బాబును మరిపించడానికి జ‌గ‌న్ వ్యూహం ఏంటి..?

July 06, 2020

ప్ర‌జా క్షేత్రంలో ఓడిపోయినా చంద్ర‌బాబు ప్ర‌భ ఏమాత్రం త‌గ్గ‌లేదు. పైగా ఆయ‌న‌పై విశ్వాసం స‌న్న‌గిల్ల‌లేద‌నేందుకు నిత్యం ఆయ‌న ఇంటికి క్యూ క‌డుతున్న మ‌హిళ‌లు, వృద్ధులు ప్ర‌ధాన నిద‌ర్శ‌నంగా మిగులుతున్నారు. ఇలాంటి చంద్ర‌బాబును ఢీ కొట్టి అధికారంలోకి వ‌చ్చినా.. జ‌గ‌న్‌కు మాత్రం రాజ‌కీయంగా ప‌రిస్థితులు పూర్తిస్థాయిలో అనుకూలంగా మారిపోయాయ‌ని చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. తాజా ఎన్నిక‌ల్లో 151 సీట్లు సంపాయించుకున్నా.. పూర్తిస్థాయిలో టీడీపీని నేలమట్టం చేశామ‌ని అనుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. వాస్త‌వానికి ఏ రాష్ట్రంలో అయినా.. ప్ర‌తిప‌క్షం ఉండాల్సిందే. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించేందుకు ప్ర‌తిప‌క్షం పాత్ర కంప‌ల్స‌రీ..!

అయితే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజ‌కీయంగా భిన్న‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న నాయ‌కులు ప్ర‌తిపక్ష‌మే లేకుండా చేయాల‌ని చూస్తున్నారు. తెలంగాణాలో బ‌లంగా ఉన్న కాంగ్రెస్‌ను విలీనం చేసుకోవ‌డం ద్వారా కేసీఆర్ త‌న బ‌లాన్ని పెంచుకుని అతిపెద్ద జాతీయ పార్టీని ఇరుకున పెట్టారు. ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ 23 మంది ఎమ్మెల్యేల‌తో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీని ఏదో ఒక విధంగా అణ‌గ‌దొక్కాల‌ని, పార్టీని నామ‌రూపాలు లేకుండా చేయాల‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అస‌లు ప్ర‌తిప‌క్షమే లేకుండా చేయాల‌నే వ్యూహంతో అధికార పార్టీ వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ప్ర‌ధానంగా ఏపీపై చంద్ర‌బాబు పాల‌న‌లో వేసిన ముద్ర‌ల‌ను తుడిపేయాల‌నేది జ‌గ‌న్ వ్యూహంగా క‌నిపిస్తోంది. అందుకే ఆయ‌న చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముఖ్యంగా చంద్ర‌బాబు పాల‌న అంతా అవినీతి మ‌యం.. అని నిరూపించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌జావేదిక వంటి బ‌హుళ ప్ర‌యోజ‌నాల‌కు వినియోగించే భ‌వ‌నాన్ని నిబంధన‌ల పేరుతో కూల‌గొట్టించారు. ఇప్పుడు చంద్ర‌బాబు నివాసానికి ఇచ్చిన నోటీసుల‌కు గ‌డువు మీరుతోంది. మ‌రోప‌క్క‌, టీడీపీ కార్యాల‌యాల‌కు కూడా నోటీసులు జారీ అవుతున్నాయి. విశాఖ ప‌ట్నంలోని కార్యాల‌యానికి నోటీసులు ఇచ్చారు. ఇక‌,ఇప్పుడు గుంటూరు ఆఫీస్‌కు కూడా నోటీసులు ఇస్తార‌ని అంటున్నారు.

