ఇది ట్రైలరే: అమెరికన్లను భయపెట్టిన పెద్దమనిషి

August 14, 2020

అసలే అమెరికన్లు వణికిపోతున్నారు. ఇపుడున్న ఉధృతికే భయబ్రాంతులకు గురవుతున్నారు. అలాంటిది ఇదేముంది.. ఇంకా ముందుంది ముసళ్ల పండగ అంటూ భయపెట్టారు అమెరికన్ వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం డైరెక్టర్ రెడ్ ఫీల్డ్. రెండునెలల్లో 45 వేల మంది చనిపోయారు. 8 లక్షల మందికి సోకింది. దీనికి మించి భయంకరం అంటే ఎన్ని లక్షల ప్రాణాలు పోతాయో అని అమెరికన్లు రెడ్ ఫీల్డ్ మాటతో వణికిపోతున్నారు. 

అమెరికాలో వింటర్ అంటే... డిసెంబరు 20 నుంచి మొదలవుతుంది. అంటే ఇంకా చాలా టైం ఉంది. రెడ్ ఫీల్డ్ మాటలను బట్టి చూస్తుంటే అప్పటివరకు కూడా అమెరికాలో జీరో పేషెంట్ ను చూడలేమా? వాస్తవానికి ఇంకో నెలలో అంతా కంట్రోల్లోకి వస్తుందని అమెరికన్లు ఫీలవుతున్నారు. అలాంటి నేపథ్యంలో రెడ్ ఫీల్డ్ మాటలు అమెరికన్లకు ఒక్క నిమిసం ఊపిరి ఆగిపోయేలా చేశాయి.

వుహాన్ లో వైరస్ పుట్టకముందే ఇలాంటిది ఒకటి వస్తుందని జ్యోతిష అంచనాల ద్వారా చెప్పిన ప్రఖ్యాత బాల జ్యోతిషుడు వచ్చే మార్చి వరకు ఈ భయానక పరిస్థితి తప్పదు అని చెప్పారు. అమెరికాలో వింటర్ మార్చిలో ముగుస్తుంది. మన వద్ద కూడా నవంబరులో మొదలై జనవరిలో ఎండవుతుంది. వింటర్ వస్తే ఇది తిరగబెట్టే ప్రమాదం ఉంది. అంతలోపు... ఇంకా వీలైతే వర్షాకాలం లోపు జీరో పేషెంట్ చేసుకున్న వారు దీన్నుంచి గట్టెక్కుతారు. లేదంటే వ్యాక్సిన్ రావాల్సిందే. అంతవరకు ఎవరి చేతుల్లో ఏమీ ఉండదు. 

పరిస్థితులు సుధీర్ఘ కాలం ఉంటాయని తెలిసినపుడు లాక్ డౌన్ వల్ల ఉపయోగం లేదు. ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించి ఆంక్షలతో కూడిన సడలింపు ఇస్తే ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. లేకపోతే కరోనా కంటే ఆర్థిక సమస్యలు ఎక్కువ ఘోరాలు సృష్టిస్తాయి. కరోనా చావు కంటే ఆకలి చావు అత్యంత విషాదకరమైనది.