కేంద్రం జోక్యం తప్పదు!!

June 04, 2020

రాజధానిలో అది కూడా భాగస్వామే
అమరావతిలో ప్రతి అడుగూ పర్యవేక్షణ
కమిటీ వేసి.. నిధులిచ్చింది మోదీ సర్కారే
అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానానికీ ఆమోదం
తీర్మానంలో కోరినట్లే పలు వెసులుబాట్లు
అటవీ భూముల డీనోటిఫై
పన్నుల నుంచీ ఊరట
రాజధాని కోసం రూ.1,500 కోట్లు సాయం
బెజవాడ-గుంటూరు డ్రైనేజీకి వెయ్యికోట్లు
పలు కేంద్ర సంస్థల ఏర్పాటుకు భూములు
ఈ సొమ్ముకు కేంద్రం బాధ్యత లేదా?


సాధారణంగా రాష్ట్రాల రాజధానుల నిర్ణయం విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉండదు. ఇందులో వేరే అభిప్రాయానికి తావులేవు. అయితే నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఎంపిక నుంచి నిధుల కేటాయింపు వరకు కేంద్రం ప్రమేయం ఉంది. అదే నిధులిచ్చి అభివృద్ధికి బాటలు వేసింది. ఆర్‌బీఐ సహా పలు కేంద్ర సంస్థలు డబ్బులు చెల్లించి అమరావతి ప్రాంతంలో భూములు తీసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజధాని విషయంలో కేంద్రం కూడా భాగస్వామి అవునా.. కాదా? అమరావతిని రాజధాని ప్రాంతంగా ఏర్పాటు చేయాలని అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించింది. ఆ ఆమోదం తర్వాతే అమరావతికి నిధులు విడుదల చేసింది. అంతేకాదు.. అవసరాన్ని బట్టి అటవీ భూములను కూడా రాజధాని కోసం డీనోటిఫై చేస్తూ వచ్చింది. దేశంలోని ఏ రాజధానికీ కేంద్రం ఇలా సాయం చేయలేదు. అందుకే అమరావతిలో కేంద్రానికి భాగస్వామ్యం ఉన్నదన్నది సుస్పష్టం. రాష్ట్ర విభజన అనంతరం.. నవ్యాంధ్రకు రాజధాని ఎక్కడుండాలో నిర్ణయించేందుకు శివరామకృష్ణన్‌ కమిటీని కేంద్రం నియమించింది. రాజధానిని ఎక్కడ ఏర్పాటుచేస్తే ఎలా ఉంటుంది.. దానిలోని లాభనష్టాలేమిటో వివరిస్తూ ఈ కమిటీ కొన్ని సూచనలిచ్చింది. తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను రాష్ట్రప్రభుత్వానికి వదిలిపెట్టింది. నాటి చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి, విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించింది. దీనికి అప్పటి సభలో టీడీపీ, వైసీపీ, బీజేపీ మద్దతిచ్చాయి. ఆనాడు తీర్మానం కూడా ఏకగ్రీవమే. ఏ ఒక్క పార్టీ, ఒక్క ఎమ్మెల్యే కూడా వ్యతిరేకించలేదు. ప్రస్తుత సీఎం జగన్‌ అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన కూడా ప్రాంతీయ విద్వేషాలు రేగకుండా ఉండేందుకు తాను మద్దతిస్తున్నానని.. అయితే రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు అవసరమని చెప్పారు. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించి...అమరావతిని రాజధానిగా గుర్తించింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 94(3)ప్రకారం.. రాజధానిలో అవసరమైన సదుపాయాలు.. అంటే రాజ్‌భవన్‌, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు  ఏర్పాటుకు, నిర్మాణానికి కేంద్రం నిధులివ్వాలి. దీని ప్రకారమే రాజధానికి రూ.1,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. సచివాలయం, శాసనసభ, శాసనమండలి, హైకోర్టు భవనాల నిర్మాణం జరిగింది. అదేసమయంలో అమరావతి ప్రాంతం విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి మధ్యలో ఉందని.. కాలక్రమంలో ఇవన్నీ కలిసిపోయి ఒక మెగా రాజధానిగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీంతో విజయవాడ, గుంటూరుల్లో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుకు కేంద్రం రూ.1,000 కోట్లు ఇచ్చింది. దీనినీ రాజధానికి ఇచ్చిన లెక్కల్లోనే కేంద్రం చూపించింది.
గతంలో ఇలా లేదు..
ఇదివరకు ఏర్పడిన రాష్ట్రాలన్నీ ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లకు అనుగుణంగా విడిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌ విషయంలో మాత్రం సీమాంధ్ర ప్రాంతం వద్దన్నా.. రాష్ట్ర విభజన జరిగింది. దీంతో రాజధానికి కేంద్రమే సాయం చేయాలన్న నిబంధనను విభజన చట్టంలోనే పెట్టారు. ఆ మేరకు కేంద్రం కూడా భాగస్వామిగా ఉండి, రాజధాని నిర్మాణానికి నిధులిచ్చింది. విభజన చట్టం 94(4) సెక్షన్‌ ప్రకారం.. రాజధాని నిర్మాణం కోసం అవసరమైతే అటవీ భూములను డీనోటిఫై చేసేందుకు కూడా కేంద్రం సహకరించింది. ఎయిమ్స్‌ నిర్మాణం కోసం, ఇతర చోట్ల ఇలాంటి మినహాయింపులిచ్చింది కూడా. రాజధాని రైతులకు కేపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ మినహాయుంపు కేంద్రమే ఇచ్చింది. లాభాల మీద వేసే పన్ను. ఒక వ్యక్తికి ఉన్న ఆస్తులు...ఇళ్లు, అపార్ట్‌మెంట్‌, షేర్లు, పొలాలు, స్థలాలు...ఇవన్నీ మూలధన స్థిరాస్థులు. ఇలాంటివాటిని కొనుగోలు చేసిన విలువ కంటే ఎక్కువకు అమ్మినప్పుడు వచ్చే లాభంపై పన్ను వేస్తారు. అమరావతిలో రైతుల పొలాలు విక్రయించినప్పుడు కూడా ఈ కేపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ కట్టాలి. అయితే ఇక్కడంతా చిన్నసన్నకారు రైతులే కావడంతో రాజధాని పరిధిలోని 29గ్రామాల వరకు ఈ పన్నుకు మినహాయింపు ఇవ్వాలని నాటి రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. ప్రధాని మోదీ, అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీలతో చంద్రబాబు, నాడు కేంద్ర మంత్రిగా ఉన్న సుజనాచౌదరి పలుమార్లు దీనిపై మాట్లాడారు. చివరకు కేంద్రం అంగీకరించి ఈ పన్ను మినహాయింపు ఇచ్చింది. తనకు వచ్చే ఆదాయాన్ని వదులుకుంది.
కేంద్ర సంస్థలకు భూమి
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రాజధానిలో భూమిని తీసుకున్నాయి. ఈ భూమిని వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వలేదు. కేటాయించిన భూములపై సుమారు రూ.175 కోట్ల ధర వసూలుచేసింది. భారత సైన్యం, రైల్‌ టెల్‌ కార్పొరేషన్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ సెంటర్‌ తదితర సంస్థలు భూమిని తీసుకున్నాయి. రాజధాని కాబట్టే ఇక్కడ తమ కార్యాలయాలు పెట్టేందుకు ముందుకొచ్చాయి. డబ్బులు చెల్లించి భూమిని తీసుకున్నాయి. రాజధానిలో భూములు తీసుకోవడం, వాటికి డబ్బు చెల్లించడం ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం రాజధానిలో భాగస్వామేనని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, జేఏసీ నేతలు కూడా చెబుతున్నారు.
బాక్సుగా..
కేంద్ర సంస్థలకు దిక్కేది?!
