బాలయ్య మావకు... లోకేష్ కంగ్రాట్స్... ఎందుకు? 

August 09, 2020

నారా లోకేష్ తన మావ బాలకృష్ణకు అభినందనలు తెలిపారు. ఇపుడేం సందర్భం ఉందబ్బా... బర్త్ డే మొన్నే అయిపోయింది. ఇంకెందుకు అనుకుని బుర్రకు మీరేం పదును పెట్టాల్సిన అవసరం లేదు. 

బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పూర్తి స్థాయిలో ప్రజాసేవకు అంకితమై  రెండు దశబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ ఆస్పత్రి ఛైర్మన్ అయిన నందమూరి బాలకృష్ణకు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. 

లోకేష్ మాటల్లో....

’’ తాత ఎన్టీఆర్ గారి సేవాస్ఫూర్తికి, అమ్మమ్మ బసవతారకంగారి స్మృతికి ప్రతిరూపంగా రూపుదిద్దుకున్న 'బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి' ప్రజల సేవలో 20 ఏళ్ళు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా మావయ్య, ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణగారికి అభినందనలు. ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతను అందుకుంటూ, ఆధునిక చికిత్సలను అందిస్తూ... ఇప్పటివరకు సుమారు రెండున్నర లక్షలమందికి పైగా సేవలందించిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి... మున్ముందు మరిన్ని మైలురాళ్ళను అధిగమించాలని కోరుకుంటున్నాను ‘‘  

ఇది బాలకృష్ణకు లోకేష్ ఇచ్చిన సందేశం.  ఈ ఆస్పత్రి ఎందరికో దేవాలయం. ఆశ వదులుకుని వచ్చిన ఎందరికో ప్రాణ భిక్ష పెట్టిన పుణ్యస్థలం ఈ ఆస్పత్రి. ఈ ఆస్పత్రికి జనాల్లో ఉన్న ఆదరణ, మర్యాద, గౌరవం అనన్య సామాన్యమైనవి.

నిజంగా అవసరం ఉన్న వారికి సరైన సమయంలో ఖరీదైన చికిత్సను అత్యంత అందుబాటు ధరల్లో, పేదలకు ఉచితంగా అందిస్తోందీ బసవతారకం ఆస్పత్రి (Basavatarakam Indo American Cancer Hospital ) మరెన్నో ప్రాణాలు కాపాడాలని మనమూ కోరుకుందాం.