అక్కడ అభ్యర్థులు మారలేదు.. కానీ పార్టీలు మారాయి

August 21, 2019

ఎన్నో ఊహాగానాలు.. మరెన్నో మలుపులు.. మధ్యలో కొంత హైడ్రామా.. ఇదీ మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వ్యవహారంలో జరిగింది. ఆమె టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని ఆ మధ్య లీక్ వచ్చినా.. ఆ తర్వాత కొద్దిరోజులు ఈ వార్త మరుగున పడిపోయింది. ఇక ఇటీవల ఇదే బాగా ప్రచారం జరగడంతో సబితకు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఫోన్‌ చేసి.. పార్టీని వీడవద్దని కోరారు. ఏదైనా ఉంటే అధిష్ఠానంతో మాట్లాడాలని, ఆ ఏర్పాటు తాను చేస్తానని ఆయన చెప్పారని తెలిసింది. దీంతో సబిత మనసు మార్చుకున్నారని, రాహుల్‌గాంధీని కలవనున్నారంటూ మంగళవారం హైడ్రామా నడిచింది. కానీ, బుధవారం మాత్రం ఇద్దరు కుమారులు కార్తీక్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డితో కలిసి ఆమె సాయంత్రం ప్రగతిభవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. దాదాపు రెండు గంటల తర్వాత తిరిగి వెళ్లిపోయారు. ఈ భేటీ తర్వాత ‘‘సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశాం. మేం అడగాల్సినవి అడిగాం. ఆయన చెప్పాల్సినవి చెప్పారు. చేవెళ్లలో జరగనున్న భారీ బహిరంగసభలో టీఆర్‌ఎస్‌లో చేరుతాం’’ అని కార్తీక్ రెడ్డి చెప్పడంతో దీనికి ఎండ్ కార్డ్ పడింది. దీని తర్వాత సబిత కుమారుడు కార్తీక్ రెడ్డికి టీఆర్ఎస్ నుంచి చేవెళ్ల ఎంపీ సీటు ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి సబితా ఇంద్రారెడ్డిని టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించడానికి చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ రాజకీయాలే కారణమని తెలుస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా విజయం సాధించిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. తాజా ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ టికెట్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆయనకే ఖరారు చేసింది. కాగా ఈ నియోజకవర్గ పరిధిలోని తాండూరు, మహేశ్వరం శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ నేపథ్యంలో చేవెళ్లను టీఆర్‌ఎస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నియోజకవర్గంలో బలమైన నేత సబితా ఇంద్రారెడ్డిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నట్లుగా కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ టికెట్ కార్తీక్ రెడ్డికే వస్తే అక్కడో అరుదైన పరిణామం చోటు చేసుకుంటుంది. 2014 ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ స్థానంలో కార్తీక్‌రెడ్డి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా కార్తీక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. దీంతో చేవెళ్లలో గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రత్యర్థులు పరస్పరం పార్టీలు మారినట్లయింది.