భూమి రేటు ఎక్కువా తక్కువా అనేది కాకుండా తమ కార్యాలయాలు రాజధానిలో ఉండాలని కేంద్ర ప్రభుత్వం, ఇతర ప్రైవేటు సంస్థలు ఆసక్తి ప్రదర్శించాయి. 130 కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు 1,293 ఎకరాలు తీసుకున్నాయి. వాటిలో కొన్ని సంస్థలు నిర్మాణాలను కొనసాగిస్తున్నాయి. మరికొన్ని నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. మంగళగిరి ఎయిమ్స్‌ రెండేళ్ల క్రితమే ప్రారంభమై.. తాజాగా అత్యాధునిక వైద్య యంత్రాలను కూడా సమకూర్చుకొంది. ఇంకొన్ని కీలక సంస్థలు భవంతులకు సంబంధించిన ప్లాన్లకు ఉన్నతాధికారులు, సంబంధిత సంస్థల నుంచి అనుమతులు పొందాయి. ఇప్పుడు రాజధానిని విశాఖకు తరలించాలన్న జగన్‌ ప్రభుత్వం నిర్ణయం భూములిచ్చిన రైతులను నట్టేట ముంచితే.. గంపెడు అంచనాలతో అడుగుపెట్టిన ఈ సంస్థల పరిస్థితీ అగమ్యగోచరంగా మారింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని తాము కలలో కూడా అనుకోలేదని పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులు, బాధ్యులు ఆంతరంగిక సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వారు తిరగదోడకుండా, వాటికే కట్టుబడి ఉండడంతో ఆయా రాజధానుల్లో ఎక్కడా తమ కార్యాలయాలు, శాఖలను ఏర్పాటు చేయడంలో ఎటువంటి ఇబ్బందులు గానీ, సందిగ్ధతను గానీ ఎదుర్కొనలేదని గుర్తుచేస్తున్నారు. అమరావతిలో అందుకు పూర్తిగా భిన్నమైన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఇతర రాష్ట్రాల రాజధానుల మాదిరిగా కాకుండా అమరావతి పూర్తి గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీగా, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమవుతుందన్న నమ్మకంతో తదనుగుణంగానే అందులో తమ కార్యాలయాలు, సిబ్బంది నివాస సముదాయాలను నిర్మించేందుకు ప్రణాళికలను రచించుకున్నామని అంటున్నారు. ఎకరాకు రూ.25 లక్షల నుంచి రూ.4 కోట్ల వరకు చెల్లించి.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వరకు పలు సంస్థలు ఇక్కడ భూములు కొనుగోలు చేశాయి. ఇలా మొత్తంమీద సుమారు రూ.450 కోట్లకు పైగా సంస్థలు వెచ్చించాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్‌ఐసీ, సీపీడబ్ల్యూడీ, ఎస్డీపీవో, బీఐఎస్‌, తపాలా, నావికాదళం, ఎఫ్‌సీఐ, ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, నాబార్డ్‌, కాగ్‌, రైట్స్‌, ఫోరెన్సిక్‌, ఎన్‌ఐఏసీ, హెచ్‌పీసీఎల్‌, సిండికేట్‌ బ్యాంక్‌, ఏపీఎన్నార్టీ, ఆప్కాబ్‌, హెచ్‌సీఎల్‌.. వంటి ఎన్నో సంస్థలు భూములను కొనుగోలు చేశాయి. వీటిలో అత్యధికం ఆయా భూముల్లో తమ కార్యాలయ భవనాలను నిర్మించేందుకు అనువైన ప్లాన్లను సైతం సిద్ధం చేసుకుని, సంబంధిత అనుమతులను కూడా పొందాయి. బయో డైవర్సిటీ మ్యూజియం, భారత పురావస్తు విభాగం మ్యూజియం వంటివాటికీ చంద్రబాబు ప్రభుత్వం భూములు కేటాయించింది. చివరకు తిరుమలలోని శ్రీవారి దేవాలయం తరహాలో అమరావతిలో కోవెలను నిర్మించేందుకు టీటీడీకి అప్పటి ప్రభుత్వం 25 ఎకరాలు ఇచ్చింది. కొన్ని నెలల కింద పనులను కూడా ప్రారంభించారు. అయితే వైసీపీ ప్రభుత్వ ప్రాధాన్యాలు మారిన దృష్ట్యా ఈ పనులు ఆగిపోయాయి. దీంతో అసలు శ్రీవారి ఆలయ నిర్మాణం జరుగుతుందా? లేదా? అని శ్రీవారి భక్తులు ఆవేదన చెందుతున్నారు. అదేవిధంగా బ్రహ్మకుమారీస్‌ తదితర ఆధ్యాత్మిక సంస్థలు కూడా తాము కొనుగోలు చేసిన భూముల్లో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలను రచించుకున్నా.. ఇప్పుడు ఏం చేయాలో తెలియక తర్జన భర్జన పడుతున్నాయి.
