13 జిల్లాలకూ కరోనా!

August 13, 2020

విశాఖలో తొక్కిపెట్టే యత్నాలు విఫలం
విజయనగరానికీ పాకిన వైరస్‌
గవర్నర్‌ భవనానికి దేశంలో తొలిసారి
కర్నూలు ఎంపీ ఇంట్లో ఆరుగురికి కరోనా
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ఇంట్లో కూడా..


కరోనా వైరస్‌పై జగన్‌ ప్రభుత్వం కాకిలెక్కలు చెబుతూ వస్తోంది. ప్రతి రాష్ట్రం జిల్లా యూనిట్‌గా వైద్య సేవలు అందిస్తుంటే.. ఎన్నికల పిచ్చి పట్టిన మన సర్కారు మాత్రం మండలాల లెక్క చెబుతోంది. రాష్ట్రంలో 80 శాతం మండలాల్లో కరోనా ప్రభావం లేదని.. 20 శాతం మండలాల్లోనే దాని ప్రభావం ఉందని. ఇందులో కూడా ఆరెంజ్‌ జోన్లే ఎక్కువని సీఎం జగన్‌, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతూ వస్తున్నారు. వైరస్‌ ప్రభావం లేనందున స్థానిక సంస్థల ఎన్నికలను హడావుడిగా జరపాలన్నది ముఖ్యమంత్రి ఎత్తుగడ. తద్వారా తన నిర్ణయాలన్నిటికీ ప్రజామోదం ఉందని నిరూపించుకోవాలని ఆయన ఉబలాటపడుతున్నారు.

ముఖ్యంగా రాజధానిని ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్‌ 2నాటికి విశాఖకు తరలించాలని ఆయన గట్టిపట్టుదలగా ఉన్నారు. అందుకే సచివాలయ ఉద్యోగుల సంఘ నేతలను తన చెప్పుచేతల్లో పెట్టుకుని.. వారి ద్వారా మే నెలాఖరుకల్లా విశాఖ తరలిపోవడానికి సిద్ధంగా ఉండాలని ఉద్యోగులకు చెప్పించారు. అలాగే విశాఖలో కరోనా విజృంభిస్తున్నా.. ఆ సమాచారం బయటకు పొక్కకుండా తొక్కిపెట్టారు. దాని ప్రభావం ఉత్తరాంధ్రలో లేనే లేదని తన మీడియా ద్వారా ప్రచారం చేశారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరంలో కేసులు నమోదే కాలేదన్నారు. మర్నాడే శ్రీకాకుళంలో ఐదు కేసులు బయటపడ్డాయి.

విశాఖలో పాజిటివ్‌ కేసులు పెరిగాయి. చివరకు విజయనగరానికీ విస్తరించింది. ఇప్పుడు రాష్ట్రంలోని 13 జిల్లాలకూ కరోనా పాకింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా విజయవాడలోని రాజ్‌భవన్‌కూ తొలిసారి వైరస్‌ సోకింది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న నలుగురు ఉద్యోగులకు  పాజిటివ్‌ వచ్చింది. సిబ్బందిలో కొందరికి అనుమానిత లక్షణాలు కనిపించడంతో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సహా 8మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. వారిలో నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. తర్వాత రెండు రోజులకు మరో ఇద్దరికి సోకినట్లు తెలిసింది.

కరోనా వైరస్‌ వ్యాప్తిలో ఆంధ్రప్రదేశ్‌ మూడోదశ ప్రారంభంలో ఉందని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు... ఇది మరింత ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారమే సుమారు 40 మందికి వైరస్‌ ఎలా, ఎవరిద్వారా సోకిందో గుర్తించలేకపోయారు. వీరికి ఎలాంటి ప్రయాణ నేపథ్యం లేదు. ఢిల్లీ కనెక్షన్‌ కూడా లేదు. కర్నూలు నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడితో మొదలైన ‘నిశ్శబ్ద విస్తృతి’ అటు తెలంగాణలోనూ కలకలం సృష్టిస్తోంది. అనంతపురం, రాజమండ్రి, గుంటూరు, శ్రీకాళహస్తి వంటి అనేక ప్రాంతాల్లోనూ ఇలాంటి కేసులు బయటపడుతున్నాయి.


