వెనక్కు తగ్గు జగన్ - కేంద్రం డైరెక్ట్ వార్నింగ్

May 25, 2020

 

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహనరెడ్డికి కేంద్ర ఇంధన వనరుల శాఖ సహాయ మంత్రి ఆర్కేసింగ్ తాజాగా లేఖ రాశారు. పీపీఏలను సమీక్షించొద్దంటూ గత నెల 6వ తేదీన కేంద్ర నూతన, పుననుత్పాదక ఇంధనవనరుల శాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్ ఏపీ సీఎస్‌కు లేఖ రాశారు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం పీపీఏ సంస్థలను టారిఫ్‌ తగ్గించాలని కోరడంతో తాజా కేంద్ర మంత్రి నుంచి సీఎంకు లేఖ వచ్చింది. పునరుత్పాదక విద్యుత్ రంగంలో విదేశీ పెట్టుబడులు పెరిగాయని, కాంట్రాక్టులకు భరోసా లేదన్న భావన ఏర్పడితే పెట్టుబడులు రావడం కష్టమని కేంద్రమంత్రి తన లేఖలో తాజాగా ప్రస్తావించారు. జగన్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే కేంద్రం ఈ విషయంలో మరింత సీరియస్‌గా ముందుకెళ్లే సూచనలున్నాయి.
అంతేకాదు.. టారిఫ్‌లను కేంద్ర, రాష్ట్ర విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్లు నిర్దారిస్తాయని.. పీపీఏలను రద్దు చేయడం చట్ట విరుద్ధమవుతుందని కేంద్ర మంత్రి తన లేఖలో స్పష్టంగా చెప్పారు. అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉంటే రద్దు చేసి విచారణ జరపొచ్చని.. అంతేకానీ, ఆధారాలేమీ లేకుండా ఇష్టమొచ్చినట్లు రద్దు చేయడం కుదరదని జగన్‌కు రాసిన లేఖలో కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. లేఖతో పాటు ఇతర రాష్ట్రాలు కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లోని టారిఫ్‌లను పంపించిన కేంద్రంమంత్రి వాటిని పరిశీలించి ఆంధ్రప్రదేశ్‌లోని గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు సహేతుకమో కాదో నిర్ణయించుకోవాలని సూచించారు. సోలార్‌, విండ్ ఎనర్జీ టారిఫ్‌లను స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయిస్తారని కూడా మంత్రి ఆ లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు పీపీఏలను పునఃసమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. సీఎం జగన్‌ దీని కోసం ఓ కమిటీ కూడా నియమించారు. తాజాగా కేంద్ర సహాయ మంత్రే స్వయంగా లేఖ రాయడంతో జగన్ వెనక్క తగ్గని పరిస్థితి కనిపిస్తోంది. కేంద్రమంత్రే జోక్యం చేసుకుని లేఖ రాసినా జగన్ పీపీఏల విషయంలో ఇంకా తన వైఖరితోనే ముందుకుసాగితే కేంద్రంతో జగడం తప్పకపోవచ్చన్న భావన వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తోంది.
రాష్ట్రంలో సుమారు 4000 మెగావాట్ల పవన విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. సౌర విద్యుత్తు మరో 3000 మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. ఈ రెండు రంగాల్లో కలిపి 270 సంస్థలతో ప్రభుత్వం పీపీఏలు కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం పీపీఏలను సమీక్షించడానికి తొందరపడుతుండడం కేంద్రాన్ని సైతం చికాకు పెడుతోంది.
అయితే.. పీపీఏల సమీక్ష కోసం జగన్ ఉన్నత స్థాయి కమిటీ వేయడానికి ముందే ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ ఉత్పత్తిదారులతో భేటీ అయ్యారు. ఏపీలో పవన్ విద్యుత్ యూనిట్లు నెలకొల్పుతున్న పారిశ్రామికవేత్తలు కొందరు దీనికి హాజరై చర్చలు జరిపారు కూడా. పవన విద్యుత్‌ను ఒక యూనిట్‌ రూ. 4.84కు కొనేందుకు గత ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ అనుమతి ఇచ్చింది. అయితే ట్రాన్స్‌కో అధికారులు గుజరాత్ ధరను వారికి చెప్పి అలా ఒప్పందాలు మార్చుకోవాలని సూచించారు. గుజరాత్‌లో పవన్‌ విద్యుత్‌ ధర రూ.2.50 ఉందని.. అదే ధరకు తమకు కూడా కావాలని కోరారు.
అయితే.. ఇంధన వనరుల శాఖ మార్గదర్శకాలను పరిశీలిస్తే గుజరాత్‌తో పోల్చుకుని అవే ధరలు కోరడం తప్పని విద్యుత్ ఉత్పత్తిదారులు వాదించినట్లుగా తెలుస్తోంది. పవన విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి కేంద్రం దేశాన్ని కొన్ని జోన్లుగా విభజించింది. గాలి వేగం, దిశ దీనికి ప్రాతిపదిక. ఏపీతో పోలిస్తే గుజరాత్‌లో గాలివేగం బాగా ఎక్కువ. అందువల్ల ఎక్కువ ఉత్పత్తి జరిగి, ఖర్చు తగ్గుతుంది. ఏపీలో గాలివేగం, ఉత్పత్తి ఆ స్థాయిలో ఉండదు. అందుకే గుజరాత్‌తో ఏపీని పోల్చొద్దని ఉత్పత్తిదారులు వాదించారు. అయితే.. బొగ్గు చౌకగా దొరుకుతోందని.. థర్మల్ దారి పడితే ఏడాదికి 25 వేలు కోట్లు మిగులుతాయని ట్రాన్స్‌కో అధికారులు వారితో అన్నట్లు సమాచారం.
నిజానికి థర్మల్ విద్యుత్ వల్ల కాలుష్యం పెరగడం.. వాతావరణ మార్పులతో దీనికి లింక్ ఉండడంతో భూతాప నివారణలో భాగంగా చేసుకునే అనేక రకాల వాతావరణ ఒప్పందాలను అనుసరించి కేంద్రం థర్మల్ విద్యుత్‌‌కు బదులు సౌర, పవన విద్యుత్‌ను ప్రోత్సహిస్తోంది. కానీ..ప్రస్తుత ఏపీ ప్రభుత్వం మాత్రం థర్మల్ వైపు అడుగులు వేయడానికి సిద్ధమవుతోంది. అంతేకాదు.. పీపీఏల ఆధారంగానే విద్యుదుత్పత్తి సంస్థలు బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకుంటాయి.. ఇప్పుడీ ఒప్పందాలు మారితే రుణాలు చెల్లించడంలో అవి వెనుకబడే ప్రమాదముంటుంది.. ఇవన్నీ జాతీయ, అంతర్జాతీయ ఇండస్ట్రియల్ సెక్టార్‌లో ఏపీపై చెడు ముద్ర వేస్తాయి. ఇవన్నీ పెట్టుబడుల రాకను నిరోధిస్తాయి.
కేంద్రం ఈ విషయంలో ఇంతగా స్పందించడానికి కారణం ఉంది. క్లీన్ ఎనర్జీలను ప్రోత్సహించేందుకు కేంద్రం చొరవ చూపుతోంది. అందుకే.. సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నుంచి విద్యుత్‌ను తప్పనిసరిగా తీసుకోవాలని, ఆపవద్దని కేంద్ర ప్రభుత్వం కొంతకాలం క్రితం దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర ఉత్తర్వులను రాష్ట్రాలు ధిక్కరించే పరిస్ధితి లేదు.