సంచలనం... ఈసీకి భద్రత పెంచిన కేంద్రం

June 02, 2020

నిన్నటి నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ కుటుంబ పాలకుల చేతుల్లో తన భవిష్యత్తుకు, జీవితానికి భద్రత లేదు అంటూ రాసిన లేఖ ఎంతో వైరల్ అవుతోంది. ఆ లేఖ లెటర్ హెడ్ తో ఉంది. అది అబద్ధమని ఆయన ఆఫీసు సిబ్బంది చేత వివరణ ఇప్పించింది జగన్ సర్కారు. కానీ నిమ్మగడ్డ మాత్రం ఎవరికీ అందుబాటులోకి రాలేదు. పోనీ ఆయన ఖండించనూలేదు. ఈ నేపథ్యంలో ఆ లేఖ నిజమో అబద్ధమో ఎవరికి తెలియదు. ఈ నేపథ్యంలో... ఆ లేఖ జగన్ సర్కారును వణికించింది. తానే సుప్రీం అని ఫీలయ్యే జగన్ ఆ లేఖతో తన పరువు పోతుందని గమనించి భయపడ్డారు. 

పాపం ఆయనకు సాయం చేయడానికి అన్నట్టు ఏ ఆధారం లేకుండానే... ఎవరూ చెప్పకుండానే ఆ లేఖ అబద్ధం అంటూ కొన్ని మీడియా ఛానెళ్లు ప్రసారం చేశాయి. జగన్ మీడియా కూడా తాపత్రయ పడింది. కట్ చేస్తే... సీన్ రివర్స్. 1+1 భద్రత నుంచి ఈ ఉదయం ఆయన భద్రత 4+4 పెరిగింది. ఎస్ఈసీ కార్యాలయానికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు. బందర్ రోడ్డులోని రాష్ట్ర కార్యాలయానికి 10 మంది సీఆర్పీఎఫ్ సీబ్బందితో భద్రత కల్పించారు. గన్నవరం లోని  39 బెటాలియన్ నుంచి  1 ఎస్సై, 1 హెడ్ కానిస్టేబుల్, 8 మంది సాయుధ కానిస్టేబుళ్లతో ఆయనకు భద్రత కల్పించారు. 

ఇదిలా ఉండగా... ఒక హైకోర్టు జడ్జి స్థాయి వ్యక్తికి, ఐఏఎస్ అధికారికి రాష్ట్రంలో రక్షణ లేకుండే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ ప్రతిపక్షాలు జగన్ సర్కారును నిలదీశాయి. హింస, అరాచకం అండగా జగన్ పాలన సాగిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ను వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు బెదిరించారు అంటూ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా కేంద్రానికి లేఖ రాశారు. ఎట్టకేలకు కరోనా ఎపిసోడ్, ఎన్నికల కమిషన్ ఎపిసోడ్ తో జగన్ నిజస్వరూపం ప్రపంచానికి తెలిసిపోయింది.