పోలవరంపై కేంద్రం మడత పేచీ!

May 28, 2020

ప్రధాన పనులే దాని బాధ్యతట!!
పునరావాస వ్యయం రాష్ట్రమే భరించాలట!
ఇలాగైతే పూర్తవడం కష్టమే
రివర్స్‌ టెండరింగ్‌ పేరిట
నాశనం చేసిన జగన్‌
ఇప్పుడు కేంద్రం తీరుతో దుంపనాశనమే!!
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కాలక్రమేణా ఆగిపోయే దిశగా నడుస్తోంది. రివర్స్‌ టెండరింగ్‌ పేరిట పది నెలలుగా జగన్‌ ప్రభుత్వం పనులు ఆపేసింది. అత్యంత వేగంగా కాంక్రీటు పనులు చేపడుతున్న నవయుగ ఇంజనీరింగ్‌ సంస్థను తప్పించి.. తన తాబేదారయిన మేఘా ఇంజనీరింగ్‌కు కట్టబెట్టడం ద్వారా ప్రాజెక్టు నాశనానికి పూనుకుంటే.. కేంద్రం మూడడుగులు ముందుకేసి.. దానిని దుంపనాశనం చేయడానికి ఉపక్రమిస్తోంది. ఈ విషయంలో మోదీ ప్రభుత్వ వైఖరి ఏరుదాటాక తెప్ప తగలేసిన చందంగా ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస వ్యయం మొత్తం తానే భరిస్తానని హామీ ఇచ్చి.. ఇప్పుడు మాటమార్చేసింది. ప్రత్యేక హోదా బదులు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో దీనికి నూరు శాతం నిధులు తానే సమకూర్చుతానని హామీ ఇచ్చింది. పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రులు ప్రకటించారు. ఇప్పుడు సవరించిన అంచనా వ్యయం రూ.55 వేల కోట్లకు చేరడంతో కేంద్రం మాటమార్చేసింది. సహాయ పునరావాస ప్యాకేజీ అమలును రాష్ట్రప్రభుత్వం ఎంత త్వరగా పూర్తి చేస్తే తాము అంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేస్తామని వెల్లడించింది. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ రాష్ట్ర పరిధిలోని అంశమని, ఈ విషయంలో అదే త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత రాజ్యసభలో స్పష్టం చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టెండర్ల విషయంలో అక్రమాలు జరగాయని జగన్‌.. ఈ ప్రాజెక్టుకు కేంద్రం పైసా ఇవ్వకున్నా.. దానిని చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారని మోదీ.. ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు మోదీ కేబినెట్‌లోని మంత్రే అలాంటి అక్రమాలేవీ జరగలేదని.. కాంట్రాక్టు సంస్థలు నయాపైసా కూడా అదనంగా  చెల్లించలేదని పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం.. తన తాబేదారును కాంట్రాక్టరుగా నియమించుకోవడానికి జగన్‌ తన బంధువు పీటర్‌ నేతృత్వంలో నిపుణుల కమిటీని వేసి.. అధిక చెల్లింపులు చేశారని నివేదిక ఇప్పించారు. దానికి అనుగుణంగా నవయుగతో కాంట్రాక్టును రద్దుచేసుకున్నారు. కేవలం చంద్రబాబుపై అభిమానంతో.. రాష్ట్రానికి మేలు చేకూరుతుందన్న ఉద్దేశంతో ఆ సంస్థ నష్టానికి పనులు చేసింది. జగనే రద్దుచేయడంతో దీనిని హైకోర్టులో సవాల్‌ చేయలేదు. కానీ పోలవరం జలవిద్యుత్కేంద్రం కాంట్రాక్టు నుంచి తొలగించడంపై మాత్రం కోర్టుకెళ్లింది. ప్రస్తుతం అది హైకోర్టు విచారణలో ఉంది. ఈ సంగతి పక్కనపెడితే.. పునరావాసానికి దరిదాపుగా రూ.33 వేల కోట్ల వ్యయమవుతుంది. ఉద్యోగులకు జీతాల చెల్లింపులకే అప్పులు తెస్తున్న జగన్‌.. ప్రస్తుత బడ్జెట్‌లో ప్రాజెక్టులను 16 వేల కోట్లు కేటాయించి.. రూపాయి కూడా ఇవ్వని జగన్‌.. అంత సొమ్ము రెండేళ్లలో ఖర్చుపెట్టడం అసాధ్యం. అప్పు తెద్దామంటే బ్యాంకులు ఇవ్వడం లేదు. కేంద్రం మనసు మార్చడానికి ఎలాంటి ప్రయత్నాలూ చేయడం లేదు. తన అక్రమాస్తుల కేసుల విషయంలో మాత్రం పదే పదే మోదీ, హోంమంత్రి అమితషాలను కలిసి ప్రాధేయపడుతున్న ఆయనకు.. రాష్ట్ర ప్రయోజనాలు ఏ మాత్రం పట్టడం లేదని సీనియర్‌ అధికారులే అంటున్నారు.
కేంద్ర బడ్జెట్‌లో ఆ ఊసేలేదు..
