సంచలనం - బొత్సకు సీబీఐ సమన్లు

August 10, 2020

ప్రస్తుతం ఏపీలో వాతావరణం నేపథ్యంలో... ఇది సంచలన వార్తే. వైసీపీ నేత, ఏపీ మంత్రి బొత్స సత్యానారాయణకు సీబీఐ నుంచి సమన్లు జారీ అయ్యాయి. చంద్రబాబు హయాంలో కూడా రాని సీబీఐ సమన్లు ఇపుడు వచ్చాయి అంటే... ఇది కచ్చితంగా ఆలోచించదగ్గ విషయమే. ఎక్కడికక్కడ టెంపరరీ ఫ్రెండ్ షిప్ చేసి తొక్కేసే అలవాటున్న బీజేపీ వైసీపీ విషయంలోనూ అదే పద్ధతి ఫాలో అవుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్, టీడీపీలతో ఫ్రెండ్షిప్ చేసి వారికి శత్రువైన బీజేపీ ... ఇపుడు వైసీపీతో కూడా పెద్ద అవసరాలు ఏం లేవు అన్న రీతిలో వ్యవహరిస్తోంది.
కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ నేతలు తీవ్ర స్వరంతో విరుచుకుపడుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఇతర బీజేపీ నేతలు పెద్ద ఎత్తున జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నా, తిట్టినా వైసీపీ నేతలు కిమ్మనడం లేదు. వైసీపీ ఎంత వినయం చూపినా .. వైసీపీపై బీజేపీ వార్ ను మరింత పెంచింది. బొత్సకు సమన్లు జారీచేయడంతో అదిపుడు స్పష్టమైపోయింది.
వైఎస్ హయాంలో ఫోక్స్ వ్యాగన్ కేసును కేంద్రం బయటకు తీసింది. ఈ కేసులో సాక్షిగా ఉన్న ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ సీబీఐ కోర్టు నుంచీ సమన్లు జారీ అయ్యాయి. వచ్చే సెప్టెంబర్ 12 వ తేదీన ఆయన హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఇపుడు కోర్టులో ఆయన ఏం చెబుతారో అన్నది చాలా ఆసక్తికరమైన విషయం.
2005లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్సపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఫోక్స్ వ్యాగన్ కంపెనీని హైదరాబాద్ నుంచీ వైజాగ్‌కి తరలించాలనే అంశంపై బొత్స, మరికొందరికి పెద్ద ఎత్తున ముడుపులు అందాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో డబ్బులు పోయాయి. కంపెనీ కూడా పోయింది. దీనిపై మీడియా అడిగితే అత్యంత నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు బొత్స. సొమ్ములుపోనాయి ఏటిసేత్తాం అనేశారు. ఇది అపుడు వైరల్ అయ్యింది. ఇంతకాలం ఆ కేసును కదిలించని సీబీఐ ఇపుడు సమన్లు ఇచ్చింది.
ఇక ఈ కేసు గురించి చెప్పాలంటే... సీబీఐకు ఈ కేసును అప్పట్లో అప్పగించారు. విచారణ సమయంలో ఏడుగురు నిందితులు, 59మంది సాక్షులను సీబీఐ గుర్తించింది. 3 వేల పేజీల ఛార్జిషీట్‌ను సీబీఐ దాఖలు చేసింది. దాదాపు రూ.7 కోట్లు రికవర్ కాగా... ఇంకా రూ.5.65 కోట్లు రికవరీ అవలేదు.