ఆ మూడు జిల్లాలూ ఫస్టు..
రాష్ట్రంలో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలు కేసుల పరంగా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. నిజాముద్దీన్‌లో తబ్లీగీ జమాత సమ్మేళనానికి వెళ్లివచ్చిన వారి వల్ల ఎక్కువ జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దీనిని తొక్కిపెట్టడానికి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా విశ్వప్రయత్నాలు చేశారు. తమ వారికి కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించేందుకు హఫీజ్‌ఖాన్‌ అంగీకరించలేదు. లేనిపోని అనుమానాలు కలిగిస్తున్నారని ఆరోగ్య సిబ్బందిపై దాడులు చేయించారు.

కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌ ఇంట్లో ఆరుగురు కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. ఆయన డాక్టరు కూడా.
కరోనా కమ్యూనిటీలో వ్యాపించిందని, ఇక ఈ వైర్‌సను ఆపడం ఎవరి తరమూ కాదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మరణాల రేటును తగ్గించడం పైనే దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉందన్నారు. తన తండ్రితో కలిపి తమ కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చిందని, అందులో నలుగురు వైద్యులు ఉన్నారని చెప్పారు. అంతమాత్రాన ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి ప్లాస్మా థెరపీ ఒక్కటే మంచి ఉపశమనమని ఓ వైద్యుడిగా తన అభిప్రాయమన్నారు. లాక్‌డౌనతో ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని చెప్పారు.


ఆ డాక్టరు నిర్లక్ష్యం..
కర్నూలు నగరంలో ఆయన ఓ ప్రముఖ వైద్యుడు. స్థానికులతోపాటు, తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, గద్వాల, నిజామాబాద్‌ తదితర  ప్రాంతాల నుంచి సామాన్యులు వచ్చి వైద్యచికిత్స చేయించుకుంటారు. మంచి హస్తవాసితోపాటు తక్కువ ఫీజు తీసుకొని వైద్యం చేస్తారన్న పేరు ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా వస్తుంటారు. ఇంత వరకు బాగానే ఉంది. కరోనా డేంజర్‌బెల్స్‌ మెగిన తర్వాత, ఢిల్లీ మర్కజ్‌ నుంచి వచ్చిన కొందరికి ఆ వైద్యుడు గుట్టుగా వైద్యం చేశారు. ఆ తర్వాత  ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మందికి ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. కరోనా గుట్టుగా ఉండనివ్వదుకదా...ఆ డాక్టర్‌కు ప్రాణాలమీదకు తీసుకొచ్చింది.

ఓ రోజు అనూహ్యంగా ఆయన ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ మరణించారు. ఇప్పుడు సమస్యల్లా... ఈ డాక్టర్‌ను కలిసిన వారు ఎవరు? వారి పరిస్థితి ఏమిటో నిగ్గుతేల్చాలి. ఇప్పటికే కర్నూలు జిల్లాలో ఆయన వద్ద చికిత్స తీసుకున్న అనేక మందికి పాజిటివ్‌ వచ్చిందని తేలింది. చివరకు  ఆ  వైద్యుడి ఇంట్లోనూ పాజిటివ్‌ కేసులు తేలాయి. ఇక, మహబూబ్‌నగర్‌, గద్వాల జిల్లాల నుంచి వచ్చి చికిత్స పొందిన వారి పరిస్థితి ఏమిటో? వారు ఎలా ఉన్నారో? వారి ద్వారా ఇంకా ఎంతమందికి సోకిందో అంతుచిక్కని అంశంగా మారింది. తాము ఆ వైద్యుడి దగ్గర చికిత్స తీసుకున్నామని ఇప్పటిదాకా ఎవ్వరూ ముందుకు రాలేదు.

