ప్రగతిభవన్ కుక్కనా... మజాకా?...

August 07, 2020

అరే.. తెలంగాణలో ఏం జరుగుతోంది? మరీ.. ఇంత దారుణమా? సామాన్యులకు వైద్యం చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం రోటీన్. ఇది అంతకంతకూ పెరిగి.. చివరకు ప్రగతిభవన్ వరకూ వెళ్లిపోయిందా? ఎవరైతేనేం.. ఏం చేస్తారేంటి? అన్న తీరు అంతకంతకూ పెరుగుతుందా? అన్న సందేహం కలిగేలా తాజా ఉదంతం చోటు చేసుకుందని చెప్పాలి.
ఇంతకీ ఏం జరిగిందంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవణ్ లోని పెంపుడు కుక్క ఒకటి అనారోగ్యంతో మరణించిన వైనం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతాన్ని చూస్తే.. 11 నెలల హస్కీ అనే కుక్క పిల్ల ప్రగతిభవన్ లో ఉండే కుక్కల్లో ఒకటి. సారు నివాసంలో దాదాపు తొమ్మిది వరకూ కుక్కలు ఉంటాయి.
వాటి ఆలనాపాలనా చూసుకునేందుకు బహదూర్ పురాకుచెందిన ఆసిఫ్ అలీఖాన్ అనే వ్యక్తి గడిచిన ఐదేళ్లుగా ప్రగతిభవన్ లో డాగ్ హ్యాండ్లర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 10న హస్కీ అనారోగ్యానికి గురైంది. వెంటనే ఆయన వైద్యులను సంప్రదించాడు. దానికి వైద్యసాయాన్ని అందించారు. కాస్త కొలుకున్నా మళ్లీ అనారోగ్యానికి గురై.. తిండి తినటం మానేసింది. 11న పాలుకూడా తాగకుండా అస్వస్థతకు గురైంది. దీంతో.. ఈ కుక్కల ఆరోగ్య సమస్యల్ని చూసుకునేందుకు ఉన్న రెగ్యులర్ వైద్యుడికి ఫోన్ చేయగా.. వచ్చి వైద్యసేవల్ని అందించారు.
కానీ.. కండిషన్ సీరియస్ కావటంతో బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 4లో ఉన్న యానిమల్ కేర్ క్లినిక్ కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యుడు ట్రీట్ మెంట్ ఇస్తుండగా హస్కీ చనిపోయింది. వైద్యుడు నిర్లక్ష్యంగా వైద్య సేవల్ని అందించటం కారణంగానే కుక్క చనిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆసిఫ్. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సామాన్యుల విషయంలో నిర్లక్ష్యం ఓకే. ప్రగతిభవన్ కుక్క అని తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఉండటమా? అంటూ అవాక్కు అవుతున్నారు. ఈ ఇష్యూలో పోలీసులు ఏం చేస్తారో చూడాలి?