బాబు ఇసుక దీక్ష... ఏపీలో నిరసన జోరు

July 15, 2020

ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్ర స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ ఇసుక కొరత వల్ల రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైపోయింది. దీని మీద ఆధారపడి జీవిస్తున్న లక్షలమంది భవననిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. గత ఐదు నెలలుగా పనులు లేక నానా అవస్థలు పడుతున్నారు. ఆఖరికి వారికి తినడానికి కూడా తిండి దొరకక నరకయాతన అనుభవిస్తున్నారు. పైగా టీడీపీ తీసుకొచ్చిన అన్నా క్యాంటీన్లు మూసివేయడం కూడా కార్మికులకు ఇబ్బందులు పెంచేలా చేసింది. మొత్తం మీద కుటుంబాన్ని పోషించలేక చాలామంది కార్మికులు ఆత్మహత్యకు పాల్పడి తనువులు చాలించారు.

దీంతో కార్మికుల చావులతో చలించిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు భవననిర్మాణ కార్మికులకు కోసం గురువారం 12 గంటల నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇప్పటికే ఇసుక కొరతపై టీడీపీ పలుసార్లు ఆందోళనలు, ధర్నాలు చేసింది. ఈ క్రమంలోనే మరోసారి కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ చంద్రబాబు దీక్షకు దిగారు. విజయవాడ అలంకార్‌ సెంటర్‌కు సమీపంలోని ధర్నా చౌక్‌లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఆయన నిరాహార దీక్ష చేయనున్నారు. ప్రధానంగా ప్రభుత్వం ఉచితంగా ఇసుకను ఇవ్వాలన్న డిమాండ్‌తో బాబు ఈ దీక్షకు పూనుకున్నారు.

అలాగే ఈ జగన్ ప్రభుత్వంలో ఐదు నెలలపాటు పనులు కోల్పోయిన కార్మికులకు నెలకు రూ.10 వేలు పరిహారంగా ఇవ్వాలని, ఆత్మహత్య చేసుకొన్న కార్మికుల కుటుంబాలకు తలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ దీక్షను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. ఈ దీక్షకు మద్ధతు ఇవ్వాలని టీడీపీ ఇప్పటికే బీజేపీ, జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్ లతో పాటు ఇతర పార్టీలని కోరింది. అయితే అన్నీ పార్టీల దాదాపు మద్ధతివ్వగా, కొన్ని పార్టీలు దీక్షకు వచ్చే అవకాశముంది.

అటు దీక్షకు భవన నిర్మాణ కార్మికులను, జీవన భృతి కోల్పోయిన 125 వృత్తులకు సంబంధించిన సంఘాల ప్రతినిధుదులు రానున్నారు. అటు ఆత్మహత్య చేసుకొన్న కార్మికుల కుటుంబ సభ్యులు కూడా దీక్షలో పాల్గొనున్నారు. వీటికన్నిటికంటే ఈ దీక్ష తర్వాత టీడీపీకి మంచి మైలేజ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీక్ష ద్వారా రాష్ట్రం దృష్టిని ఆకర్షించి వైసీపీ పాలన కంటే గతంలో తమ పాలనే బెటర్ గా ఉందనే భావన ప్రజల్లో కలిగించనుంది. ఇక ఈ దీక్ష‌తో అయినా ప్ర‌భుత్వం ఇసుక విష‌యంలో మొద్దు నిద్ర వీడుతుందేమో ?  చూడాలి. అలాగే త్వరలో రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు రాబట్టేందుకు దీక్ష ఉపయోగపడొచ్చు. మొత్తానికి దీక్ష వల్ల అటు సమస్యని హైలైట్ చేసినట్లు అవుతుంది. ఇటు పార్టీకి మైలేజ్ పెరగనుంది.