జగన్ పుండు మీద కారం చల్లిన కేంద్రం

May 26, 2020

‘పోలవరం ప్రాజెక్టు టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి వ‌రుస షాకులు త‌గులుతున్నాయి. పోలవరం ప్రాజెక్టులో నామినేషన్‌ ప్రాతిపదికపై నవయుగ, బెకం సంస్థలకు అప్పజెప్పిన టెండర్లను రద్దు చేసేందుకు రాష్ట్ర జలవనరులశాఖ ఆ రెండు సంస్థలకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. నామినేషన్‌ ప్రాతిపదికపై పనులు అప్పగించడం సరైనది కాదన్న కారణంతోనే వారిని ప్రస్తుతం పనుల నుంచి తొలగిస్తున్నట్లు పోలవరం ప్రాజెక్టు అధికారులు వివరించారు. పోలవరం ప్రాజెక్టులో రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇప్ప‌టికే తప్పుపట్టిన సంగ‌తి తెలిసిందే. సరైన కారణాలు చూపకుండా టెండర్లను రద్దు చేయడం సరికాదని అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.

తాజాగా, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పోలవరం నిర్మాణం బాధ్యత ఉన్నంత మాత్రాన రాష్ట్రం ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని కేంద్ర‌మంత్రి స్ప‌ష్టం చేశారు. `` పోల‌వ‌రం ప్రాజెక్టుకు డబ్బులు చెల్లించేది కేంద్రమే కాబట్టి అన్నీ చెప్పే చేయాలి. రాష్ట్రం ఇష్టం వచ్చినట్టు చేస్తే కేంద్రం ఊరుకోదు. పోలవరంపై తీసుకునే ప్రతి నిర్ణయమూ కేంద్రానికి చెప్పాల్సిందే. ’ అని షెకావత్ హెచ్చరికతో కూడుకు న్న స్ప‌ష్ట‌త ఇచ్చారు.ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ న‌మ్మిన‌బంటు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌కు సైతం ఆయ‌న కౌంట‌ర్ ఇచ్చారు. తాము చేసే అన్ని ప‌నుల‌కు ప్ర‌ధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ఆశీస్సులు, సూచనలు ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలకు గజేంద్ర సింగ్ షెకావత్ స్పందిస్తూ, సమాఖ్య వ్యవస్థలో ఎవరికీ ఎవరి ఆశీర్వాదాలు ఉండవని స్ప‌ష్టం చేశారు.

మ‌రోవైపు పోలవరం నిర్మాణంలో వాస్తవ నివేదిక పంపాలని ప్రాజెక్టు అథారిటీని ఆదేశించినట్లు షెకావత్‌ చెప్పారు. రెండురోజుల్లో ఆ నివేదిక వస్తుందన్నారు. నివేదిక వచ్చాక ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఓవైపు కోర్టుల్లో ఎదురుదెబ్బ‌లు, మ‌రోవైపు కేంద్రం నుంచి తీవ్ర అభ్యంత‌రాల‌ నేప‌థ్యంలో కేంద్రం నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.