మొత్తంగా ఈ వ్య‌వ‌హారాన్ని ప‌రిశీలిస్తే.. జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా టీడీపీని కూక‌టి వేళ్ల‌తో పాటు పెక‌లించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే, విజ్ఞులు, మేధావి వ‌ర్గాలు మాత్రం.. ప్ర‌తిప‌క్ష‌మే ఉండ‌కూడ‌ద‌ని భావించ‌డం స‌మంజసం కాద‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో రాష్ట్రంలో టీడీపీని లేకుండా చేసేందుకు జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసినా.. వాటి వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని చెబుతున్నారు. ఒక‌నాడు అన్న‌గారు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకి ఆయ‌నే ఐకాన్‌. అది కేవ‌లం సినీ గ్లామ‌ర్ లేదా రెండు రూపాయ‌ల కిలో బియ్యం, లేదా ఆయ‌న ప్ర‌సంగాలు. అదేవిధంగా ఇప్పుడు టీడీపీకి కూడా బ్రాండ్ చంద్ర‌బాబే! `మార్పు` కోరుకున్న స‌మాజంలోని ఓ వ‌ర్గం నేడు చంద్ర‌బాబు ను దూరంగా పెట్టి ఉండొచ్చు.

అంత‌మాత్రాన .. మొత్తంగా ప్ర‌జ‌లు చంద్ర‌బాబును వ్య‌తిరేకించార‌ని అనుకుంటే పొర‌పాటేన‌ని అంటున్నారు ప‌రిశీలకులు. దాదాపు 40% పైగా ఓట్ షేర్ టీడీపీ ఖాతాలో ప‌డింది. చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు కేవ‌లం వెయ్యి ఓట్ల తేడా తో విజ‌యం సాధించారు. అంటే .. టీడీపీని ప్ర‌జ‌లు తిప్పి కొట్ట‌లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. చంద్ర‌బాబు విజ‌న్‌. దీనిని తుడిపేసే ప్ర‌య‌త్నం చేస్తే.. జ‌గ‌న్ వ్యూహం సిద్ధిస్తుంది. అయితే, ఇదేమంత తేలిక విష‌యం కాదు. కియా ప‌రిశ్ర‌మ‌ను తెచ్చిన చంద్ర‌బాబుకు దీటుగా జ‌గ‌న్ ఓక్క్‌వ్యాగ‌న్ లేదా బీఎండ‌బ్ల్యు వంటి సంస్థ‌ను తీసుకువ‌స్తే.. బాబును మించిన జ‌గ‌న్ అవుతారు.

అదే స‌మ‌యంలో అమరావతిని చంద్రబాబు వరల్డ్ క్లాస్ సిటీగా కడతా అన్నాడు. ప్లాన్ రెడీ చేసి కట్టడం కూడా మొదలు పెట్టేశాడు. ఇదంతా ఆల్రెడీ చూసింది ఏపీ. అయినా అదేం గొప్ప ! జగన్ అమరావతిని అయినా కట్టాలి, దానికి మించి పని అయినా చేయాలి. అపుడే బాబు కంటే మిన్న అవగలడు. అంతే కానీ కార్యకర్తల్ని పొడిస్తేనో – ఆఫీసులు ఖాళీ చేయిస్తేనో – లీడర్లను లాగేస్తేనో – ఆఖరికి శాసన సభా పక్షాన్ని విలీనం చేయిస్తేనో చంద్రబాబు వీక్ అవ్వడు. ఎందుకంటే చంద్రబాబు చుట్టూ ఉన్నవాళ్లని నమ్ముకోలేదు. చంద్రబాబునే చుట్టుపక్కల ప్రపంచం నమ్ముకుంది. జ‌గ‌న్ ఈ విష‌యాల‌ను దృష్టిలో ఉంచుకుంటే .. స‌క్సెస్ అవుతారు త‌ప్పితే.. బాబు వంటి మేరున‌గాన్ని ఢీకొట్టేందుకు దొడ్డిదారులు వెతుక్కుంటే.. తిరిగి ప్ర‌తిప‌క్షంలో కూర్చోవ‌డం ఖాయం!!