పవన్ పరువు తీసేసిన ఏకైక ఎమ్మెల్యే

May 26, 2020

పవన్ స్టేజి ఎక్కితే విలువల గురించి మాట్లాడుతారు. కొత్త రాజకీయం చేస్తానని అంటారు. ఆయన జనానికి నచ్చలేదో, జనం ఆయన్ని నమ్మలేదో గాని ఆ పార్టీకి ఏకలింగం మిగిలాడు. పవన్ తో సహా అందరూ ఓడారు. అయినా పవన్ తొణక్కుండా... జనం నాతో ఉంటారని నేను రాలేదు, జనంతో నేను ఉండాలని వచ్చాను అంటూ పెద్ద మాటలే చెప్పారు. భలేటోడు... ఓడించినా బాధ్యతగా ఉన్నాడు అనుకుని కొందరయినా అనుకన్నారు. కానీ ఆయన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక పార్టీ పరువును బజారున పడేశాడు. పవన్ చెప్పిన విలువలేవీ జనసేనకు లేవని ఆయన స్వయంగా నిరూపించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే... జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాకా వంద మంది అనుచరులతో పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. ఏదైనా అక్రమ నిర్బంధం గురించి ఈ దాడి చేసి ఉంటే మెచ్చుకునేవాళ్లం. ఆయన దాడి, తాపత్రయం... పేకాట రాయుళ్ల కోసమట. పేకాటరాయుళ్లను అరెస్టు చేస్తే ఎమ్మెల్యే ఇలా ఊగిపోవడం ఏందో? ఇసుక లేక జనం రోడ్డున పడ్డారు. దాని గురించి ఎమ్మెల్యే రోడ్ల మీదకు రాలేదు. పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. దానికోసమూ ఆయన రాలేదు. పింఛన్లు ఆలస్యం అయ్యాయి. అయినా ఆయన ప్రశ్నించలేదు. కానీ నలుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేయగానే ఆయన తన అనుచరులను వేసుకుని పోలీసు స్టేషనుపై దాడి చేశారు. అసెంబ్లీలో ఈయన మాటలు విని సౌమ్యుడు అనుకున్నారు గాని... వాస్తవం వేరేలా ఉందని తాజాగా అర్థమైంది.
ఎస్పీ మాటల్లో చెప్పాలంటే... ఆయన పాత నిందితుడు అట. అంటే గతంలోనే ఆయన పై పోలీసుల కేసులు కూడా ఉన్నాయట.
తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని మలికిపురంలో ఆదివారం పేకాడుతున్న 9 మం దిని ఎస్‌ఐ కేవీ రామారావు అరెస్టు చేశారు. నిందితులను విడిచిపెట్టాలని ఎమ్మెల్యే రాపాకతో పాటు అతని అనుచరుడు గెడ్డం తులసి భాస్కర్‌ ఎస్‌ఐతో గొడవకు దిగారు. సుమారు 100 మందితో కలిసి పోలీస్‌స్టేషన్‌పైకి రాళ్ళు రువ్వి స్టేషన్‌ కిటికీ అద్దాలు పగులగొట్టారు. పేకాడుతున్న వారికి వత్తాసు పలకడమే కాకుండా పోలీస్‌స్టేషన్‌పై దౌర్జన్యానికి దిగి ప్రభుత్వ ఆస్తిని నష్టపరిచారనే అభియోగాలతో రాపాక వరప్రసాద్‌, అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఎస్పీ ధృవీకరించారు. మరీ పేకాట రాయుళ్ల కోసం జనసేన పోరాడటం ఏందో పవన్ చెప్పాలి. పాపం క్రమశిక్షణ చర్యలు తీసుకుందాం అంటే... ఉన్నదే ఒక ఎమ్మెల్యేే. ఆయన ఊడిపోతే... అసెంబ్లీలో పార్టీయే ఉండదు.