మణిరత్నంతో సహా 50మంది సెలబ్రిటీలపై దేశద్రోహం కేసు

August 03, 2020

షాకింగ్ పరిణామంగా దీన్ని చెప్పాలి. దేశంలో మూకహత్యలు.. దాడులు జరుగుతున్నాయన్న ఆందోళనలు అప్పుడప్పుడు తెర మీదకు రావటం.. దీనిపై చర్చలు జరగటం తెలిసిందే. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంలో దేశంలోని 50 మంది ప్రముఖులు ప్రధాని మోడీకి రాసిన బహిరంగ లేఖ అప్పట్లో పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు దేశంలో నెలకొన్న పరిణామాలపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. అసహనం పెరుగుతుందని.. మాబ్ లించింగ్ మితిమీరుతున్నాయంటూ ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాసిన వారిలో దిగ్గజ దర్శకుడు మణిరత్నం.. అనురాగ్ కశ్యప్.. శ్యాంబెనగల్.. అపర్ణాసేన్.. కొంకణ్ సేన్ శర్మ.. సౌమిత్రా చటర్జీ.. రామచంద్ర గుహ.. శుభ ముద్గల్ తో పాటు పలువురు ప్రముఖులు ఈ లేఖపై సంతకం చేశారు.
ఈ లేఖపై అభ్యంతరం వ్యక్తం చేసిన సుధీర్ కుమార్ ఓజీ బిహార్ లోని ముజఫర్ నగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బహిరంగ లేఖ రాయటం ద్వారా దేశ ప్రతిష్టను మంటకలిపారని.. ప్రధాని అద్భుత పని తీరును నాశనం చేసేలా ఈ లేఖ ఉందని పేర్కొన్నారు. తాజాగా ఈ పిటిషన్ ను విచారించిన చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారి సంచలన ఆదేశాలు జారీ చేశారు.
దాని ప్రకారం.. ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాసిన యాభై మంది ప్రముఖులపై దేశద్రోహం కేసును నమోదు చేయాలని పేర్కొన్నారు. దీంతో.. వీరందరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రధానికి లేఖ రాసిన యాబై మంది ప్రముఖులు వామపక్ష భావజాలంతోనే ఈ పని చేశారని.. ప్రధానిని అప్రదిష్ట పాలు చేసేందుకు ప్రయత్నించారని పలు హిందుత్వ సంస్థలకు చెందిన వారు.. ఆ సంస్థకు అనుబంధంగా ఉండే 62 మంది సెలబ్రిటీలు వీరి తీరును తప్పు పట్టటం గమనార్హం.