టీవీ చానల్ పై కేసు.. పనికిమాలిన షో మొదలుపెట్టారు, బుక్కయ్యారు

August 08, 2020

రోటీన్ కు భిన్నంగా చేయాలి. అందరూ తమ గురించి మాట్లాడుకోవాలి. హాట్ టాపిక్ గా మారాలి. టీఆర్పీ రేటింగ్ అదిరిపోవాలి. ఇలాంటి ఆలోచనలు అన్ని చానళ్లకు ఉండేవే. ఈ ప్రచార మత్తులో పడి.. మిగిలిన విషయాల్ని మరిస్తే తిప్పలు తప్పవన్న విషయం తాజాగా ఒక టీవీ చానల్ కు అర్థమయ్యే పరిస్థితి. ప్రచార పైత్యంతో వెనుకా ముందు ఆలోచించకుండా చేసిన వైనంపై పలువురు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా.

సోనీ లివ్ చానల్ కొత్తగా ఒక క్రైమ్ థ్రిల్లర్ షోను ప్రసారం చేయనుంది. తమ షో గురించి అందరూ మాట్లాడుకోవటమే కాదు.. ఉత్కంట పెంచేందుకు వీలుగా సరికొత్త ప్రచారానికి తెర తీశారు. ఇందులో భాగంగా ప్రేక్షకులకు ఒక నెంబరు నుంచి ఫోన్ చేస్తారు. ఏదో పనిలో ఉన్న ఆ ప్రేక్షకుడు ఫోన్ ఎత్తిన వెంటనే.. షోకు సంబంధించిన వారి ప్రతినిధి భయం..భయంగా తాను ఒక దారుణ హత్యను చూసినట్లు చెబుతారు.

ఊహించని రీతిలో ఎవరో కాల్ చేసి.. దారుణమైన హత్యను చూసానని చెప్పటం.. ఆ విషయాన్ని తనకు ఎందుకు చెబుతున్నారో అర్థం కాక టెన్షన్ పుట్టి.. ఇంతకీ తనకెందుకు చేసినట్లు? అసలు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరన్న ఆరా తీసే లోపు ఫోన్ కాల్ కట్ అవుతుంది. ఇలా మొదలైన ఈ ప్రచార పర్వం తాజాగా క్రియేటివ్ నిర్మాత స్మృతి కిరణ్‌కు వచ్చింది.

తనకు ఎదురైన చిత్రమైన విషయాన్నిట్విట్టర్ ద్వారా వెల్లడించారు.అయితే.. తనకుకూడా అలాంటి ఫోన్ కాల్ వచ్చిందని మరొకరు పేర్కొనటం.. చివరకు ఇదంతా కొత్త షో కోసం రూపొందించిన ప్రచార వ్యూహమన్న విషయం తెలిసినంతనే సదరు నిర్మాతకు ఒళ్లు మండింది. ఇదెక్కడి దరిద్రపుగొట్టు ప్రచారం అంటూ ఫైర్ అయ్యారు. ఏదో అనుకుంటే మరేదో అయ్యిందన్న విషయాన్ని గుర్తించిన సోనీ లివ్ చానల్ సారీ చెప్పింది.

ఎవరినో ఇబ్బంది పెట్టాలన్నది తమ ఉద్దేశం కాదని.. అనుకోని విధంగా ఇలా జరిగిందని వారు వివరణ ఇస్తున్నారు. ప్రేక్షకులకు టెన్షన్ పుట్టించాలనుకోవటం ఓకే. కానీ.. కాసేపటికైనా ఫోన్ చేసి.. అది తాము చేస్తున్న షో ప్రచారంగా చెప్పినా సరిపోయేది. అలాంటిదేమీ లేకుండా వ్యవహరించిన వైనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆ ఛానల్ మీద పోలీసులకు కంప్లైంట్ కూడా వెళ్లింది. మరి.. ఈ వ్యవహారంలో పోలీసులు ఏం చేస్తారో చూడాలి.