జగన్ కి బ్రేక్ పడింది

February 23, 2020

సరిగ్గా శుక్రవారం ఏదో ఒక కార్యక్రమం ఏర్పాటుచేసుకుని సీబీఐ కోర్టుకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్న వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి సీబీఐ ప్రత్యేక కోర్టు హెచ్చరిక పంపింది. వచ్చే శుక్రవారం మిన్ను విరిగి మీద పడినా.. ఏ1, ఏ2 ఇద్దరు కోర్టుకు హాజరు కావల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరు ఏ1, ఏ2 అనే విషయం అందరికీ తెలిసిందే. గత కొన్ని వారాలుగా వీరు విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు సీరియస్ అయ్యింది.

ఇదిలా ఉండగా, తాను ముఖ్యమంత్రిని అని, పరిపాలనలో బిజీగా ఉంటానని, కోర్టుకు రావాలంటే... 60 లక్షల ప్రజాధనం ఖర్చవుతుందని... కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు జగన్. అయితే. జగన్ చెప్పిన కారణాలు మినహాయింపునకు పనికిరావని కోర్టు చెప్పింది. తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావల్సిందే అని పేర్కొంది. అయినా  జగన్ రకరకాల తాత్కాలిక కారణాలను కోర్టుకు చెప్పి హాజరు మినహాయింపు పొందుతున్నారు. ఎప్పటికపుడు కారణాలు కోర్టుకు తెలుపుతున్నారు. దీంతో విసిగిపోయిన కోర్టు ఈరోజు అసహనం వ్యక్తంచేసింది. సీబీఐ న్యాయవాదులు వరుసగా మినహాయింపులు కుదరవు అని తేల్చి చెప్పింది. ఇది విచారణపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. దీంతో వచ్చే శుక్రవారం కోర్టుకు రావల్సిందే అని జగన్ తరఫు న్యాయవాదులకు కోర్టు ఆదేశించింది. అంటే వచ్చే శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి సీబీఐ కోర్టు బోనులో నిలబడకతప్పదు.