దీంతో  పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైద్యురాలు ఇటీవల ఓ హోంగార్డుకు చికిత్స అందించారు. నిజానికి ఆ హోమ్‌గార్డుకు కరోనా పాజిటివ్‌ ఉంది. అయినా ఆమె చికిత్స చేసి.. తానూ కరోనా బారినపడ్డారు. ఇటీవలి కాలంలో ఆ మహిళా డాక్టర్‌ ఎంత మందికి చికిత్స చేశారు? వారు ఏ ప్రాంతాలకు చెందినవారే గుర్తించి తక్షణమే వారిని క్వారంటైన్‌ చేయాలి. లేదంటే కరోనా మరింతగా పాకే ప్రమాదం ఉంది. కానీ ఆ డాక్టర్‌ కాంటాక్ట్‌ల జాబితా చెప్పడం లేదు.

ఈ క్రమంలో ఈనెల 14న నరసరావుపేటలో పలువురికి పరీక్షలు చేయగా, 20కిపైగా పాజిటివ్‌ వచ్చాయి. అలాగే, రాజమండ్రిలో ఓ ఆర్‌ఎంపీకి పరీక్ష చేయగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఆయనకు ఎలా వచ్చిందని ఆరాతీస్తే...ఓ పాజిటివ్‌ పేషంట్‌కు ఆయన చికిత్స చేశారని వెలుగుచూసింది. మరి, ఆ ఆర్‌ఎంపీ వద్ద వైద్యం చేయించుకొన్నవారెవరూ ఇప్పుడు ముందుకు రావడం లేదు. దీంతో లింకుల లెక్క తేల్చడం అధికారుల తరం కావడం లేదు.

గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా కూడా ఆరోగ్య సిబ్బంది సర్వేను అడ్డుకున్నారు. కరోనా పరీక్షలకు నిరాకరించారు. ఆయన ఉంటున్న ప్రాంతంలో అనేక మంది తబ్లీగీ సమావేశానికి వెళ్లివచ్చారు. ఆయన కుటుంబంలోనూ 11 మందికి వైరస్‌ సోకినట్లు ప్రచారం జరుగుతోంది.


వైసీపీ నేతల అరాచకం..
రాష్ట్రమంతటికీ కరోనా సోకడానికి వైసీపీ నేతలే కారణమని టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. లాక్‌డౌన్‌ పేరిట సామాన్యులను బయటకు రానివ్వని పోలీసులు.. వైసీపీ నేతలు ఏకంగా ర్యాలీలే చేపడుతున్నా పట్టించుకోవడం లేదు. వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి యథేచ్ఛగా రాష్ట్రమంతటా తిరుగుతున్నారు. విశాఖలోనే తిష్టవేసి.. వైసీపీ కార్యకర్తలతో కలిసి బహిరంగంగానే సమావేశాలు జరుపుతున్నారు. భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను తుంగలొ తొక్కుతున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా అంతే.

ఎలాంటి ఆంక్షలు పాటించకుండా విజయనగరం నుంచి అమరావతి వరకు ఆయన తిరిగేస్తున్నారు. అనంతపురం, కడప ఎమ్మెల్యేలు నిరాటంకంగా బెంగళూరు వెళ్లి వస్తున్నారు. రాష్ట్ర విద్యా మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఏ నిమిషంలో హైదరాబాద్‌లో ప్రత్యక్షమవుతారో తెలియదు.  వలస కూలీలను ఎక్కడికక్కడ ఆపేస్తున్న పోలీసులు.. సరిహద్దుల్లో వీరిని ఎందుకు అడ్డుకోవడం లేదో.. ఎందుకు క్వారంటైన్‌కు పంపడం లేదో తెలియడం లేదు. ఇంత అరాచకంగా వ్యవహరిస్తున్నందునే వైరస్‌ 13 జిల్లాలకు వ్యాపిస్తోంది.


అమ్మో ఆంధ్రా...
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలను అడ్డుకునేందుకు తమిళనాడు అధికారులు ఏకంగా రోడ్లపై గోడలే కట్టేశారు. వేలూరు జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వేలూరు-గుడియాత్తం మార్గంలోని పలమనేరు రోడ్డు సయనగుండ చెక్‌పోస్టు వద్ద గోడను నిర్మించారు. దీనివల్ల అత్యవసర రవాణాకు ఆటంకఆలు ఎదురుకావడంతో ఆ తర్వాత తొలగించారు.