దీపం వెలిగించే ముందు ఒక మాట

August 04, 2020

ఫలానా టైంకి ఇంట్లో నుంచి బయటకు వచ్చి గంట కొట్టంది. ఫలానా వేళలో ఇంట్లో లైట్లు ఆపి దీపాలు వెలిగించండి. ఇలాంటి పిలుపు మన దేశంలో గతంలో ప్రధానిగా వ్యవహరించిన వారెవరూ ఇవ్వలేదు. ఒకవేళ.. ఇచ్చి ఉంటే ఎలాంటి విమర్శలు ఎదుర్కొని ఉండేవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. అలాంటి భిన్నమైన పిలుపులు ఇవ్వటమే కాదు.. అలాంటివి కలిసి చేయటం ద్వారా దేశం మొత్తం ఒకే తాటి మీద ఉందన్న సందేశాన్ని ఇవ్వటం ఎలానో చూపిస్తున్న మోడీ తీరుపై ఇప్పుడు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అదే సమయంలో సోషల్ మీడియాలో సరదా వ్యాఖ్యలు చోటు చేసుకుంటున్నాయి. అప్పుడప్పుడు టీవీ తెర మీదకు వచ్చి మోడీ సాబ్ భలే టాస్కులు ఇస్తున్నాడు కదా? అని ఒకరంటే.. మూడో టాస్కు ఏమై ఉంటుందబ్బా అంటూ ప్రశ్నించేవారు లేకపోలేదు.
ఈ రోజు (ఆదివారం) రాత్రి సరిగ్గా తొమ్మిది గంటల వేళలో తొమ్మిది నిమిషాల పాటు ఇంట్లో లైట్లు బంద్ చేసి.. నూనె దీపాలు.. కొవ్వొత్తులు.. లేదంటే మొబైల్.. టార్చిలైట్ తో దీపాలు వెలిగించాలన్న సందేశాన్ని ఇచ్చారు ప్రధాని. దీనికి కొత్త కొత్త థియరీలు పుట్టుకొచ్చాయి. వీటిని నమ్మేవాళ్లు.. నమ్మనివాళ్ల మధ్య గడిచిన రెండు రోజలుగా హాట్ హాట్ చర్చలు సాగాయి. మొత్తానికి అనుకున్న రోజు రానే వచ్చింది.
ప్రధాని మోడీ నోటి నుంచి రావాలే కానీ.. ఏమైనా చేయటానికి సిద్ధమన్నట్లుగా దేశ ప్రజలు స్పందిస్తున్న తీరు తెలిసిందే. అయితే.. ఈసారి ఇచ్చిన పిలుపు సందర్భంగా ఏ మాత్రం జాగ్రత్త తీసుకోకున్నా కొత్త ప్రమాదం పొంచి ఉందన్నది మర్చిపోకూడదు. కరోనా వేళ.. చేతికి శానిటైజర్లు పూసుకోవటం ఒక అలవాటుగా మారింది. అలా చేతులకు శానిటైజర్ రాసుకొని దీపాన్ని వెలిగిస్తే.. చేతులు కాలే ముప్పు ఉందన్నది మర్చిపోకూడదు.
శానిటైజర్లలో ఉండే అల్కాహాల్ కంటెంట్ కు మండే స్వభావం ఎక్కువ. ఈ విషయాన్ని మర్చిపోయి.. దీపాన్ని వెలిగిస్తే చేతులు అంటుకునే ప్రమాదం ఉంది. అందుకే.. ఈ రోజు రాత్రి దీపాన్ని వెలిగించే వారు ఎవరైనా సరే.. చేతుల్ని శుభ్రంగా సబ్బుతో కడుక్కోవటం మంచిది. లేకుంటే.. శానిటైజర్ వాడకుండా ఉంటే సరిపోతుంది. ఈ రోజులో శానిటైజర్ వాడి ఉంటారు కాబట్టి.. దీపాన్ని వెలిగించటానికి కాస్త ముందే చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కోవటం చాలా ముఖ్యమన్నది మర్చిపోవద్దు.