ఇంకోవైపు.. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ఖర్చు ఊసే లేదు. ఏ పద్దు కింద దానికి చెల్లింపులు చేస్తారో స్పష్టత లేదు. అంతేకాదు.. రాష్ట్రప్రభుత్వం ఇంతవరకు దానిపై చేసిన ఖర్చు రీయింబర్స్‌ చేయలేదు. రూ.3,500 కోట్లకు పైగా రావలసి ఉంది. ఇందులో రూ.1,850 కోట్లు విడుదల చేస్తున్నట్లు జలశక్తి శాఖ ప్రకటించింది. కానీ ఇంతవరకు అతీగతీ లేదు. రెండు నెలలుగా రాష్ట్ర అధికారులు ఈ సొమ్ము కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నా.. వారి మొర ఆలకించే నాథుడే లేడు. పైపెచ్చు.. ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు జరగలేదని .. అందువల్ల ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయానికి నిధులను ఉదారంగా విడుదల చేయలేమంటూ కేంద్ర ఆర్థిక శాఖ కూడా తేల్చిచెప్పింది. ప్రాజెక్టు పనులకు చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయని జగన్‌ నియమించిన నిపుణుల కమిటీ నివేదికను దగ్గరపెట్టుకుని కేంద్రం దాగుడుమూతలాడుతోంది. ఇంతవరకు విడుదల చేసిన నిధుల వ్యయంలో అక్రమాలు జరగలేదని తాను నియమించే నిపుణుల కమిటీ నివేదిక ఇస్తేనే మున్ముందు నిధుల మంజూరు ఉంటుందని స్పష్టం చేసింది. చంద్రబాబుపై రాజకీయ దుగ్ధతో.. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని జగన్‌ చేసిన అకృత్యాలు ఇప్పుడు ఆయన సర్కారు మెడకే చుట్టుకుంటున్నాయి.
జలసంఘం ద్వారా హెచ్చరికలు
నిజానికి చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రధాన పనులపైనే ఎక్కువ దృష్టిపెట్టింది. ఐదారేళ్లకు పునాదులు కూడా లేవని జాతీయ ప్రాజెక్టులు ఉన్న తరుణంలో.. కేవలం రెండేళ్లలో 63 శాతం కాంక్రీటు పనులు పూర్తిచేశారు. అయితే అంత వేగంగా కేంద్రం నిధులివ్వలేదు. సహాయ పునరావాసాలకు కూడా సహాయ నిరాకరణే చేసింది. జగన్‌ వచ్చాక పనులు స్తంభించిపోయాయి. మేఘా నాలుగు బస్తాల సిమెంటు పనిచేపట్టి.. ఏదో ప్రారంభించాననిపించింది. సహాయ పునరావాసాల్లో వేగం లేకపోవడంతో కేంద్రం కేంద్ర జలసంఘం ద్వారా రాష్ట్రప్రభుత్వానికి తరచూ హెచ్చరికలు పంపుతోంది. ముంపు గ్రామాలకు సహాయ పునరావాస కార్యక్రమాలను పూర్తి చేసినప్పుడే.. ప్రాజెక్టు సంపూర్ణమైనట్లుగా భావించాల్సి ఉంటుందని.. కేవలం హెడ్‌వర్క్స్‌ను పూర్తి చేసినంత మాత్రాన ప్రాజెక్టు పూర్తయినట్లు కాదని స్పష్టం చేసింది. ఇందుకు ఉదాహరణగా సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ను ప్రస్తావించింది. సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ హెడ్‌ వర్క్స్‌ పూర్తయినా.. పునరావాసం పూర్తి చేసేందుకు ఇరవై ఏళ్లు పట్టింది. ముంపు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేంత వరకూ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలను తొలుత ఆదుకోవాలని సూచించింది. ఇదే సమయంలో ఇంకా 55,599 ఎకరాల భూసేకరణ పూర్తి కావలసి ఉందని ఎస్‌కే హాల్దర్‌ కమిటీ గుర్తుచేసింది. 2004 నుంచి ఈ ప్రాజెక్టు చేపడుతున్నా..  నిర్వాసితులవుతున్న వారిని ఆదుకోలేకపోయారని ఆక్షేపించింది. 2013కు ముందు భూసేకరణ చట్టం చౌకగా.. సులువుగా ఉందని.. నాడే మొత్తం భూములు ఎందుకు సేకరించలేదని నిలదీసింది. రాష్ట్రం నిధుల ప్రస్తావన తేవడంతో వాటితో తమకు సంబంధం లేదని.. ప్రాజెక్టు నిర్మాణ పర్యవేక్షణే తమ కర్తవ్యమని.. కేంద్రంతో రాష్ట్రమే మాట్లాడుకోవాలని ఉచిత సలహా పడేసింది. దీనిపై జగన్‌ ప్రభుత్వం నోరుమెదపడం లేదు. తనకెందుకన్నట్లు అంటీముట్టనట్లు వ్యవహరిస్తోంది. అంటే అమరావతిలాగే పోలవరానికి కూడా మూతబండ వేస్తారన్న మాట!