రాజధాని కమిటీ రిపోర్ట్ - విభజించు పాలించు !!

February 23, 2020

జగన్ సర్కారు అటు తిప్పి ఇటు తిప్పి చివరకు బ్రిటిష్ వాడి ఫార్ములాను ఫాలో అవడానికి రెడీ అయిపోయింది. నిపుణుల కమిటీ అంటూ ఏర్పాటుచేసిన జీఎన్ రావు కమిటీ జగన్ మాటను తు.చ. తప్పకుండా ఫాలో అయ్యింది. ముఖ్యమంత్రి మనసు తెలుసుకని రిపోర్ట్ తయారుచేసింది. ముఖ్యమంత్రి జగన్ తానేదో అమాయకుడు అన్నట్టు ఏమో నిపుణుల కమిటీ ఇదే చెప్పొచ్చే మో అంటూ పలికిన చిలుకపలుకలనే సీరియస్ గా పట్టించుకుంది. నాలుగు నెలల నివేదిక పక్కన పెట్టేసి జగన్ నోటి నుంచిజాలు వారిన ముత్యాలను ఏరి రిపోర్టు సమర్పించింది నిపుణుల కమిటీ. 

ఈ రిపోర్టు చూడటానికి ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు, పరిపాలన సౌలభ్యం అనిపించినా... లోతుగా చూస్తే విభజించు పాలించు అన్న ధోరణిలో కనిపిస్తోంది. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే కొందరు స్వార్థపరులకు ఇది పెద్ద ఆయుధాన్ని అందించే ప్రమాదం లేకపోలేదు. 

గతంలో అసెంబ్లీలో రాజధాని 30 వేల ఎకరాలకు తక్కువ కాకుండా కట్టమని చెప్పిన జగనన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి కాగానే... రాష్ట్ర లక్ష్యాలను పక్కన పెట్టి... ఉత్తరాంధ్రతో రాజకీయ చదరంగం అడుతున్నారు. రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజల్లో కొత్త ఆశను పుట్టించారు. దానికి అనుగుణంగా కమిటీ కూడా నడుచుకున్నట్టు నివేదిక చూస్తే అర్థమవుతుంది.

కమిటీ ముఖ్యాంశాలు :

1. ఏపీని నాలుగు ప్రాంతాలుగా విభజించాలి. ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమగా విభజించాలి. మధ్య కోస్తాలో గోదావరి జిల్లాలు, కృష్ణా, దక్షిణ కోస్తాలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉంటాయి. మిగతావి తెలిసినవే. దీనివల్ల పరిపాలన సౌలభ్యం కలుగుతుందని నిపుణుల కమిటీ సూచించింది. చిన్న జిల్లాల వల్ల పరిపాలన సౌలభ్యం కలుగుతుంది గాని ప్రాంతాల విభజన వల్ల ఆ లక్ష్యం నెరవేరదు. 

2. విశాఖలో సీఎం క్యాంపు ఆఫీసు, హైకోర్టు బెంచ్, సెక్రటేరియట్, వేసవి అసెంబ్లీ ఉండాలని కమిటీ సూచించింది. అంటే.. ఏపీకి వైజాగ్ రాజధాని అవుతుంది. అమరావతి, కర్నూలు కేవలం డమ్మీలు అని ఈ సూచనతో అర్థమవుతుంది. 

3. తుళ్లూరు ప్రాంతంలో ఇప్పటికే చాలా భవనాలు నిర్మాణంలో ఉన్నందున వాటిని పూర్తిచేసి వాడుకోవాలి. మిగతా ఏరియాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు.

4. నాగార్జున వర్సిటీ ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి కాబట్టి ఏవైనా ఐకానిక్ బిల్డింగులు కట్టాలనుకుంటే అక్కడ కడితే సరిపోతుంది. 

5. రాయలసీమ వారు అడుగుతున్నారు కాబట్టి శ్రీబాగ్ ఒడంబడిక అమలు చేస్తే బాగుంటుంది. 

కొసమెరుపు - ఈ నివేదిక చూస్తుంటే నిపుణుల కమిటీ తయారుచేసినట్టు లేదు. ముఖ్యమంత్రి మాటల ఆధారంగా ఒక అడ్వయిజరీ నోట్ తయారుచేసినట్టు ఉంది. ఈ మాత్రానికి రాష్ట్రంలో అలజడి, ప్రజలకు వేదన. అమరావతిలో ప్రభుత్వ భూములు ఇచ్చిన వేలమంది రైతుల వేదన గురించి ఈ రిపోర్టులో ఒక్క ముక్క లేదు.