ఇరికించేశారు : రాజకీయం రుచి చూసిన రజనీకాంత్

August 14, 2020

తమిళ తంబీలంతా ఆప్యాయంగా తలైవాగా పిలుచుకునే సూపర్ స్టార్ రజనీకాంత్‌పై మరో వివాదం రేకెత్తింది. సినిమాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోకి దిగేస్తున్నాననంటూ ప్రకటన చేసిన నాటి నుంచి తలైవాపై ఏదో ఒక వివాదం రేకెత్తుతూనే ఉంది. అయితే ఇప్పటిదాకా రేకెత్తిన వివాదాలు ఓ మోస్తరు చిన్నవే అయినా... ఈ సారి రేకెత్తిన వివాదం మాత్రం తలైవాపై కేసు నమోదయ్యే దాకా వెళ్లింది. మరి ఈ వివాదం నుంచి తలైవా ఎలా బయటపడతారన్నది ఆసక్తికరంగా మారిపోయింది. 

తలైవాపై కేసు నమోదు దాకా వెళ్లిన ఈ వివాదం వివరాల్లోకెళితే... ద్రావిడ పితామహుడు తందై పెరియార్‌ను కించపరిచేలా రజనీ వ్యాఖ్యలు చేశారని ద్రావిడర్‌ విడుదలై కళగం అనే  సంఘం చెన్నైలోని కోవై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ నెల 14న చెన్నైలో జరిగిన ‘తుగ్లక్‌’ పత్రిక వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న రజనీ... పెరియార్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 1971లో సేలంలో పెరియార్‌ నిర్వహించిన ర్యాలీలో.. సీతారాముల విగ్రహాలను నగ్నంగా తీసుకెళ్లారని ఆయన పేర్కొన్నారు.

లోకల్ ఫీలింగ్ విషయంలో అందరికంటే ముందు ఉండే తంబీలు... రజనీ నోట ద్రావిడ పితామహుడిగా పేరున్న పెరియార్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినంతనే ఓ రేంజిలో ఫైరయ్యారు. పెరియార్ ను రజనీ విమర్శించడం తమిళనాట నిజంగానే తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలపై పెరియార్ అభిమాన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. అంతేకాకుండా ఏకంగా రజనీపై పోలీసులకు కంప్లైంట్ అందడం, పోలీసులు విచారణ ప్రారంభించడం వెంటవెంటనే జరిగిపోయాయి. మరి ఈ వివాదం నుంచి తలైవా ఎలా బయటపడతారో చూడాలి.