జగన్ గారూ... కేబినెట్ బేటీ ఎర్రటి ఎండలో పెట్టారా?

August 10, 2020

వైసీపీ అధినేేత, ఏపీకి నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందేనన్న డిమాండ్ వినిపిస్తోంది. విపక్ష నేతగా ఉన్న సమయంలో మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఏపీ నూతన రాజధాని అమరావతిలో చేపట్టిన నిర్మాణాలు, రాజధాని నిర్మాణం దిశగా తీసుకున్న చర్యలను కాస్తంత గట్టిగానే విమర్శించారు. అసలు అక్కడ అమరావతే లేదని, అది అమరావతి కాదని, భ్రమరావతేనని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు చంద్రబాబు అమరావతిలో సింగిల్ ఇకుట కూడా వేయలేదని, ఇక అమరావతి ఎక్కడుందని కూడా హేళన చేశారు. సరే... విమర్శలన్నాక చాలానే చెబుతాం గానీ... మరి ఇప్పుడు కొత్తగా సీఎంగా పదవీ ప్రమాణం చేశాక... మరి జగన్ ఎక్కడ కూర్చుంటున్నారు? మొన్నటిదాకా ముహూర్తం పేరిట అమరావతి గడప తొక్కని జగన్... నిన్న ఏకంగా బాబు కట్టిన సెక్రటేరియట్ లోనే తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు కదా. 

అక్కడే సెంట్రల్ ఏసీ గదిలో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న జగన్... బాబు కట్టిన గది గోడలకే తన నవరత్నాల చిత్రాలను అంటించుకున్నారు కదా. తాను ఎంతగానో ప్రేమించే తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిలువెత్తు చిత్రపటాన్ని కూడా బాబు కట్టిన గది గోడలపైనే పెట్టించుకున్నారు కదా. అంతెందుకు నేటి ఉదయం ప్రారంభమైన కేబినెట్ భేటీని కూడా బాబు కట్టిన సెంట్రల్ ఏసీ సమావేశ మందిరంలోనే నిర్వహించారు కదా. అంటే... అమరావతి దిశగా బాబు చేసినదంతా నిజమేనని జగన్ ఒప్పుకుని తీరాలి కదా. అలా కాకుండా బాబు అమరావతిలో సింగిల్ ఇటుక కూడా కట్టలేదన్న వాదనకే కట్టుబడితే... నేటి కేబినెట్ భేటీని ఎర్రటి ఎండలోనే, భగభగ మండే బానుడి కిందే పెట్టాలి కదా. అలా కాకుండా సెంట్రల్ ఏసీ గదిలోనే జగన్ కేబినెట్ భేటీ నిర్వహించారంటే... జగన్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే కదా. అలా అని జగన్ ఒప్పుకోవాల్సిందే కదా.