బాబు, లోకేష్ లపై కేసు బుక్.. ఎందుకంటే?

August 10, 2020

ప్రజల్లో అవగాహన పెరిగిన తర్వాత చిన్న తప్పులకు.. పొరపాట్లకు పెద్ద మూల్యాన్నే చెల్లించాల్సి వస్తుంది. ఏపీలో ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది. ప్రజల్లో చైతన్యం పెరిగినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. నిబంధనల్ని తూచా తప్పకుండా ఫాలో కావాలి. తమకు తెలిసి కాని తెలియక కాని తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు భిన్నంగా చోటుచేసుకునే ప్రతి ఘటనకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు.. ఆయన కుమారు కమ్ మాజీ మంత్రి లోకేశ్ బాబులు తరచూ కొన్ని ముఖ్యమైన అంశాలు మరిచిపోతుంటారు. తాజాగా వారు చేసిన పనికి ఇప్పటికే పలు ఫిర్యాదులు వెల్లువెత్తగా.. అందుకు జతగా మరో ఫిర్యాదు నమోదు కావటమే కాదు.. కేసు బుక్ అయ్యింది.
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనల్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అనుసరించాల్సిన విధివిధానాల్ని పాటించకుండా ఉల్లంఘించిన వైనంపై ఒక న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేయాల్సి వచ్చింది. మే 25న చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్ లు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా వారు లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లుగా న్యాయవాది కమ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బర్రె శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా నందిగామ పోలీసులు చంద్రబాబు.. లోకేశ్ లపై కేసు నమోదు చేశారు. వీరిద్దరితో పాటు.. మరికొందరిపైనా కేసు నమోదుచేసినట్లుగా తెలుస్తోంది.