నిమ్మగడ్డ సుప్రీంకు వెళ్లక ముందే జగన్ కి షాక్

August 02, 2020

ఏపీ ముఖ్యమంత్రి వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గా మారిన వ్యవహారానికి శుక్రవారం హైకోర్టు చెక్ పెట్టిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని... నిమ్మగడ్డను తొలగించడం కుదరదని, తిరిగి ఆయననే ఎన్నికల కమిషనర్ గా నియమించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని... వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రకటించారు. అయితే వారు సుప్రీంకోర్టుకు వెళ్లే లోపు వైసీపీకి పెద్ద షాక్ తగిలింది.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంపై సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలైంది. హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు - హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్టే పొందకుండా ముందస్తు చర్యగా సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లినా స్టే తెచ్చుకోలేరు. ఈ సడెన్ సర్ ప్రైజ్ తో వైసీపీ నేతలకు దిమ్మతిరిగినట్టయ్యింది.

వాస్తవానికి నిమ్మగడ్డ విషయంలో తెలుగుదేశం పార్టీ సైలెంటుగా ఉంది. కరోనా వల్ల నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు వాయిదా వేస్తే దానికి స్వయంగా ముఖ్యమంత్రి కులం రంగు పులిమారు. ఆ తర్వాత రాజకీయ రంగు పులిమారు. దీంతో పాటు ఐఏఎస్ అయిన నిమ్మగడ్డనే కొందరు వైసీపీ నేతలు బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో అతను కేంద్రానికి భద్రత కోసం లేఖరాయగా కేంద్రం నిమ్మగడ్డకు భద్రత పెంచింది. తర్వాత ఏపీ సర్కారు వ్యూహాత్మక అడుగులు వేసి ఆయన పోస్టును పీకేసింది.

ఎలాగైనా నిమ్మగడ్డను తప్పించడానికి ప్రభుత్వం విపరీతంగా ప్రయత్నించడంతో బీజేపీ కలగజేసుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అనుమతి మేరకు ఏపీ బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్ హైకోర్టులో పిటిషను వేశారు. ఆయనతో పాటు కొందరు లాయర్లు, ప్రజాస్వామ్య వాదులు కోర్టులో పిటిషను వేశారు. వీటన్నింటిని విచారించిన అనంతరం ఏపీ ప్రభుత్వం రాజ్యాంగం అతిక్రమించిందని ఆర్డినెన్సును కొట్టేసింది. దీంతో కనగరాజ్ నియమాకం చెల్లదని తేలిపోయింది. ఆటోమేటిగ్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ఎస్ఈసీ అయ్యారు.

దీనిని జీర్ణించుకోలేని వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పింది. ఇది గెలవడం కోసం కాదు, కేవలం స్టే తెచ్చుకునే ప్రయత్నం. వారు వెళ్లేలోపు అక్కడ కేవియట్ దాఖలవడం అనూహ్య పరిణామాం.  అంటే ఇక నిమ్మగడ్డే ఎస్ ఈసీ... సుప్రీం తీర్పు ఆయనకు వ్యతిరేకంగా వస్తే తప్ప. విచారణ సమయంలో కూడా నిమ్మగడ్డ రమేష్ కుమారే ఎస్ ఈసీ అన్నమాట.