రాజధాని భూముల కేసులు సీబీఐకి అప్పగింత!

August 13, 2020
ఇన్‌సైడర్‌ ఆరోపణల రుజువులో
జగన్‌ ప్రభుత్వం విఫలం
ఎటూ తేల్చని ఉపసంఘం
సీఐడీ రంగంలోకి దిగినా..
సిట్‌ వేసినా ఫలితం శూన్యం
పరువు కాపాడుకోవడానికే
కేంద్ర దర్యాప్తు సంస్థకు కేసులు
రాజధానిగా అమరావతిని నిర్ణయించకముందే నాటి పాలకపక్ష నేతలు అక్రమంగా భూములు కొనుగోలు చేశారని.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచీ ఆరోపణలు చేస్తూ వచ్చారు. సీఎం అయ్యాక కూడా వాటిని కొనసాగించారు. వాటి నిగ్గు తేల్చడానికి నిపుణుల కమిటీని వేశారు. అది ఏమీ తేల్చలేకపోయింది. తర్వాత మంత్రివర్గ ఉపసంఘం ఫైళ్లు పరిశీలించింది. 4 వేల ఎకరాల్లో అవకతవకలు జరిగాయని నివేదిక సమర్పించింది. తెల్లకార్డులు ఉన్నవారు భూములు ఎలా కొన్నారంటూ సీఐడీ కేసులు నమోదు చేసింది. ఆదాయ పన్ను శాఖకు కూడా లేఖలు రాసింది. తర్వాత పది మంది పోలీసు అధికారులతో జగన్‌ ఓ సిట్‌ను వేశారు. అది కూడా కొండను తవ్వి ఎలుకను పట్టింది. ఒకరిద్దరు టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపి.. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు వారు బినామీలంటూ లీకులిచ్చి రెండ్రోజులు హడావుడి చేసింది. అయినా ఒక్క రుజువు కూడా దొరక్కపోవడం.. తన ఆరోపణలను ప్రజలు నమ్మకపోవడంతో పరువు కాపాడుకోవడానికి జగన్‌ కొత్త ఎత్తువేశారు. అమరావతి భూవ్యవహారాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో దర్యాప్తునకు నిర్ణయం తీసుకున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలో పెద్దసంఖ్యలో అక్రమాలు, అవకతవకలు, నిబంధనోల్లంఘనలు చోటు చేసుకున్నాయని రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. టీడీపీ ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహించిన పలువురు ప్రముఖుల నేతృత్వంలో అక్రమాలు  జరిగినట్లుగా తాను గుర్తించినట్లు కేబినెట్‌ సబ్‌ కమిటీ కొన్ని నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అసైన్డ్‌ భూములను సాగు చేసుకుంటున్న పలువురు నిరుపేద దళిత రైతులను నయానో భయానో లొంగదీసుకుని, ఆయా భూములను గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలతోపాటు వారి అండదండలతో మరి కొందరు తమ సొంతం చేసుకున్నారని ఆరోపించింది. నిబంధనల ప్రకారం అసైన్డ్‌ భూముల క్రయ విక్రయాలు నిషిద్ధమైనప్పటికీ టీడీపీ నేతలు పెద్దఎత్తున వాటిని దళితుల నుంచి పొందడం ద్వారా వారికి తీవ్ర నష్టం కలిగించి తాము భారీగా లబ్ధి పొందారని పేర్కొంది. ఈ విధంగా రాజధానిలోని పలు గ్రామాల్లో వివిధ రకాలకు చెందిన వందలాది ఎకరాల అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతమయ్యాయని తెలిపింది. అంతకుముందే ప్రభుత్వం సీఐడీని రంగంలోకి దించి టీడీపీ నేతలను, రైతులను భయపెట్టాలని చూసింది. భూసమీరణలో మొత్తం 108 లావాదేవీలకు సంబంధించి అక్రమాలు జరిగాయని.. దళితుల నుంచి కేవలం ఐదు లక్షలతో ఎకరం కొనుగోలు చేసి ఆ తర్వాత ఫ్లాట్లు ద్వారా కోట్లు సంపాదించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సీఐడీ.. ఐటీ శాఖకు లేఖ రాసింది. రూ.రెండు లక్షలకు పైగా ఉన్న ఆర్థిక లావాదేవీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదుచేసింది. 2015 ఆగస్టు నుంచి 2019 ఫిబ్రవరి వరకూ జరిగిన లావాదేవీల జాబితా మొత్తం సీఐడీ లేఖతో జతచేసింది డాక్యుమెంట్‌ డేట్‌, నంబరు, రిజిసే్త్రషన్‌, విక్రయదారు, కొనుగోలుదారు, భూమి విస్తీర్ణం, గ్రామం, సర్వే నంబర్‌, మండలం తదితర వివరాలు కూడా పేర్కొంది. అయితే మొత్తం లావాదేవీలు మంగళగిరి మండలానికి చెందినవే ఉండటం గమనార్హం. కొనుగోలు దారులు ఎక్కువగా హైదరాబాద్‌కు చెందిన వారుండగా గుంటూరు, ఉభయ గోదావరి, ఖమ్మం, ప్రకాశం జిల్లాలకు చెందిన వారుకూడా ఉన్నారు. కానీ వీరిలో కొందరు హైకోర్టును ఆశ్రయించడం.. కొందరికి కోర్టు నిర్ణయం అనుకూలంగా రావడంతో.. అమరావతి నిర్వీర్యానికే తాము తప్పుడు ఆరోపణలు చేశామన్న విషయం బహిర్గతమవుతుందన్న భయంతో.. ఇప్పుడీ కేసులన్నిటినీ సీబీఐకి ఇవ్వాలని నిర్ణయించింది. వీటిని సీబీఐ విచారణకు తీసుకుంటుందో లేదో చూడాలి.
 
 
 
 
 
 
 
 
 
 

 

RELATED ARTICLES

  • No related artciles found