జ‌గ‌న్ మాట‌నే ఓకే చేసిన కేంద్రం

June 06, 2020
CTYPE html>
ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు డబుల్ షాక్ త‌గిలింది. ఏరోసాట్, యూఏవీల కొనుగోలు కోసం వెచ్చించిన రూ.25.5 కోట్ల వ్యవహారంలో.. భారీ అక్రమాలు జరిగినట్లు పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం వెంకటేశ్వరావుపై సస్పెన్షన్ విధించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ఆయ‌న‌కు కేంద్ర హోంశాఖ షాక్ ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావు తప్పిదాలకు పాల్పడినట్టుగా ప్రాథమిక ఆధారాలు లభ్యమైనట్టు పేర్కొంటూ విచార‌ణ కొన‌సాగించాల‌ని స్ప‌ష్టం చేసింది.
గత ఏడాది మే 30న ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పదవి నుంచి ఏబీ వెంకటేశ్వరరావును జగన్‌ సర్కార్‌ తప్పించింది. అప్పటి నుంచి ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వలేదు. అనంత‌రం ఆయ‌న‌పై సస్పెన్ష‌న్ వేటు వేసింది. దీంతో, తన సస్పెన్షన్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని  కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ను వెంకటేశ్వరరావు ఆశ్ర‌యించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసిన ఏబీ.. ఒకవైపు కేంద్ర ట్రైబ్యునల్‌ను ఆశ్రయిస్తూ.. మరోవైపు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. అయితే, రెండు చోట్లా నిరాశే ఎదురైంది.
రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాదనను హోంశాఖకు నివేదించింది. దీంతో తాజాగా హోం మంత్రిత్వ శాఖ సైతం ఆయ‌న‌కు షాకిచ్చింది. అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలతో ఛార్జిషీట్‌ దాఖలు చేయమని ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి లేఖ రాసింది. ఏప్రిల్ 7వ తేదీలోగా ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఏపీ చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖలో కేంద్ర హోంశాఖ పేర్కొన‌డం ఈ సీనియ‌ర్ ఐపీఎస్‌కు షాక్ అని అంటున్నారు.