ఢిల్లీలో సెల్ సిగ్న‌ల్స్ నిలిపివేత‌

June 03, 2020

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల జోరు పెరుగుతోంది. దేశంలోని అన్ని ముఖ్య‌ న‌గ‌రాలైన ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తున్నాయి. పౌరసత్వ చట్టంలో కొత్తగా చేసిన సవరణను వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర నిరసనకారులు భారీగా గుమ్మిగూడారు. ముందు జాగ్రత్త చర్యగా అక్కడ పోలీసులు 144 సెక్షన్ విధించారు. నిరసనలు తీవ్రతరం కావడంతో రూమర్లు ప్రచారం జరిగి, శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందన్న అనుమానంతో ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో మొబైల్ సేవల్ని  ప్రభుత్వం నిలిపేసింది.

పౌరసత్వ సవరణ చట్టంపై జ‌రిగే నిరసనల్లో భాగంగా,  ఎర్రకోట దగ్గర నిరసనలకు అనుమతి లేదని, నిర్దేశిత ప్రాంతాల్లోనే శాంతియుతంగా నిరసనలు చేయాలని పోలీసులు సూచించారు. ఢిల్లీ నార్త్, సెంట్రల్ జిల్లాలతోపాటు, మండీ హౌస్, సీలాంపూర్, జఫ్రాబాద్, ముస్తఫాబాద్, జామియా నగర్, షయీన్ బాగ్ ప్రాంతాల్లో కాల్స్, ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ సేవల్ని తాత్కాలికంగా ఆపేసింది. ప్రభుత్వ ఆదేశాలతో సర్వీసులను నిలిపేశామని, వినియోగదారులు గమనించాల్సిందిగా తెలుపుతూ ఎయిర్‌టెల్, వొడాఫోన్ – ఐడియా వంటి టెలికాం కంపెనీలు ట్వీట్ చేశాయి. ప్రభుత్వం నుంచి మళ్లీ ఆదేశాలు రాగానే సేవల్ని పునరుద్ధరిస్తామని తెలిపాయి.

మ‌రోవైపు, పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల గురించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. దేశంలో శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణిస్తున్నాయ‌ని అన్నారు. దేశ పౌరుల్లో ఆ చ‌ట్టంపై భ‌యం నెల‌కొంద‌ని అన్నారు. ఈ చ‌ట్టాన్ని ర‌ద్దు చేయాల‌ని ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు. దేశ యువ‌త‌కు ఉద్యోగాలు క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు.