డిమాండ్లకు స్పందించిన అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తమకొచ్చిన పిటిషన్లకు తగ్గట్లే వాటికిసమాధానాలు చెప్పాలని కేంద్రానికి నోటీసులు పంపింది. జనవరి రెండో వారం లోపు సమాధానం ఇవ్వాలని కోరింది. తదుపరి విచారణను జనవరి 22కు వాయిదా వేసింది. తాజా చట్టానికి స్టే ఇవ్వాలని కోరిన పార్టీల్లో కాంగ్రెస్ ఉండటం పెద్ద ఆశ్చర్యకరం కాకున్నా.. కమలనాథులకు అసోంలో మిత్రపక్షమైన అసోం గణ పరిషత్ కూడా పిటిషన్ వేయటం గమనార్హం.