అసదుద్దీన్ ను మధ్యప్రదేశ్ లో ఇరికించారు

April 03, 2020

అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పుపై మజ్లిస్ అధినేత.. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ లోని పాతబస్తీలో అర్థరాత్రి వేళ నిర్వహించిన బహిరంగ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. సంచలనంగా మారిన అసద్ వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. సుప్రీం తీర్పు తనకు సంతృప్తి కలిగించలేదని.. ముస్లిం వర్గానికి అన్యాయం జరిగిందన్నారు.
సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తాం కానీ.. అయితే అదే సర్వోన్నతమైనది కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలం తమకు దానం ఇవ్వాల్సిన అవసరం లేదని.. తాను హైదరాబాద్ రోడ్ల మీద భిక్షాటన చేస్తే అయోధ్యలో ఐదు ఎకరాలు కొనుగోలు చేయగలనని వ్యాఖ్యానించారు.
తమపై సానుభూతి.. అభిమానం చూపాల్సిన అవసరం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఓవైసీ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ కు చెందిన న్యాయవాది పవన్ కుమార్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లో ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై జహంగీర్ బాద్ పోలీస్ స్టేషన్ లో మజ్లిస్ అధినేతపై కంప్లైంట్ చేశారు. దీంతో అక్కడి పోలీసులు అసద్ పైన కేసు నమోదు చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. అర్థరాత్రి నిర్వహించిన బహిరంగ సభలో అసద్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఫిర్యాదు రాకపోవటం ఏమిటన్న ప్రశ్న పలువురిలో వ్యక్తమవుతోంది.