హోటళ్లు అటకెక్కాయి..
అమరావతికి భవిష్యతలో సందర్శకులు, పర్యాటకుల సందడి గణనీయంగా పెరుగుతుందన్న అంచనాతో దేశ, విదేశాలకు చెందిన ఎన్నో ప్రముఖ హోటల్‌ గ్రూపులు రాజధానిలో హోటళ్లను నిర్మించుకునేందుకు భూములను పొందాయి. వీటిలో నోవోటెల్‌, ఫార్చ్యూన్‌, హయత, రీజెన్సీ వంటివి ఉన్నాయి. ఈ సంస్థల్లో కొన్ని ఇప్పటికే తమకు కేటాయించిన భూములను నిర్మాణానికి అనువుగా చదును, మెరక చేయించడమే కాకుండా నిర్మాణాలకు అవసరమైన సాయిల్‌ టెస్ట్‌లను సైతం చేయించాయి. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వ నిర్ణయంతో తమ పెట్టుబడుల మాటేంటని తలలు పట్టుకుంటున్నాయి. ప్రత్యక్షంగా అమరావతిలో లేనప్పటికీ దానికి అత్యంత చేరువలో ఉన్న మంగళగిరి వద్ద కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మితమవుతున్న ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌). ఈ సంస్థ పరిస్థితి కూడా డోలాయమానంలో పడింది. వందల కోట్ల రూపాయలతో రాష్ట్రానికే మణిమకుటంగా రూపొందుతున్న ఈ జాతీయ స్థాయి వైద్య సంస్థ రాష్ట్రంలోని మధ్యభాగాన ఉన్నందున దాని సేవలను అన్ని ప్రాంతాల వారూ సులభంగా పొందగలుగుతారని భావించారు. రాజధాని నగరానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్న దీని ద్వారా భవిష్యతలో అమరావతి, విజయవాడ, గుంటూరులలో భారీఎత్తున పెరగబోయే జనాభాకు అత్యంత నాణ్యమైన వైద్యసేవలందగలవని అనుకున్నారు. రాజధాని ముక్కలైతే సహజంగానే రాష్ట్ర ప్రజలు పూర్తిస్థాయిలో ఎయిమ్స్‌ సేవలు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
విద్యాసంస్థల్లో గుబులు..
రాజధాని నగరంలో పలు ప్రఖ్యాత ప్రైవేటు విద్యాసంస్థలు స్థలాలు పొందాయి. వాటిల్లో ఎస్‌.ఆర్‌.ఎం., విట్‌ వంటివి ఇప్పటికే భవనాలను నిర్మించి, గత మూడేళ్లుగా తరగతులను సైతం నిర్వహిస్తున్నాయి. ఈ రెండింట్లో కలిపి 10,000 మందికిపైగా పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థినీవిద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అమృత, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్స్‌ (ఎన్‌ఐడీ) తదితరాల నిర్మాణాలను చురుగ్గా సాగుతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరంలో ఇవి కూడా తరగతులను ప్రారంభించేందుకు సిద్ధపడుతున్నాయి. ఇవి కాకుండా సీఐటీడీ, ఏపీహెచ్చార్డీసీ, బీఆర్‌ శెట్టి, నిఫ్ట్‌, రెండు కేంద్రీయ విద్యాలయాలు, జేవియర్‌, ఎల్వీపీఈఐ, హెరిటేజ్‌, ఓక్‌రిడ్జ్  తదితర ప్రముఖ విద్యా సంస్థలు నిర్మాణాలకు సమాయత్తమయ్యాయి. దేశీయ ఐటీ రంగ దిగ్గజాల్లో ఒకటైన హెచ్‌సీఎల్‌ కూడా తన ప్రాంగణాన్ని అమరావతిలో ప్రారంభించేందుకు వీలుగా ఐనవోలుకు సమీపాన స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇలాంటివి ఇంకా మరెన్నో ఉన్నాయి. వీటన్నిటి పరిస్థితి ఏమిటో జగన్‌ ప్రభుత్వం నోరుమెదపడం లేదు.