ఊహించని సీన్... కేంద్రం.. రాష్ట్రాల మధ్య కోట్లాట

June 01, 2020

వివాదాలకు బొట్టు పెట్టి.. హారతి ఇచ్చి మరీ స్వాగతం పలికే ధైర్యం ఎవరూ చేయరు. అందరిలా ఉంటే ఆయన మోడీ ఎందుకు అవుతారు? దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న అంశాలతో పాటు.. తన ఎజెండా ప్రకారం పూర్తి చేయాలనుకున్న అంశాల్ని ఒక్కొక్కటి ప్రయారిటీ ప్రకారం తెర మీదకు తీసుకొచ్చి తమకు తోచినట్లుగా నిర్ణయాలు తీసేసుకుంటున్న మోడీ సర్కారు పుణ్యమా అని ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు దేశంలో చోటు చేసుకుంటాయో అర్థం కాని పరిస్థితి.
నిన్నటి వరకూ కామ్ గా ఉన్న ఈశాన్య భారతం పౌరసత్వ సవరణ చట్టం (క్యాబ్) పుణ్యమా అని ఎంతలా రగిలిపోతుందో తెలిసిందే. ఈ నిరసన మంటలు ఎప్పటికి అదుపులోకి వస్తాయో అర్థం కాని పరిస్థితి. ఓవైపు ప్రజాందోళనలు.. మరోవైపు విపక్షాలు పవర్లో ఉన్న రాష్ట్రాలు తల ఎగరేస్తున్న వైనం ఇప్పుడు కొత్త సమస్యకు తెర తీసినట్లైందని చెప్పాలి.
తమకున్న అధికారబలంతో క్యాబ్ ను పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదించటమే కాదు.. రాష్ట్రపతి సంతకం కూడా చేసేశారు. ఇలాంటివేళ.. క్యాబ్ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయమంటూ విపక్షాలు అధికారంలో ఉన్న ఐదు రాష్ట్రాలు (పశ్చిమబెంగాల్.. మధ్యప్రదేశ్.. పంజాబ్.. కేరళ.. చత్తీస్ గఢ్) తేల్చి చెప్పాయి. క్యాబ్ చట్టంపై తమ నిరసనను వ్యక్తం చేస్తున్న వారు.. తాము పవర్లో ఉన్న రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేయమని చెప్పగా.. రాష్ట్రాలకు అలాంటి అధికారాలు ఏమీ ఉండవని కేంద్రం స్పష్టం చేస్తోంది.
రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ లో భాగమైన కేంద్ర జాబితాలో ఆ చట్టం ఉందని.. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్నిరాష్ట్రాలు అమలు చేయమని చెప్పకూడదంటున్నారు. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ లో రక్షణ.. విదేశీ వ్యవహారాలు.. రైల్వే.. పౌరసత్వ తదితర 91 అంశాలు కేంద్ర జాబితాలో ఉన్న వేళ.. రాష్ట్రాల వాదన వీగిపోతుందన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంను పలువురు ఆశ్రయిస్తున్నారు.
క్యాబ్ చట్టంతో ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఢిల్లీ.. బెంగళూరు లాంటి నగరాల్లో నిరసలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇలాంటివేళ కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రాలు అమలు చేయమంటూ మొండికేస్తున్నవేళ.. ఈ ఇష్యూ అంతకంతకూ ముదిరిపోయే పరిస్థితి చోటు చేసుకుంటుందని చెప్పక తప్పదు. కేంద్ర.. రాష్ట్రాల మధ్య సంబంధాలు ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలే కానీ.. ఇలాంటి తీరు ఏ మాత్రం మంచిది కాదు.