కేంద్రం బిగ్ మిస్టేక్ చేసేసిందా?

August 11, 2020

దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా భయానక దృశ్యాలు. కరోనా బాధితులు, శవాల గురించిన దృశ్యాలు కాదవి. వైన్ షాపుల వద్ద కనిపిస్తున్న దృశ్యాలు. లాక్ డౌన్ కొనసాగించడంతో రాష్ట్రాలకు ఏదో కొద్దిగ అయినా ఆదాయం వస్తుందన్న ఉద్దేశంతో వైన్ షాపులు ఓపెన్ చేసుకునే అధికారాన్ని రాష్ట్రాలకు వదిలేసింది కేంద్రం. 40 రోజుల తర్వాత సడెన్ గా ఓపెన్ చేస్తే దీని విపరిణామాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకున్న కొన్ని రాష్ట్రాలు దానికి భయపడి దూరంగా ఉన్నాయి. కానీ చాలా రాష్ట్రాలు ఈ వెసులు బాటును వినియోగించుకున్నాయి. అదృష్టవశాత్తూ తెలంగాణ, కేరళ రాష్ట్రాలు నిషేధం కొనసాగించాయి. దేశ వ్యాప్తంగా జనం మందు కోసం ఎగబడ్డారు.

ఆకలితో ఉన్న వారు కూడా అన్నం కోసం తపించనంతగా... మందుకోసం మందుబాబులు ఎగబడ్డారు. మందు తమ రాష్ట్రంలో దొరకని సరిహద్దు ప్రాంతాల వారు అది దొరికే రాష్ట్రంలోకి చొరబడ్డారు. తోపులాటలు జరుగుతుంటే ఇక సామాజిక దూరం, మాస్కు అనే పదానికి తావెక్కడిది. నిన్ననే దేశంలో ప్రమాదకరమైన స్థాయిలో రెండున్నర వేల కేసులు బయటపడ్డాక అయినా కేంద్రం ఈ విషయంపై పునరాలోచించలేదు. ఆవేశపడింది. ఇప్పటికే ఆదాయం లేక విలవిల్లాడుతున్న వారు అవకాశాన్ని వాడేసుకున్నారు. దీంతో పోటెత్తిన జనాన్ని చూస్తుంటే... దేశాన్ని గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లగా కాకుండా ప్రపంచమే మనల్ని డేంజర్ జోన్ గా ప్రకటించే పరిస్థితిని కల్పించినట్లయ్యింది. ఒక్క రోజు డ్రై డే పెడతాం అంటేనే ముందు రోజు మందుకోసం ఎగబడే జనాలకు 40 రోజులు తర్వాత ఓపెన్ చేస్తే ఎలా చేస్తారో కేంద్రం గాని ప్రాంతీయ ప్రభుత్వాలు గాని ఊహించలేకపోయాయి. దీంతో తోపులాటలు క్యూలు ఘోరంగా ఉన్నాయి. వారిలో ఒక్కరికి ఉన్నా అందరికీ సోకే పరిస్థితి వస్తుంది. 

వెంటనే కేంద్రం ఈ పరిస్థితిని గమనించి తప్పు తెలుసుకుని సరిదిద్దుకుంటే మంచిది లేకపోతే... మృత్యుఘోశ తప్పదు. కంటైన్ మెంట్ జోన్ల వద్ద కాపపాలు ఏం లేవు. అక్కడి ప్రజలు కూడా గోడలు దూకి వీటికోసం వస్తే.. పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. మేలుకోకపోతే దేశం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే డోర్ డెలివరీ పెట్టాలి. లేదంటే మూసేయాలి. కానీ ఈ క్యూలు మాత్రం వద్దే వద్దు.